20
అమ్మోనీయులను యోవాబు నాశనం చేయటం
1 ఆ తరువాత సంవత్సరం (వసంత కాలం) లో యోవాబు ఇశ్రాయేలు సైన్యాన్ని యుద్ధానికి నడిపాడు. సంవత్సరంలో అది రాజులు దండ యాత్రలు చేయటానికి అనువైన సమయం. కాని దావీదు మాత్రం యెరూషలేములోనే వున్నాడు. ఇంతలో ఇశ్రాయేలు సైన్యం అమ్మోను రాజ్యం మీదికి దండెత్తి, దానిని నాశనం చేసింది. పిమ్మట వారు రబ్బా నగరానికి వెళ్లారు. వారు నగరాన్ని చుట్టుముట్టి, ప్రజల రాకపోకలు నిలిపివేసారు. యోవాబు, ఇశ్రాయేలు సైనికులు రబ్బా నగరం నాశనమయ్యే వరకు దానిపై దాడిచేసారు.
2 తరువాత దావీదు వచ్చి ఆ రాజు తలపై కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ బంగారు కిరీటం డెబ్బై ఐదు పౌనుల (రెండు మణుగుల) బరువుంది. కిరీటంలో విలువైన రత్నాలు పొదగబడ్డాయి. ఆ కిరీటం దావీదు తలపై పెట్టబడింది. రబ్బా నగరం నుండి దావీదు అనేక విలువైన వస్తు సామగ్రిని తెప్పించాడు.
3 రబ్బా నగర వాసులను దావీదు తీసుకొనివచ్చి వారిచే రంపాలతోను, ఇనుప సమ్మెటలతోను, గొడ్డళ్లతోను బలవంతంగా పని చేయించాడు. ప్రతి అమ్మోనీయుల నగరంలోను దావీదు ఈ విధంగానే చేసాడు. తరువాత దావీదు, అతని సైన్యం యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
ఫిలిష్తీ యోధుల సంహారం
4 ఇదంతా అయిన పిమ్మట ఇశ్రాయేలు ప్రజలు గెజెరు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో తలపడ్డారు. ఈసారి హుషాతీయుడైన సిబ్బెకై సిప్పయి అను వానిని చంపివేసాడు. సిప్పయి ఫిలిష్తీ యోధుల సంతతివాడు. దానితో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారికి బానిసలయ్యారు.
5 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల పైకి మరోసారి యుద్ధానికి వెళ్లారు. యాయీరు కుమారుడైన ఎల్హానాను అనేవాడు లహ్మీని చంపాడు. లహ్మీ అనేవాడు గొల్యాతు సోదరుడు. గొల్యాతు గాతు పట్టణానికి చెందినవాడు. లహ్మీ చేతిలోని ఈటె చాలా పెద్దది. బరువైనది. అది నేతగాని మగ్గం దోనెవలె వుంటుంది.
6 గాతు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు వారు మరొక యుద్ధం చేశారు. ఈ పట్టణంలో చాలా పొడుగైన మనిషి ఒకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఇరవై నాలుగు వేళ్లున్నాయి. వాని ప్రతి చేతికి, ప్రతి కాలికి ఆరేసి వేళ్లు చొప్పున వున్నాయి. అతడు కూడ ఫిలిష్తీయుల రెఫాయిము సంతానంలోనివాడే.
7 ఆ మనుష్యుడు ఇశ్రాయేలు వారిని చూచి ఎగతాళి చేసినప్పుడు, యోనాతాను వానిని చంపివేశాడు. యోనాతాను తండ్రి పేరు షిమ్యా. షిమ్యా దావీదుకు సోదరుడు.
8 ఆ ఫిలిష్తీయులంతా గాతు పట్టణానికి చెందిన రెఫాయిము సంతానమే. దావీదు, అతని సేవకులు కలిసి ఆ రాక్షసులనందరినీ చంపివేసారు.