19
ఎఫెసులో యోహాను శిష్యగణం క్రైస్తవులు కావడం
1 అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, “మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?” అని అడిగాడు.
2 వారు, “అసలు పరిశుద్ధాత్మను గురించి మేము వినలేదు” అని చెప్పారు.
3 అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?” అని అడగ్గా, వారు, “యోహాను బాప్తిసం” అని చెప్పారు.
4 అందుకు పౌలు, “యోహాను తన వెనక వచ్చే వాడిలో, అంటే యేసులో విశ్వాసముంచాలని ప్రజలతో చెబుతూ, పశ్చాత్తాపం విషయమైన బాప్తిసమిచ్చాడు” అని చెప్పాడు.
5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు.
6 తరువాత పౌలు వారి మీద చేతులుంచినపుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాటలాడటం, ప్రవచించడం మొదలుపెట్టారు.
7 వారందరూ సుమారు పన్నెండు మంది పురుషులు.
సమాజమందిరంలో ఆపైన తురన్ను అనే వాడి బడిలో పౌలు బోధనలు
8 తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు.
9 అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.
10 రెండు సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. కాబట్టి యూదులు, గ్రీకులు, ఆసియలో నివసించే వారంతా ప్రభువు వాక్కు విన్నారు.
పౌలు చేసిన అద్భుతాలు
11 అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు.
12 అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి.
13 అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు తమ స్వలాభం కోసం యేసు నామం ఉపయోగిస్తూ, “పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను” అని చెప్పి, దురాత్మలు పట్టినవారిపై ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకున్నారు.
14 స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు.
15 అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది.
16 ఆ దురాత్మ పట్టినవాడు ఎగిరి మీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత ఆ మంత్రగాళ్ళు గాయాలతో బట్టల్లేకుండా పారిపోయారు.
17 ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం వేసింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది.
18 విశ్వసించినవారు చాలా మంది వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.
19 అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, అందరూ చూస్తుండగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి నాణాలు అయింది.
20 అంత ప్రభావ సహితంగా ప్రభువు వాక్కు వ్యాపించింది.
21 పౌలు ఎఫెసులో పరిచర్య ముగించిన తరువాత మాసిదోనియ, అకయ దేశాల మార్గంలో యెరూషలేము వెళ్ళాలని ఆత్మలో ఉద్దేశించి ‘నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమ్ నగరాన్ని కూడా చూడాలి’ అని నిర్ణయించుకున్నాడు.
22 అప్పుడు తన పరిచారకుల్లో తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియ పంపించి తాను మాత్రం ఆసియలో కొంతకాలం నిలిచిపోయాడు.
ఎఫెసులో కంసాలుల ఆగడం
23 ఆ రోజుల్లో క్రీస్తు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది.
24 ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చేయిస్తూ అక్కడి పనివారికి మంచి ఆదాయం కల్పించేవాడు.
25 అతడు వారిని, ఆ వృత్తిలో ఉన్న ఇతరులను పోగుచేసి వారితో, “ఈ పని ద్వారా మనకి మంచి ఆదాయం వస్తూ మన జీవనోపాధి బాగా జరుగుతూ ఉందని మీకు తెలుసు.
26 అయితే ఈ పౌలు, చేతులతో చేసిన విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కారని బోధించి, ఎఫెసులో మాత్రమే కాక మొత్తం ఆసియా అంతట చాలామంది ప్రజలను పెడదారి పట్టించాడని మీరు విన్నారు, చూశారు కూడా.
27 పైగా మన వృత్తి మీద శ్రద్ధ తగ్గిపోవడమే కాక, డయానా దేవస్థానం కూడ నిర్లక్షానికి గురై, ఆసియా అంతటా, ఇంకా భూలోకమంతటా పూజలందుకుంటున్న ఈమె ప్రభావం తగ్గిపోతుందేమో అని నాకు భయం వేస్తున్నది” అని వారితో చెప్పాడు.
28 వారు అది విని ఉగ్రులైపోయి, “ఎఫెసీయుల డయానా మహాదేవి” అని కేకలు వేశారు.
29 దానితో పట్టణం బహు గందరగోళంగా తయారైంది. వెంటనే వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియాకు చెందిన గాయి, అరిస్తార్కులను పట్టుకుని దొమ్మీగా అక్కడి నాటక ప్రదర్శనశాలలోకి ఈడ్చుకు పోయారు.
30 పౌలు ఆ జనసమూహం పోగైన సభ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు గాని, శిష్యులు అతనిని వెళ్ళనియ్యలేదు.
31 అంతేగాక ఆసియా దేశాధికారుల్లో అతని స్నేహితులు కొందరు అతనికి కబురు పంపి, “నీవు నాటక ప్రదర్శనశాలలోకి వెళ్ళవద్దు” అని నచ్చజెప్పారు.
32 ఆ సభ గందరగోళంగా ఉంది. కొందరు ఒక రకంగా, మరికొందరు మరో రకంగా కేకలు వేస్తున్నారు. అసలు తామెందుకు అక్కడ గుమిగూడామో చాలా మందికి తెలియనే లేదు.
33 అప్పుడు యూదులు అలెగ్జాండరును ముందుకు తోసి అతనిని జనం ఎదుటికి తెచ్చారు. అలెగ్జాండర్ చేతితో సైగ చేసి ఆ ప్రజలకు వివరణ ఇవ్వాలని చూశాడు.
34 అయితే అతడు యూదుడని వారికి తెలిసి అందరూ మూకుమ్మడిగా రెండు గంటల సేపు ‘ఎఫెసీయుల డయానా మహాదేవి’ అని నినాదాలు చేశారు.
35 అప్పుడు ఊరి కరణం సమూహాన్ని సముదాయించి, “ఎఫెసు వాసులారా, ఎఫెసు పట్టణం డయానా మహాదేవికీ ఆకాశం నుండి పడిన పవిత్ర శిలకూ ధర్మకర్త అని తెలియని వారెవరు?
36 ఈ సంగతులు తిరుగులేనివి కాబట్టి మీరు శాంతం వహించి ఏ విషయంలోనూ తొందరపడకపోతే మంచిది.
37 మీరు ఈ వ్యక్తులను తీసికొచ్చారు గదా, వీరు గుడిని దోచుకున్న వారా? మన దేవతను దూషించారా?
38 దేమేత్రికీ అతనితో ఉన్న కంసాలులకూ వీరి మీద ఆరోపణలు ఏవైనా ఉంటే న్యాయసభలు జరుగుతున్నాయి, అధికారులు ఉన్నారు కాబట్టి వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేయవచ్చు.
39 అయితే మీరు ఇతర సంగతులను గురించి విచారణ చేయాలనుకుంటే అవి క్రమమైన సభలోనే పరిష్కారమవుతాయి.
40 మనం ఈ గందరగోళం గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేదు గనక, ఈ రోజు జరిగిన అల్లరిని గురించి అధికారులు మనపై విచారణ జరుపుతారేమో అని భయంగా ఉంది. ఈ విధంగా గుంపు కూడడానికి తగిన కారణం ఏం చెబుతాం?” అని వారితో అన్నాడు.
41 అతడలా చెప్పి సభను ముగించేశాడు.