2
నిర్దోషిగా అయ్యేది విశ్వాసం మూలంగానే
గలతీ 2:15-3:24
పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్ళాను. మేము వెళ్ళాలని దేవుడు దర్శనంలో నాకు చెబితేనే వెళ్ళాను. నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, లేక వ్యర్థమైపోయిందేమో అని నేను యూదేతరులకు ప్రకటిస్తున్న సువార్త గురించి విశ్వాసుల్లో ముఖ్యమైన నాయకులకు ఏకాంతంగా వివరించాను.
అయినా నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికీ సున్నతి పొందాలని ఎవరూ అతణ్ణి బలవంతం చేయలేదు. క్రీస్తు యేసులో మనకు కలిగిన స్వాతంత్రాన్ని కనిపెట్టడానికీ, మనలను ధర్మశాస్త్రానికి బానిసలుగా చేసుకోడానికీ క్రీస్తు యేసు వల్ల మనకు కలిగిన స్వేచ్ఛను గూఢచారుల్లాగా కనిపెట్టడానికి రహస్యంగా కపట సోదరులు ప్రవేశించారు. సువార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు.
ఇతరులు నాయకులుగా ఎంచిన వారు నేను చెప్పిన సందేశానికి ఏ మార్పులు చేర్పులు చేయలేదు. ఆ నాయకులు గొప్పవారే కానీ వారు నాకంత ప్రధానం కాదు. దేవుడు మనిషి పైరూపం చూడడు. అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి దేవుడు సువార్తను పేతురుకు ఎలా అప్పగించాడో అలాగే సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు అప్పగించాడని వారు గ్రహించారు. అంటే సున్నతి పొందిన వారికి అపొస్తలుడుగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే యూదేతరులకు అపొస్తలుడుగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం కలగజేశాడు.
నాయకులుగా పేరొందిన యాకోబు, కేఫా, యోహాను, అనే వారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గుర్తించి, మేము యూదేతరులకూ, తాము సున్నతి పొందిన వారికీ అపొస్తలులుగా ఉండాలని చెప్పి, సహవాసానికి గుర్తుగా నాతోనూ, బర్నబాతోనూ తమ కుడి చేతులు కలిపారు. 10 మేము యెరూషలేములో ఉన్న సాటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాలను ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వారు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తిగా ఉన్నాను.
11 అయితే కేఫా, అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను. 12 ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు. 13 మిగతా యూదులు కూడా కేఫాతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపట వేషధారణ వల్ల మోసపోయాడు. 14 వారు సువార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, “నీవు యూదుడవై ఉండి కూడా యూదుల్లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల్లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?” అన్నాను.
15 మనం పుట్టుకతో యూదులం గానీ, “యూదేతర పాపులం” కాదు. 16 మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా.
17 అయితే, దేవుడు మనలను క్రీస్తులో నీతిమంతులుగా తీర్చాలని కోరుకొంటూ, మనకు మనం పాపులుగా కనబడితే, క్రీస్తు పాపానికి సేవకుడయ్యాడా? కచ్చితంగా కాదు. 18 నేను పడగొట్టిన వాటిని మళ్ళీ కడితే నన్ను నేనే అపరాధిగా చేసుకుంటాను గదా. 19 నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను.
లోపల నివసిస్తున్న క్రీస్తును బయటకు కనుపరచేదే క్రైస్తవ జీవితం
20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే. 21 నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్టే గదా.