3
ఆత్మ వరం విశ్వాసం వల్లనే, ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు
తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళ ముందు చూపించాము గదా! మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దాన్ని విశ్వసించడం వలన పొందారా? మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?
వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా? ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?
అబ్రాహాము నిబంధన విశ్వాస నిబంధన
అబ్రాహాము, “దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” కాబట్టి, నమ్మకముంచే వారే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి. విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. “ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి.” అని అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించడం జరిగింది. కాబట్టి విశ్వాసముంచిన అబ్రాహాముతో బాటు విశ్వాస సంబంధులనే దేవుడు దీవిస్తాడు.
ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్న మనిషి ధర్మశాస్త్ర శాపం కింద ఉన్నవాడు
10 ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. 11 ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.” 12 ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, “దాని విధులను ఆచరించే వాడు వాటి వల్లనే జీవిస్తాడు.”
ధర్మశాస్త్ర సంబంధిత శాపాన్ని క్రీస్తు భరించి విశ్వాస సంబంధమైన దీవెనలను మనకు ఇచ్చాడు
13 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు. 14 అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. 15 సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు. 16 అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.
అబ్రాహాముకు చేసిన విశ్వాస నిబంధనకు ధర్మశాస్త్రం ఏమీ కలపడం లేదు
17 నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు. 18 ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వల్లనే వారసత్వాన్ని ఇచ్చాడు.
ధర్మశాస్త్రం అసలు ఉద్దేశం శిక్ష విధించడమే
19 అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు. 20 మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే.
21 ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. 22 యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది. 23 మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము. 24 కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది.
విశ్వాసి జీవితంపై రాజ్యమేలుతున్నది కృపే, చట్టం కాదు
25 అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము. 26 యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు. 27 క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. 28 ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు. 29 మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.