5
ఆదర్శ వంతమైన నడవడి. యెహోవా దినం
సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు. రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు. ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.
సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు. మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు. కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం. నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు. విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.
ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు. 10 మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు. 11 కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.
12 సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి. 13 వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి.
14 సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి. 15 ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి.
16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి.
17 ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.
18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.
19 దేవుని ఆత్మను ఆర్పవద్దు.
20 ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
21 అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.
22 ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.
23 శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!
24 మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు. 25 సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి. 26 పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి. 27 సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను. 28 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక!