తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
గ్రంథకర్త
1 తెస్స లాగానే ఈ పత్రిక కూడా పౌలు, సీలా, తిమోతిలు రాసినదే. మొదటి పత్రిక, పౌలు రాసిన ఇతర పత్రికల శైలి ఇందులో కనిపిస్తుంది. దీన్నిబట్టి పౌలు ముఖ్య రచయిత అనీ సీల, తిమోతి లా పేర్లను పరిచయ వాక్యాల్లో చేర్చాడనీ తెలుస్తున్నది (1:1). “మేము” రాసిన అనేక వచనాలలో ఆ ముగ్గురూ సమ్మతించి రాశారు అనుకోవచ్చు. చేవ్రాత పౌలుది కాదు ఎందుకంటే అతడు చివరి అభినందన మాటలు మాత్రం స్వంతగా రాశాడు. (3:7). బహుశా పౌలు చెబుతుంటే సీల గానీ తిమోతి గానీ రాసి ఉంటారు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 50 - 52
ఈ పత్రికను పౌలు మొదటి పత్రిక లాగానే కొరింతి పట్టణం నుండి రాశాడు.
స్వీకర్త
1:1 ప్రకారం ఈ పత్రిక అందుకున్న వారు తెస్సలోనిక సంఘ విశ్వాసులు.
ప్రయోజనం
ప్రభువు దినం గురించి ఆ రోజుల్లో నెలకొన్న తప్పు సిద్దాంతాన్ని సరిదిద్దడం ఈ పత్రిక ఉద్దేశం. ఆ సంఘం వారు తమ విశ్వాసంలో నిలకడగా ఉన్నందుకు వారిని మెచ్చుకుంటూ అంత్య దినాల గురించి కొందరిలో తమను తామే మోసం చేసుకునే పొరపాటు నమ్మకాలను బట్టి వారిని పౌలు గద్దిస్తున్నాడు. ప్రభువు దినం వచ్చేసిందని, ప్రభువు త్వరలో వస్తున్నాడు అని భావించి ఈ సిద్ధాంతాన్ని తమ స్వలాభానికి వారు ఉపయోగించుకుంటున్నారు.
ముఖ్యాంశం
సజీవమైన ఆశాభావం
విభాగాలు
1. అభివాదం — 1:1, 2
2. ఇబ్బందుల్లో ఆదరణ — 1:3-12
3. ప్రభువు దినం గురించి దిద్దుబాటు — 2:1-12
4. వారి అంతిమ గమ్యం గురించి వారికి జ్ఞాపకం చేయడం — 2:13-17
5. ఆచరణాత్మక విషయాల గురించి హెచ్చరికలు — 3:1-15
6. చివరి అభినందనలు — 3:16-18
1
అభివందనాలు
1 మన తండ్రి అయిన దేవునిలో ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలూ, సిల్వానూ, తిమోతీ రాస్తున్న సంగతులు.
2 తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృపాసమాధానాలు మీకు కలుగు గాక.
3 సోదరులారా, మేము ఎప్పుడూ మీ విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది సముచితం. ఎందుకంటే మీ విశ్వాసం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీలో ఒకరి పట్ల మరొకరు చూపే ప్రేమ అత్యధికం అవుతూ ఉంది.
4 అందుకే మీరు పొందుతున్న హింసలన్నిటిలోనూ, మీరు సహిస్తున్న యాతనల్లోనూ, మీ సహనాన్నీ, విశ్వాసాన్నీ చూసి దేవుని సంఘాల్లో మీ గురించి మేమే గర్వంగా చెబుతున్నాం.
హింసల్లో ఆదరణ
5 ఇది దేవుని న్యాయమైన తీర్పుకు ఒక స్పష్టమైన సూచనగా ఉంది. దీని ఫలితం ఏమిటంటే మీరు దేవుని రాజ్యానికి తగిన వారుగా లెక్కలోకి వస్తారు. దేవుని రాజ్యం కోసమే మీరీ కష్టాలన్నీ సహిస్తున్నారు.
6-7 ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.
8 దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు.
9-10 ఆ రోజున తన పరిశుద్ధులు ఆయనను మహిమ పరచడానికీ, విశ్వసించిన వారికి ఆశ్చర్య కారకంగా ఉండటానికీ ఆయన వచ్చినప్పుడు అవిశ్వాసులు ప్రభువు సన్నిధి నుండీ, ఆయన ప్రభావ తేజస్సు నుండీ వేరై శాశ్వత నాశనం అనే దండన పొందుతారు.
ఆ పరిశుద్ధుల్లో మీరూ ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు.
11 ఈ కారణం చేత మీకు అందిన పిలుపుకి తగిన వారిగా మిమ్మల్ని దేవుడు ఎంచాలనీ, మేలు చేయాలనే మీ ప్రతి ఆలోచననూ విశ్వాస మూలమైన ప్రతి పనినీ ఆయన తన బల ప్రభావాలతో నెరవేర్చాలనీ మేము మీ కోసం అనునిత్యం ప్రార్ధిస్తున్నాము.
12 తద్వారా మన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రసాదించే కృప మూలంగా మీలో మన ప్రభువైన యేసు నామం మహిమ పొందుతుంది. మీరు ఆయనలో మహిమ పొందుతారు.