6
సోమరితనం గురించి హెచ్చరిక
1 కుమారా, నీ పొరుగువాడి కోసం హామీగా ఉన్నప్పుడు, పొరుగువాడి పక్షంగా వాగ్దానం చేసినప్పుడు,
2 నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు.
3 కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కుబడినప్పుడు నువ్వు త్వరగా వెళ్లి నిన్ను విడుదల చేయమని అతణ్ణి బతిమాలుకో.
4 నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో.
5 వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.
6 సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.
7 వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.
8 అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.
9 సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు?
10 ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు?
11 అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.
12 కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు.
13 వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైగలు చేస్తాడు. చేతి వేళ్లతో గుర్తులు చూపిస్తాడు.
14 వాడి హృదయం దుష్ట స్వభావంతో ఉంటుంది. వాడు ఎప్పుడూ కీడు తలపెట్టాలని చూస్తాడు.
15 అలాంటివాడి మీదికి హఠాత్తుగా ప్రమాదం ముంచుకు వస్తుంది. ఆ క్షణంలోనే వాడు తిరిగి లేవకుండా కూలిపోతాడు.
16 యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.
17 అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు,
18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు,
19 లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.
వ్యభిచారం గురించి హెచ్చరిక
20 కుమారా, నీ తండ్రి బోధించే ఆజ్ఞలు పాటించు. నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని నిర్ల్యక్షం చెయ్యకు.
21 వాటిని ఎల్లప్పుడూ నీ హృదయంలో పదిలం చేసుకో. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.
22 నీ రాకపోకల్లో, నువ్వు నిద్రపోయే సమయంలో అవి నిన్ను కాపాడతాయి. నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అవి నీతో సంభాషిస్తాయి.
23 దేవుని ఆజ్ఞలు దీపం లాంటివి. ఉపదేశం వెలుగు వంటిది. క్రమశిక్షణ కోసం చేసే దిద్దుబాట్లు జీవానికి సోపానాలు.
24 వ్యభిచారిణి దగ్గరికి వెళ్ళకుండా, చెడ్డ స్త్రీ చెప్పే మోసపు మాటలకు లోబడకుండా అవి నిన్ను కాపాడతాయి.
25 దాని అందం చూసి నీ హృదయంలో మోహించకు. అది తన కనుసైగలతో నిన్ను లోబరుచుకోవాలని చూస్తే దాని వల్లో పడవద్దు.
26 వేశ్యలతో సాంగత్యం చేసేవాళ్ళకు కేవలం రొట్టెముక్క మాత్రమే మిగులుతుంది. వ్యభిచారి నీ విలువైన ప్రాణాన్ని వేటాడుతుంది.
27 ఒకడు తన ఒడిలో నిప్పు ఉంచుకుంటే వాడి బట్టలు కాలిపోకుండా ఉంటాయా?
28 ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాళ్ళు కాలకుండా ఉంటాయా?
29 తన పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు ఆ విధంగానే నాశనం అవుతాడు. ఆమెను తాకిన వాడికి శిక్ష తప్పదు.
30 బాగా ఆకలి వేసిన దొంగ భోజనం కోసం దొంగతనం చేసినప్పుడు వాణ్ణి ఎవ్వరూ తిరస్కారంగా చూడరు గదా.
31 అయినప్పటికీ వాడు దొరికిపోతే వాడు దొంగిలించిన దానికి ఏడు రెట్లు చెల్లించాలి. అందుకోసం తన యింటిని అమ్మివేయాలిసి వచ్చినా దాన్ని అమ్మి తప్పక చెల్లించాలి.
32 వ్యభిచారం చేసేవాడు కేవలం బుద్ధి లేనివాడు. ఆ పని చేసేవాడు తన సొంత నాశనం కోరుకున్నట్టే.
33 వాడు గాయాలకు, అవమానాలకు గురి అవుతాడు. వాడికి కలిగే అవమానం ఎప్పటికీ తొలగిపోదు.
34 భర్తకు వచ్చే రోషం తీవ్రమైన కోపంతో కూడి ఉంటుంది. ప్రతీకారం చేసే సమయంలో అతడు కనికరం చూపించడు.
35 ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇచ్చే దేనినీ అతడు లక్ష్యపెట్టడు. ఎన్ని విలువైన కానుకలు ఇచ్చినా అతడు తీసుకోడు.