7
1 కుమారా, నా మాటలు నీ మనసులో ఉంచుకో. నా ఆజ్ఞలు నీ దగ్గర పదిలంగా దాచుకో.
2 నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుని నీ కంటిపాపలాగా నా ఉపదేశాన్ని కాపాడుకుంటే నీకు జీవం కలుగుతుంది.
3 నీ చేతి వేళ్లకు వాటిని కట్టుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసి ఉంచుకో.
4 జ్ఞానంతో “నీవు నా సోదరివి” అని చెప్పు. వివేకాన్ని నీ బంధువుగా భావించు.
5 అలా చేస్తే నువ్వు వ్యభిచారి దగ్గరికి వెళ్ళకుండా, సరసాలాడే స్త్రీ వలలో పడకుండా నిన్ను నీవు కాపాడుకుంటావు.
6 నా యింటి కిటికీలో నుండి, కిటికీ పరదా నుండి నేను చూశాను.
7 జ్ఞానం లేని యువకుల మధ్య ఒక తెలివి తక్కువ యువకుడు నాకు కనబడ్డాడు.
8 సాయంత్ర సమయం ముగిసి చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రివేళ అతడు వ్యభిచారి ఉండే వీధిలో ప్రవేశించాడు.
9 ఆ వీధిలో తిరుగుతూ అది ఉండే యింటి దారి పట్టాడు.
10 అప్పుడు వేశ్య వేషం ధరించిన ఒక కుటిల బుద్ధిగల స్త్రీ అతనికి ఎదురు వచ్చింది.
11 ఆమె తిరుగుబోతు. అదుపు లేకుండా తిరుగుతూ ఉండేది. ఆమె కాళ్ళు ఇంట్లో నిలవవు.
12 ఆమె ఒక్కోసారి తన ఇంటి ఎదుట, ఒక్కోసారి పట్టణ వీధుల్లో ఉంటుంది. ప్రతి సందులోనూ ఆమె కాపు కాసి ఉంటుంది.
13 ఆమె ఆ యువకుణ్ణి పట్టుకుని ముద్దు పెట్టుకుంది. సిగ్గు, బిడియం లేని ముఖంతో అతనితో ఇలా చెప్పింది,
14 “నేను శాంతి బలులు చెల్లించవలసి ఉంది. ఇప్పుడే నా మొక్కుబడులు చెల్లించాను.
15 నిన్ను కలుసుకోవాలని, నీకు ఎదురు రావాలని బయలుదేరాను. నువ్వే నాకు కనబడ్డావు.
16 నా మంచంపై రత్న కంబళ్ళు పరిచాను. ఐగుప్తు నుండి తెప్పించిన నైపుణ్యంగా అల్లిన నార దుప్పట్లు వేశాను.
17 నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను.
18 బయలు దేరు, ఇద్దరం మోహంతో కోరిక తీర్చుకుందాం. తెల్లవారే దాకా తనివితీరా తృప్తి పొందుదాం.
19 నా భర్త ఇంట్లో లేడు. ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళాడు.
20 అతడు డబ్బు సంచి తనతో తీసుకు వెళ్ళాడు. పున్నమి రోజు వరకూ ఇంటికి తిరిగి రాడు.”
21 ఆ విధంగా ఆమె తన మృదువైన మాటలు పదే పదే చెబుతూ, లాలిస్తూ అతణ్ణి లోబరచుకుంది. పొగడ్తలతో ముంచెత్తుతూ అతణ్ణి ఈడ్చుకు పోయింది.
22 వెంటనే అతడు ఆమె వెంట వెళ్ళాడు. పశువు వధకై వెళ్లినట్టు, పరాయివాళ్ళ చేతికి చిక్కి చెరసాల పాలైనట్టు అతడు వెళ్ళాడు.
23 పక్షి తనకు ప్రాణాపాయం ఉన్నదని తెలియక ఉచ్చులో పడినట్టు, అతని గుండెను చీల్చే బాణం దూసుకుపోయేంత వరకూ అతడు ఆమె వెంటబడి వెళ్ళాడు.
24 నా కుమారులారా, నా మాటలు వినండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి.
25 నీ మనస్సు వ్యభిచారి నడిచే మార్గాల వైపు మళ్ళనియ్యకు. దారి తప్పి ఆమె నడిచే దారిలోకి పోకు.
26 ఆమె అనేకులను లోబరచుకుని గాయపరచింది. లెక్కలేనంతమంది ఆమె బారిన పడి నాశనమయ్యారు.
27 ఆమె ఇల్లు పాతాళానికి నడిపించే దారి. ఆ దారి మరణానికి నడిపిస్తుంది.