45
బారూకుకు ఒక వర్తమానం
1 యెహోయాకీము కుమారుడు యోషియా యూదాలో రాజైన యెహోయాకీము పాలన నాల్గవ సంవత్సరం*యూదాలో … సంవత్సరం అనగా క్రీ. పూ 605వ సంవత్సరం. జరుగుతూ ఉండగా ప్రవక్తయైన యిర్మీయా ఈ విషయాలను నేరీయా కుమారుడైన బారూకుతో చెప్పాడు. బారూకు ఈ విషయాలను పుస్తక రూపంలో రాశాడు. యిర్మీయా బారూకుకు చెప్పినది ఇది: 2 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమనంటే, 3 ‘బారూకూ, నీవిలా అన్నావు, “నాకు కష్టం వచ్చింది. నా బాధకు తోడు యెహోవా నాకు దుఃఖాన్ని యిచ్చాడు. నేను మిక్కిలి అలసిపోయాను. నా బాధలవల్ల నేను మిక్కిలి కృశించిపోయాను. నాకు విశ్రాంతి లేదు.” 4 యిర్మీయా, నీవిది బారూకుకు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: నేను నిర్మించిన దానిని నేనే పడగొట్టుతున్నాను. నేను దేనినైతే నాటితినో దానిని నేనే పెరికివేస్తున్నాను. యూదాలో ప్రతిచోటా నేనలా చేస్తాను. 5 బారూకూ, నీవు నీ కొరకై గొప్ప విషయాలకై ఎదురు చూస్తున్నావా? నీవు వాటి కొరకు చూడవద్దు. ఎందుకంటే, నేను భయంకర విపత్తును ప్రజలందరి మీదికి కలుగజేస్తున్నాను గనుక నీవు వారి కొరకు చూడవద్దు.’ ఇవి యెహవా చెప్పిన విషయాలు. ‘నీవు చాలా చోట్లకు వెళ్లవలసి వుంటుంది. నీవు ఎక్కడికి వెళ్లినా ప్రాణంతో తప్పించుకునేలా నేను చేస్తాను.’ ”