46
రాజ్యాలకు సంబంధించిన యెహోవా సందేశాలు
ప్రవక్తయైన యిర్మీయాకు ఈ సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు వివిధ దేశాలకు సంబంధించి ఉన్నాయి.
ఈజిప్టును గురించిన వర్తమానం
ఈ వర్తమానం ఈజిప్టు*ఈజిప్టు ఇప్పటి ఈజిప్టు ఆనాటి ఐగుప్తు. ఆ కాలంలో ఐగుప్తు అని పిలవబడేది. దేశాన్ని గురించి చెప్పిబడినది. అది ఫరోనెకో సైన్యానికి సంబంధించినది. నెకో ఈజిప్టు రాజు. అతని సైన్యం కర్కెమీషు అనే పట్టణం వద్ద ఓడింపబడింది. కర్కెమీషు యూఫ్రటీసు నది తీర పట్టణం. బబులోను రాజైన నెబుకద్నెజరు ఫరోనెకో సైన్యాన్ని కర్కెమీషు వద్ద ఓడించాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీము పాలనలో నాల్గవ సంవత్సరం గడుస్తూ ఉంది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. ఈజిప్టుకు సంబంధించిన యెహోవా సందేశం ఇలా ఉంది:
 
“మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి.
యుద్ధానికి నడవండి.
గుర్రాలను సిద్ధం చేయండి.
సైనికులారా, మీరు గుర్రాలను ఎక్కండి.
యుద్ధానికై మీమీ సంకేత స్థలాలకు వెళ్లండి.
మీ శిరస్త్రాణాలను పెట్టుకోండి.
మీ ఈటెలకు పదును పెట్టండి.
మీ కవచాలను ధరించండి.
నేనేమిటి చూస్తున్నాను?
ఆ సైన్యం భయపడింది!
సైనికులు పారిపోతున్నారు.
ధైర్యవంతులైన వారి సైనికులు ఓడింపబడ్డారు.
వారు తత్తరపడి పారిపోతున్నారు.
వారు వెనుదిరిగి చూడకుండా పోతున్నారు.
ఎటు చూచినా భయం.”
యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
 
“వేగంగా పరుగెత్తేవారు,
బలవంతులు కూడా తప్పించుకోలేరు.
వారు తూలి పడిపోతారు.
ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది జరుగుతుంది.
నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు?
పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు?
పొంగి ప్రవహించే నైలు నదిలా
వచ్చేది ఈజిప్టు దేశమే.
మహా వేగంతో ప్రవహించే
మహా నదిలా వచ్చేది. ఈజిప్టు దేశమే.
‘నేను వచ్చి భూమిని కప్పివేస్తాను.
నేను నగరాలను, వాటి నివాసులను నాశనం చేస్తాను’ అని ఈజిప్టు అంటున్నది.
గుర్రపు రౌతుల్లారా, యుద్ధానికి కదలండి.
సారధుల్లారా, శరవేగంతో రథాలు తోలండి.
యోధుల్లారా ముందుకు పదండి.
కూషు, పూతు సైనికులారా మీ డాళ్లను చేబూనండి.
లూదీయులారా, మీ విల్లంబులు వాడండి.
 
10 “కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు!
ఆ సమయంలో ఆయన శత్రువులకి తగిన శిక్ష ఆయన విధిస్తాడు.
యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది.
దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది.
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది.
ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది.
 
11 “ఈజిప్టు, గిలియాదు వరకు వెళ్లి మందు తెచ్చుకో.
నీవు మందులనేకం తయారుచేస్తావు, అయినా అవి నీకు ఉపయోగపడవు.
నీ గాయాలు మానవు.
12 నీ రోదనను దేశాలు వింటాయి.
నీ ఏడ్పు ప్రపంచమంతా వినపడుతుంది.
ఒక ధైర్యశాలి మరియొక ధైర్యశాలి అయిన యోధునిపై పడతాడు.
ఆ యోధులిద్దరూ కలిసి కింద పడతారు.”
 
13 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా ఈ వర్తమానం అందజేశాడు. ఈజిప్టును ఎదుర్కోవటానికి కదలివచ్చే నెబుకద్నెజరును గురించి ఈ వర్తమానం ఇవ్వబడింది.
 
14 “ఈ సందేశాన్ని ఈజిప్టులో తెలియజెప్పండి.
మిగ్దోలు నగరంలో బోధించండి.
ఈ సందేశాన్ని నొపు (మెంఫిన్) లోను, తహపనేసులోను ప్రచారం చేయండి:
‘యుద్ధానికి సిద్ధపడండి.
ఎందువల్లనంటే మీ చుట్టూవున్న ప్రజలు కత్తిచే చంపబడుతున్నారు.’
15 ఈజిప్టూ నీ బలమైన యోధులెందుకు చంపబడతారు?
వారు నిలువలేరు.
ఎందువల్లనంటే యెహోవా వారిని నేలకు పడదోస్తాడు!
16 ఆ సైనికులు పదేపదే తూలిపోతారు.
వారొకరి మీద మరొకరు పడతారు.
వారు, ‘లేవండి, మనం మన స్వంత ప్రజల వద్దకు వెళదాం.
మనం మన మాతృభూమికి వెళ్లిపోదాము.
మన శత్రువు మనల్ని ఓడిస్తున్నాడు.
మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని అంటారు.
17 వారి స్వస్థలాల ఆ సైనికులు,
‘ఈజిప్టు రాజైన ఫరో కేవలం ఆడంబరమైన వాడు;
అతని ప్రభావం అయిపోయింది, అని అనుకుంటారు.’ ”
18 ఈ వర్తమానం రాజునుండి వచ్చనది.
సర్వశక్తిమంతుడైన యెహోవాయే ఆ రాజు.
“నిత్యుడనగు నా తోడుగా ప్రమాణము చేపుతున్నాను.
ఒక మహాశక్తివంతుడైన నాయకుడు వస్తాడు.
తాబోరు కొండలా, సముద్రతీరానగల కర్మెలు పర్వతంలా అతడు గొప్పవాడై ఉంటాడు.
19 ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి.
బందీలై పోవటానికి సిద్ధమవండి.
ఎందువల్లనంటే, నొపు (మెంఫిస్) నగరం శిథిలమై నిర్మానుష్యమవుతుంది.
నగరాలు నాశనమవుతాయి.
వాటిలో ఎవరూ నివసించరు!
 
20 “ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది.
కాని ఉత్తరాన్నుండి ఒక జోరీగ దాన్ని ముసరటానికి వస్తున్నది.
21 ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు.
అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు.
శత్రు దాడికి వారు తట్టుకోలేరు.
వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది.
వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.
22 బసకొట్టుతూ పారిపోవటానికి ప్రయత్నించే
పాములా ఈజిప్టు వుంది.
శత్రువు మిక్కిలి దరిజేరుతూ వున్నాడు.
అందుచే ఈజిప్టు సైన్యం పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంది.
గొడ్డళ్లు చేబట్టి శత్రవులు ఈజిప్టు మీదికి వస్తున్నారు.
వారు చెట్లను నరికే మనుష్యుల్లా వున్నారు.”
 
23 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు,
“ఈజిప్టు అరణ్యాన్ని (సైన్యం) శత్రువు నరికివేస్తాడు.
అరణ్యంలో (సైన్యం) చెట్లు (సైనికులు) చాలా వున్నాయి. కాని
అది నరికివేయబడుతుంది.
మిడుతలకంటె ఎక్కువగా శత్రు సైనికులున్నారు.
లెక్కకు మించి శత్రు సైనికులున్నారు.
24 ఈజిప్టుకు తలవంపులవుతుంది.
ఉత్తరాన్నుండి వచ్చే శత్రు సైన్యం వారిని ఓడిస్తుంది.”
 
25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “అతి త్వరలో థేబెసు దేవతయైన ఆమోనునుఆమోను చాలా శతాబ్దాలవరకు ఈజిప్టులో ఆమోను అతి ముఖ్యమైన దేవుడు. ఈ భవిష్య ప్రకటన జరిగే నాటికి ఉత్తర ఈజిప్టులో ఆ దేవుడు మిక్కిలిగా ఆరాధింపబడలేదు. కాని దక్షిణ ఈజిప్టులో, ముఖ్యంగా రాజధాని నగరమైన థేబెసు ప్రాంతంలో ఇంకా ఈ దేవుడు అతి ముఖ్యుడైయున్నాడు. నేను శిక్షింపనున్నాను. నేను ఫరోను, ఈజిప్టును మరియు దాని దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. ఫరో మీద ఆధారపడి, అతన్ని నమ్మిన ప్రజలను కూడా నేను శిక్షిస్తాను. 26 వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, అతని సేవకులకు అప్పగిస్తాను.
“చాల కాలం ముందట ఈజిప్టు శాంతియుతంగా వుండేది. ఈ కష్ట కాలాలు అయిన తర్వాత ఈజిప్టు మరలా శాంతంగా వుంటుంది.” ఈ విషయాలను యెహోవా చెప్పాడు.
ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి ఒక వర్తమానం
27 “నా సేవకుడవైన యాకోబూ,యాకోబూ ఇశ్రాయేలు యొక్క మరోపేరు. ఆదికాండం 32:22-28 చూడండి. భయపడవద్దు.
ఇశ్రాయేలూ, బెదరవద్దు.
ఆ దూర ప్రాంతాలనుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను.
వారు బందీలుగా వున్న దేశాలనుండి మీ పిల్లల్ని కాపాడతాను.
యాకోబుకు మరల శాంతి, రక్షణ కల్పించబడతాయి.
అతనిని ఎవ్వరూ భయపెట్టలేరు.”
28 యెహోవా ఇలా అంటున్నాడు,
“నా సేవకుడవైన యాకోబూ, భయపడకు.
నేను నీతో వున్నాను.
నిన్ను అనేక ఇతల దేశాలకు నేను పంపియున్నాను.
ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను.
కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను.
నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి.
కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను.
నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”

*46:2: ఈజిప్టు ఇప్పటి ఈజిప్టు ఆనాటి ఐగుప్తు. ఆ కాలంలో ఐగుప్తు అని పిలవబడేది.

46:25: ఆమోను చాలా శతాబ్దాలవరకు ఈజిప్టులో ఆమోను అతి ముఖ్యమైన దేవుడు. ఈ భవిష్య ప్రకటన జరిగే నాటికి ఉత్తర ఈజిప్టులో ఆ దేవుడు మిక్కిలిగా ఆరాధింపబడలేదు. కాని దక్షిణ ఈజిప్టులో, ముఖ్యంగా రాజధాని నగరమైన థేబెసు ప్రాంతంలో ఇంకా ఈ దేవుడు అతి ముఖ్యుడైయున్నాడు.

46:27: యాకోబూ ఇశ్రాయేలు యొక్క మరోపేరు. ఆదికాండం 32:22-28 చూడండి.