124
దావీదు యాత్ర కీర్తన. 
  1 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?  
ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.   
 2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?  
ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?   
 3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా  
వాళ్లు మనల్ని సజీవంగా మింగేసిఉండేవాళ్లు.   
 4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,  
మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.   
 5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ  
మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.   
 6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు  
మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.   
 7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.  
వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.   
 8 మనకు సహాయం యోహోవా దగ్గర నుండే వచ్చింది.  
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.