15
యెరూషలేముకు తేబడిన మందసం 
  1 దావీదు తన కోసం దావీదు పట్టణంలో భవనాలు కట్టించుకున్న తర్వాత, అతడు దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి దాని కోసం గుడారం వేయించాడు.   2 తర్వాత దావీదు, “దేవుని మందసాన్ని మోయడానికి నిత్యంగా తనకు సేవ చేయడానికి యెహోవా లేవీయులను ఎన్నుకున్నారు కాబట్టి వారు తప్ప ఇంకెవరు యెహోవా మందసాన్ని మోయకూడదు” అని చెప్పాడు.   
 3 యెహోవా మందసాన్ని తాను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి దావీదు ఇశ్రాయేలీయులందరిని యెరూషలేములో సమావేశపరిచాడు.   
 4 అప్పుడు అహరోను వారసులను, లేవీయులను పిలిపించాడు, వారు వీరే:   
 5 కహాతు వారసులలో నుండి,  
వారి నాయకుడైన ఊరియేలు, అతని బంధువుల్లో 120 మంది;   
 6 మెరారి వారసులలో నుండి వారి నాయకుడైన అశాయాను,  
అతని బంధువుల్లో 220 మంది;   
 7 గెర్షోను*హెబ్రీలో గెర్షోము గెర్షోనుకు మరొక రూపం వారసులలో నుండి వారి నాయకుడైన యోవేలు,  
అతని బంధువుల్లో 130 మంది;   
 8 ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా,  
అతని బంధువుల్లో 200 మంది;   
 9 హెబ్రోను వారసులలో నుండి వారి నాయకుడైన ఎలీయేలు,  
అతని బంధువుల్లో 80 మంది;   
 10 ఉజ్జీయేలు వారసులలో నుండి వారి నాయకుడైన అమ్మీనాదాబు,  
అతని బంధువుల్లో 112 మంది.   
 11 తర్వాత దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులను, లేవీయులైన ఊరియేలు, అశాయాను, యోవేలు, షెమయాను, ఎలీయేలు, అమ్మీనాదాబులను పిలిపించాడు.   12 అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు లేవీయుల కుటుంబ పెద్దలు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని, నేను సిద్ధపరచిన స్థలానికి తీసుకురావడానికి మీరు, మీ బంధువులు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి.   13 లేవీయులైన మీరు ఇంతకుముందు మన దేవుడైన యెహోవా మందసాన్ని మోయలేదు కాబట్టి మన దేవుడైన యెహోవా కోపంతో మనమీద విరుచుకుపడ్డారు. మనం ఎలా చేయాలో నియమించబడిన విధానం ప్రకారం ఆయనను అడగలేదు.”   14 అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకురావడానికి యాజకులు, లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.   15 యెహోవా చెప్పిన మాట ప్రకారం మోషే ఆజ్ఞాపించినట్లు లేవీయులు దేవుని మందసాన్ని దాని మోతకర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.   
 16 తమ తోటి లేవీయులను సితారలు, వీణలు, తాళాలు మొదలైన వాయిద్యాలతో సంతోషకరమైన ధ్వని చేయమని సంగీతకారులుగా నియమించమని లేవీ నాయకులకు దావీదు ఆదేశించాడు.   
 17 కాబట్టి లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును నియమించారు; అతని బంధువుల్లో బెరెక్యా కుమారుడైన ఆసాపు; వారి బంధువులైన మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతాను;   18 వారితో పాటు రెండవ వరుసలో ఉన్న తమ బంధువులు: జెకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీఫెలెహు, మిక్నేయాహులు, ద్వారపాలకులైన ఓబేద్-ఎదోము, యెహీయేలు.   
 19 సంగీతకారులైన హేమాను, ఆసాపు, ఏతానులు ఇత్తడి తాళాలను వాయించాలి;   20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయాలు అలామోతు†బహుశ సంగీత పదం శైలిలో వీణలు వాయించాలి,   21 మత్తిత్యా, ఎలీఫెలెహు, మిక్నేయాహు, ఓబేద్-ఎదోము, యెహీయేలు, అజజ్యాహులు షెమినిత్‡బహుశ సంగీత పదం సితారలు వాయించాలి.   22 లేవీయుల నాయకుడైన కెనన్యా సంగీత నిర్వహణలో నైపుణ్యత గలవాడు కాబట్టి గాయకుల బృందానికి నాయకునిగా నియమించబడ్డాడు.   
 23 బెరెక్యా, ఎల్కానా దేవుని మందసానికి కావలివారిగా నియమించబడ్డారు.   24 షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదడానికి నియమించబడ్డారు. ఓబేద్-ఎదోము, యెహీయా దేవుని మందసానికి కావలివారిగా కూడ నియమించబడ్డారు.   
 25 కాబట్టి యెహోవా నిబంధన మందసాన్ని ఓబేద్-ఎదోము ఇంటి నుండి ఉత్సాహంతో తీసుకురావడానికి దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు వెళ్లారు.   26 ఎందుకంటే యెహోవా నిబంధన మందసాన్ని మోస్తున్న లేవీయులకు దేవుడు సహాయం చేశారు, వారు ఏడు ఎడ్లను, ఏడు పొట్టేళ్ళను బలిగా అర్పించారు.   27 దావీదు, మందసాన్ని మోసిన లేవీయులందరు, సంగీతకారులు, సంగీత నాయకుడు కెనన్యా సన్నని నారతో నేసిన వస్ర్తాలు ధరించారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును కూడా ధరించాడు.   28 ఇశ్రాయేలీయులందరు ఆనందోత్సాహాలతో పొట్టేళ్ల కొమ్ము బూరల ధ్వనితో, తాళాలు వీణలు సితారలు వాయిస్తూ, యెహోవా నిబంధన మందసాన్ని తీసుకువచ్చారు.   
 29 యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. రాజైన దావీదు ఆనందోత్సాహాలతో నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది.