16
మందసం ఎదుట పరిచర్య 
  1 వారు దేవుని మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచి వారు దేవుని సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించారు.   2 దావీదు దహనబలులు సమాధానబలులు అర్పించిన తర్వాత, అతడు యెహోవా పేరిట ప్రజలను దీవించాడు.   3 అప్పుడతడు ఇశ్రాయేలీయులలో ప్రతి పురుషునికి, స్త్రీకి ఒక రొట్టె, ఒక ఖర్జూర పండ్ల రొట్టె, ఒక ద్రాక్షపండ్ల రొట్టె ఇచ్చాడు.   
 4 తర్వాత అతడు యెహోవా మందసం దగ్గర సేవ చేయడానికి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కీర్తించడానికి స్తుతించడానికి, కృతజ్ఞతలు అర్పించడానికి లేవీయులలో కొంతమందిని నియమించాడు.   5 వారిలో ఆసాపు నాయకుడు, అతని తర్వాతి నాయకుడు జెకర్యా, తర్వాత యహజీయేలు,*హెబ్రీలో యెహీయేలు బహుశ యహజీయేలుకు మరొక పేరు షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేద్-ఎదోము, యెహీయేలు. వారు వీణలు, సితారలు వాయించడానికి నియమించబడ్డారు. ఆసాపు తాళాలను వాయించేవాడు.   6 యాజకులైన బెనాయా, యహజీయేలు దేవుని నిబంధన మందసం ఎదుట క్రమంగా బూరలు ఊదేవారు.   
 7 ఆ రోజు దావీదు యెహోవాను స్తుతించడానికి మొదటిసారిగా ఆసాపు, అతని తోటివారికి ఇలా పాడమని చెప్పాడు:   
 8 యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి;  
ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి.   
 9 ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి;  
ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి.   
 10 ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి;  
యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక.   
 11 యెహోవాను, ఆయన బలాన్ని చూడండి;  
ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.   
 12-13 ఆయన సేవకులైన ఇశ్రాయేలు వారసులారా!  
ఆయన ఎన్నుకున్న యాకోబు సంతానమా!  
ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను,  
ఆయన అద్భుతాలను, ఆయన ప్రకటించిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.   
 14 ఆయన మన దేవుడైన యెహోవా;  
ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి.   
 15 ఆయన తన నిబంధనను,  
తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు.   
 16 అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధనను  
ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణాన్ని ఎప్పటికీ జ్ఞాపకముంచుకుంటారు.   
 17 ఆయన దానిని యాకోబుకు శాసనంగా,  
ఇశ్రాయేలుకు శాశ్వతమైన నిబంధనగా స్థిరపరిచారు:   
 18 “నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను  
మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.”   
 19 వారు లెక్కకు కొద్దిమంది ఉన్నప్పుడు,  
ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారిగా ఉన్నప్పుడు,   
 20 వారు దేశం నుండి దేశానికి,  
ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యానికి తిరిగారు.   
 21 ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు;  
వారి కోసం ఆయన రాజులను మందలించారు:   
 22 “నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు;  
నా ప్రవక్తలకు హాని చేయకూడదు.”   
 23 సమస్త భూలోకమా! యెహోవాకు పాడండి;  
అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి.   
 24 దేశాల్లో ఆయన మహిమను,  
సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.   
 25 యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు;  
దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.   
 26 ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు,  
కాని యెహోవా ఆకాశాలను సృష్టించారు.   
 27 వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి.  
బలం, ఆనందం ఆయన నివాసస్థలంలో ఉన్నాయి.   
 28 ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి,  
మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.   
 29 యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకు చెల్లించండి.  
అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి.  
తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి.   
 30 సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి,  
లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు.   
 31 ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి;  
“యెహోవా పరిపాలిస్తున్నారు!” అని దేశాల్లో ప్రకటించబడాలి.   
 32 సముద్రం, దానిలోని సమస్తం ఘోషించాలి;  
పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి!   
 33 అడవి చెట్లు పాటలు పాడాలి,  
అవి యెహోవా ఎదుట ఆనందంతో పాటలు పాడాలి,  
యెహోవా భూమికి తీర్పు తీర్చడానికి వస్తున్నారు.   
 34 యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి;  
ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.   
 35 ఇలా మొరపెట్టండి: “దేవా, మా రక్షకా! మమ్మల్ని రక్షించండి;  
ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చి, విడిపించండి,  
అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం,  
మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాము.”   
 36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు  
నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక!  
అని అనగానే ప్రజలంతా, “ఆమేన్, యెహోవాకు స్తుతి” అని చెప్పారు.   
 37 యెహోవా నిబంధన మందసం ఎదుట ప్రతిరోజు క్రమంగా సేవ చేయడానికి, దావీదు దాని దగ్గర ఆసాపును, అతని తోటి వారిని నియమించాడు.   38 అలాగే ఓబేద్-ఎదోమును, అతని అరవై ఎనిమిది మంది తోటి వారిని కూడా అక్కడ నియమించాడు. యెదూతూను కుమారుడైన ఓబేద్-ఎదోము, హోసా అనేవారు ద్వారపాలకులు.   
 39 దావీదు యాజకుడైన సాదోకును, అతని తోటి యాజకులను గిబియోనులోని ఆరాధన స్థలంలో†మూ.భా.లో క్షేత్రం ఉన్న యెహోవా సమావేశ గుడారం దగ్గర ఉంచాడు.   40 యెహోవా ఇశ్రాయేలీయులకు ఆదేశించిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం, ప్రతిరోజు ఉదయ సాయంత్రాల్లో క్రమంగా బలిపీఠం మీద దహనబలి యెహోవాకు అర్పించడానికి దావీదు వారిని నియమించాడు.   41 “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అంటూ ఆయనకు కృతజ్ఞతలు అర్పించడానికి వారితో కూడ హేమాను, యెదూతూను, పేర్లు చెప్పి ఎన్నుకున్న మరి కొంతమందిని అతడు నియమించాడు.   42 బూరధ్వని చేయడానికి, తాళాలు వాయించడానికి, దేవున్ని స్తుతించడానికి ఇతర వాయిద్యాలను వాయించడానికి హేమాను, యెదూతూనులను నియమించాడు. యెదూతూను కుమారులను ద్వారపాలకులుగా నియమించాడు.   
 43 తర్వాత ప్రజలంతా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. దావీదు తన కుటుంబాన్ని దీవించడానికి తన ఇంటికి తిరిగి వెళ్లాడు.