5
సంఘ పెద్దలకు సంఘానికి
1 తోటి సంఘపెద్దగా, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినై ఉండి, ప్రత్యక్షం కాబోతున్న మహిమలో భాగం పంచుకోబోతున్న నేను మీ సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే: 2 మీ స్వాధీనంలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండండి. అయిష్టంతో కాక దేవుని చిత్తం అనుకుని ఇష్టపూర్వకంగా దాన్ని కాపాడండి. లాభం మీద దురాశతో కాక మనస్సు పూర్వకంగా దాన్ని కాయండి; 3 మీకు అప్పగించబడిన మందపై అధికారం చెలాయించక, మీరు మందకు మాదిరిగా ఉండండి. 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీరు ఎప్పటికీ తరిగిపోని మహిమ కిరీటం పొందుతారు.
5 అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా,
“దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు
కాని దీనులకు దయ చూపిస్తారు.”*సామెత 3:34
6 దేవుని బలమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. 7 ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి.
8 మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు. 9 దృఢ విశ్వాసులై వానిని ఎదిరించండి. ప్రపంచమంతా ఉన్న విశ్వాసుల కుటుంబం ఇలాంటి బాధలనే అనుభవిస్తుందని మీకు తెలుసు.
10 తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంతకాలం బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు. 11 ఆయనకే నిరంతరం ప్రభావం కలుగును గాక ఆమేన్.
తుది శుభాకాంక్షలు
12 నేను నమ్మకమైన సహోదరునిగా భావించే సీల†గ్రీకులో సిల్వాను సీల యొక్క మరో రూపం సహాయంతో ఈ కొద్ది మాటలు వ్రాస్తున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలని, ఇది దేవుని నిజమైన కృప మాత్రమే అని సాక్ష్యమిస్తున్నాను. మీరు దీనిలో నిలిచి ఉండండి.
13 బబులోనులో మీలా ఏర్పరచబడిన మీ సహోదర సంఘం, నా కుమారుడైన మార్కు కూడ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.
14 ప్రేమపూర్వకమైన ముద్దుతో ఒకరికొకరు శుభాలు చెప్పుకోండి.
క్రీస్తులో ఉన్న మీకందరికి శాంతి కలుగును గాక.