పేతురు
వ్రాసిన రెండవ పత్రిక
1
యేసు క్రీస్తు సేవకుడు అపొస్తలుడైన సీమోను పేతురు,
మన దేవుడు రక్షకుడైన యేసు క్రీస్తు నీతిని బట్టి మావలె అమూల్యమైన విశ్వాసం పొందినవారికి వ్రాయునది.
మన ప్రభువైన యేసు యొక్క, దేవుని యొక్క జ్ఞానం ద్వారా మీకు కృపా సమాధానాలు సమృద్ధిగా కలుగును గాక.
ఒకని పిలుపులోని నిశ్చయత ఎన్నిక
తన సొంత మహిమ వలన మంచితనం వలన మనల్ని పిలిచినవాని గురించి మనకున్న జ్ఞానం ద్వారా ఆయన దైవశక్తి, మనం దైవిక జీవితాన్ని జీవించడానికి కావలసిన ప్రతిదీ మనకు ఇస్తుంది. వీటి ద్వారా ఆయన మనకు మహత్తరమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చారు. అప్పుడు మీరు వాటి ద్వారా చెడు కోరికల వల్ల ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుండి తప్పించుకుని దైవిక స్వభావంలో పాలుపొందవచ్చు.
ఈ కారణంగా మీ విశ్వాసానికి మంచితనాన్ని, మంచితనానికి వివేకాన్ని; వివేకానికి స్వీయ నియంత్రణను, స్వీయ నియంత్రణకు సహనాన్ని, సహనానికి దైవ భక్తిని; దైవ భక్తికి సోదర భావాన్ని, సోదర భావానికి ప్రేమను చేర్చడానికి కృషి చేయండి. ఈ గుణాలు మీలో వృద్ధి చెందినప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న జ్ఞానం మిమ్మల్ని పనిలేనివారిగా, ఫలించనివారిగా ఉండకుండా చేస్తుంది. అయితే ఇవి లేనివారు తన గత పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివారిగా దూరదృష్టిలేనివారిగా అవుతారు.
10 కాబట్టి, సహోదరీ సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి కృషి చేయండి. ఒకవేళ మీరు వీటిని చేస్తే ఎప్పుడూ తడబడరు. 11 అప్పుడు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శాశ్వత రాజ్యంలోనికి ఘనమైన స్వాగతం మీకు లభిస్తుంది.
లేఖనంలోని ప్రవచనం
12 కాబట్టి, మీకు తెలిసినవే అయినప్పటికీ, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నప్పటికీ నేను ఈ విషయాలను గురించి మీకు ఎల్లప్పుడు జ్ఞాపకం చేస్తాను. 13 నేను ఈ శరీరమనే గుడారంలో జీవించినంతకాలం, ఈ సంగతులను గురించి మీకు జ్ఞాపకం చేయడం మంచిదని భావిస్తాను. 14 ఎందుకంటే, నేను ఈ శరీరమనే గుడారాన్ని త్వరలో విడచిపెట్టబోతున్నాను, ఈ సంగతి మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు స్పష్టంగా చెప్పారు. 15 కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా శ్రద్ధ వహిస్తాను.
16 మన ప్రభువైన యేసు క్రీస్తు శక్తి గురించి ఆయన రాకడ గురించి మేము మీకు కట్టుకథలు కల్పించి చెప్పలేదు కాని మా కళ్లారా ఆయన మహా ప్రభావాన్ని చూసి చెప్తున్నాము. 17 ఆయన తండ్రియైన దేవుని నుండి ఘనత మహిమను పొందినపుడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను”*మత్తయి 17:5; మార్కు 9:7; లూకా 9:35 అని మహత్తరమైన మహిమగల ఒక శబ్దం పలికింది. 18 మేము ఆయనతో కూడా పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు పరలోకం నుండి వచ్చిన ఆ శబ్దాన్ని మేము విన్నాము.
19 మరింత నమ్మకమైన ప్రవచనాత్మక సందేశం మనకు ఉంది. ఉదయకాలపు వేకువచుక్క మీ హృదయాలను వెలుగుతో నింపే వరకు చీకటిలో వెలుగుతున్న దీపంలా ఉన్న ఆ సందేశాన్ని శ్రద్ధతో ఆలకించడం మీకు మంచిది. 20 అన్నిటికంటే ముఖ్యంగా ప్రవక్తల సొంత ఊహల్లో నుండి లేఖనంలోని ప్రవచనాలు పుట్టలేదని మీరు తప్పక గుర్తుంచుకోవాలి. 21 ఎందుకంటే, మానవుని ఇష్టాన్ని బట్టి ప్రవచనం పుట్టదు, కాని ప్రవక్తలు పరిశుద్ధాత్మచేత ప్రభావితులై దేవుని నుండి వచ్చిన సందేశాన్నే పలికారు.

*1:17 మత్తయి 17:5; మార్కు 9:7; లూకా 9:35