36
 1 అప్పుడు దేశ ప్రజలు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అతని తండ్రి స్థానంలో యెరూషలేములో రాజుగా చేశారు.   
యూదా రాజైన యెహోయాహాజు 
  2 యెహోయాహాజు*హెబ్రీలో యోహాజు యెహోయాహాజు యొక్క మరో రూపం; 4 వచనంలో కూడా ఉంది రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు.   3 తర్వాత ఈజిప్టు రాజు యెరూషలేములో అతన్ని పదవి నుండి తొలగించి, యూదాపై వంద తలాంతుల†అంటే, సుమారు 3.34 టన్నులు వెండిని, ఒక తలాంతు‡అంటే, సుమారు 34 కి. గ్రా. లు బంగారాన్ని పన్నుగా విధించాడు.   4 ఈజిప్టు రాజు యెహోయాహాజు సోదరుడైన ఎల్యాకీమును యూదా యెరూషలేము మీద రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే నెకో ఎల్యాకీము సోదరుడైన యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు.   
యూదా రాజైన యెహోయాకీము 
  5 యెహోయాకీము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.   6 బబులోను రాజైన నెబుకద్నెజరు అతని మీద దాడి చేసి అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు.   7 అంతేకాక యెహోవా మందిరంలో ఉన్న వస్తువులను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకెళ్లి అక్కడున్న తన దేవుని క్షేత్రంలో§రాజభవనం పెట్టాడు.   
 8 యెహోయాకీము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన అసహ్యకరమైనవి, అతనికి వ్యతిరేకంగా కనిపించినవన్నీ ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు.   
యూదా రాజైన యెహోయాకీను 
  9 యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు,*కొ.ప్ర.లలో ఎనిమిది; 2 రాజులు 24:8కూడా చూడండి. అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు పరిపాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.   10 వసంతకాలం వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజు మనుష్యులను పంపి అతన్ని, అతనితో పాటు యెహోవా మందిరంలో ఉన్న విలువైన వస్తువులను బబులోనుకు రప్పించాడు. అతడు యెహోయాకీను పినతండ్రియైన†కొ.ప్ర.లలో సోదరుడు అంటే బంధువు అని ప్రస్తావించబడింది; 2 రాజులు 24:17కూడా చూడండి. సిద్కియాను యూదా, యెరూషలేము మీద రాజుగా చేశాడు.   
యూదా రాజైన సిద్కియా 
  11 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు.   12 అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. యెహోవా వాక్కు పలికిన యిర్మీయా ప్రవక్త ముందు అతడు తగ్గించుకోలేదు.   13 అతడు దేవుని పేరిట తనతో ప్రమాణం చేయించిన రాజైన నెబుకద్నెజరు మీద కూడా తిరుగుబాటు చేశాడు. అతడు మెడవంచని వాడై తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగలేదు.   14 ఇంకా, యాజకుల నాయకులందరు, ప్రజలందరు ఇతర దేశాల అసహ్యమైన ఆచారాలన్నిటిని అనుసరించి, యెరూషలేములో ఆయన ప్రతిష్ఠించిన యెహోవా మందిరాన్ని అపవిత్రం చేస్తూ మరింతగా నమ్మకద్రోహులయ్యారు.   
యెరూషలేము పతనం 
  15 వారి పూర్వికుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాసస్థలం మీద జాలిపడి, వారికి తన దూతల ద్వారా పదే పదే సందేశాలు పంపించారు.   16 కానీ వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు, ఆయన మాటలను తృణీకరించారు, ఆయన ప్రజలపైకి నివారించలేని యెహోవా ఉగ్రత వచ్చేవరకు వారు ఆయన ప్రవక్తలను అపహాస్యం చేశారు.   17 యెహోవా వారి మీదికి బబులోనీయుల‡లేదా కల్దీయుల రాజును రప్పించారు. అతడు వారి పరిశుద్ధాలయంలో వారి యువకులను కత్తితో చంపాడు. యువకులను గాని యువతులను గాని వృద్ధులను గాని బలహీనులను గాని విడిచిపెట్టలేదు. దేవుడు వారందరినీ నెబుకద్నెజరు చేతికి అప్పగించారు.   18 అతడు యెహోవా మందిరం నుండి పెద్దవి చిన్నవి అని తేడా లేకుండా అన్ని వస్తువులను, యెహోవా మందిరం నిధులు, రాజు నిధులు, అతని అధికారుల నిధులన్నింటిని బబులోనుకు తీసుకెళ్లాడు.   19 వారు దేవుని ఆలయానికి నిప్పంటించి యెరూషలేము గోడలను పడగొట్టారు; వారు రాజభవనాలన్నిటిని తగలబెట్టి, అక్కడ విలువైన ప్రతీదానిని నాశనం చేశారు.   
 20 ఖడ్గం నుండి తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు. పర్షియా రాజ్యం అధికారంలోకి వచ్చేవరకు వారు అక్కడే ఉండి అతనికి అతని కుమారులకు దాసులుగా ఉన్నారు.   21 దేశం తన సబ్బాతు దినాలను ఆనందంగా గడిపింది; యిర్మీయా చెప్పిన యెహోవా వాక్కు నెరవేరేలా డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యే వరకు అది పాడైన సమయమంతా విశ్రాంతి తీసుకుంది.   
 22 పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా, దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:   
 23 “పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే:  
“ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు. మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా అక్కడికి వెళ్లవచ్చు, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక.’ ”  
*36:2 హెబ్రీలో యోహాజు యెహోయాహాజు యొక్క మరో రూపం; 4 వచనంలో కూడా ఉంది
†36:3 అంటే, సుమారు 3.34 టన్నులు
‡36:3 అంటే, సుమారు 34 కి. గ్రా. లు
§36:7 రాజభవనం
*36:9 కొ.ప్ర.లలో ఎనిమిది; 2 రాజులు 24:8కూడా చూడండి.
†36:10 కొ.ప్ర.లలో సోదరుడు అంటే బంధువు అని ప్రస్తావించబడింది; 2 రాజులు 24:17కూడా చూడండి.
‡36:17 లేదా కల్దీయుల