యోహాను
వ్రాసిన రెండవ పత్రిక
1
1 పెద్దనైన నేను,
దేవుని చేత ఏర్పరచబడిన అమ్మగారికి, ఆమె పిల్లలకు వ్రాయునది: సత్యంలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మాత్రమే కాదు, సత్యాన్ని ఎరిగిన వారందరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. 2 మనలో నివసిస్తున్న, నిత్యం మనతోనే ఉండే సత్యాన్ని బట్టి వారు ప్రేమిస్తున్నారు.
3 సత్యంలోను ప్రేమలోను తండ్రియైన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి మనకు కృపా కనికరం సమాధానాలు మనతో ఉంటాయి.
4 తండ్రి మనకు ఆజ్ఞాపించిన విధంగా నీ బిడ్డలలో కొందరు సత్యంలో జీవించడం చూసి ఎంతో సంతోషించాను. 5 అమ్మా, నేను నీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞను బట్టి మనం ఒకరినొకరం ప్రేమించాలని అడుగుతున్నాను. 6 ప్రేమ అంటే మనం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే. మొదటి నుండి మీరు వింటున్నట్లుగా మీరందరు ప్రేమలో జీవించాలి అనేదే ఆయన ఇచ్చిన ఆజ్ఞ.
7 ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు క్రీస్తు మనుష్యునిగా వచ్చారని ఒప్పుకొనని మోసగాళ్లు చాలామంది లోకంలో బయలుదేరారు. వారు క్రీస్తు విరోధులు. 8 మనం*మనం కొ. ప్ర. లలో మీరు ఇంతవరకు దేనికోసం పని చేశామో దానిని కోల్పోకుండా మీ బహుమానాన్ని సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి. 9 క్రీస్తు బోధలో కొనసాగకుండా దానిని విడిచి ముందుకు వెళ్లే వారికి దేవుడు లేడు; కాని బోధలో కొనసాగేవారు తండ్రిని, కుమారుని ఇరువురిని కలిగి ఉంటారు. 10 ఎవరైనా ఈ బోధను తీసుకురాకుండా మీ దగ్గరకు వస్తే, వారిని మీ ఇంట్లోకి తీసుకెళ్లవద్దు రమ్మనవద్దు. 11 వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు.
12 మీకు చాలా సంగతులు వ్రాయవలసి ఉంది, కాని సిరాతో కాగితంతో వ్రాయడం ఇష్టం లేదు. మన సంతోషం సంపూర్ణం కావడానికి, నేను మీ దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షిస్తున్నాను.
13 దేవుని చేత ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనాలు చెప్తున్నారు.