3
మోయాబు తిరుగుబాటు
1 యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అహాబు కుమారుడైన యోరాము*హెబ్రీలో యెహోరాము యోరాము యొక్క మరో రూపం 6 వచనంలో కూడా సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతడు పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు. 2 అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు కాని తన తల్లిదండ్రులు చేసినట్లు చేయలేదు. తన తండ్రి నిలబెట్టిన బయలు పవిత్ర రాతిని తీసివేశాడు. 3 అయితే ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే ఇతడు కూడా చేస్తూ వచ్చాడు.
4 మోయాబు రాజైన మేషాకు చాలా గొర్రెలు ఉండేవి. అతడు ఇశ్రాయేలు రాజుకు లక్ష గొర్రెపిల్లలను, లక్ష పొట్టేళ్ళ ఉన్నిని పన్నుగా చెల్లిస్తూ వచ్చాడు. 5 అయితే అహాబు చనిపోయిన తర్వాత, మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగబడ్డాడు. 6 కాబట్టి ఆ సమయంలో రాజైన యెహోరాము సమరయ నుండి బయలుదేరి ఇశ్రాయేలంతటిని సమకూర్చాడు. 7 అతడు యూదా రాజైన యెహోషాపాతుకు, “మోయాబు రాజు నా మీద తిరుగబడ్డాడు, మీరు నాతో కూడా మోయాబు మీదికి యుద్ధానికి వస్తారా?” అని కబురు పంపాడు.
అందుకు యెహోషాపాతు, “నేను మీలాంటి వాడినే, నా ప్రజల మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు” అని అన్నాడు.
8 యెహోషాపాతు, “ఏ దారి నుండి మనం దాడి చేద్దాం?” అని అడిగాడు.
అందుకు, “ఎదోము ఎడారి దారి నుండి” అని యోరాము జవాబిచ్చాడు.
9 కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదారాజు, ఎదోము రాజు కలిసి బయలుదేరి ఏడు రోజులు చుట్టూ తిరిగి ప్రయాణించిన తర్వాత సైన్యానికి పశువులకు వారి దగ్గర నీళ్లు మిగల్లేదు.
10 ఇశ్రాయేలు రాజైన యోరాము ఆతురతతో, “అయ్యో! యెహోవా మోయాబుకు అప్పగించడానికి మన ముగ్గురు రాజులను పిలిచారా?” అని అన్నాడు.
11 అయితే యెహోషాపాతు, “యెహోవా దగ్గర విచారించడానికి ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా?” అని అడిగాడు.
ఇశ్రాయేలు రాజు పరివారంలో ఒకడు, “షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు. అతడు ఏలీయా చేతుల మీద నీళ్లు పోసేవాడు†అంటే, ఏలీయా యొక్క వ్యక్తిగత సేవకుడు” అని చెప్పాడు.
12 యెహోషాపాతు, “అతని దగ్గర యెహోవా వాక్కు ఉంది” అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు, ఎదోము రాజు ముగ్గురు అతని దగ్గరకు వెళ్లారు.
13 ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నీ తండ్రి ప్రవక్తల దగ్గరకు, నీ తల్లి ప్రవక్తల దగ్గరకు వెళ్లు” అన్నాడు.
ఇశ్రాయేలు రాజు జవాబిస్తూ, “లేదు, యెహోవా మా ముగ్గురు రాజులను మోయాబుకు అప్పగించడానికి పిలిచారు” అన్నాడు.
14 అందుకు ఎలీషా ఇలా అన్నాడు, “నేను సేవించే సజీవుడైన సైన్యాల యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్నాను, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవించకపోతే, అసలు నీవైపు చూసేవాన్ని కూడా కాదు. 15 సరే, ఒక తంతివాద్యం వాయించేవాన్ని నా దగ్గరకు తీసుకురా.”
తంతివాద్యం వాయించేవాడు వాయిస్తూ ఉన్నప్పుడు, యెహోవా హస్తం ఎలీషా మీదికి వచ్చింది. 16 అప్పుడతడు, “యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఈ లోయను నీటి గుంటలతో నింపుతాను. 17 ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: గాలి గాని వాన గాని మీరు చూడరు, అయినా నీళ్ల గుంటలతో ఈ లోయ నిండిపోతుంది. మీరు మీ మందలు ఇతర జంతువులు త్రాగడానికి నీళ్లు ఉంటాయి. 18 యెహోవా దృష్టికి ఇది తేలికైన పని; ఆయన మోయాబును కూడ మీ చేతులకు అప్పగిస్తారు. 19 మీరు కోటగోడలు గల ప్రతి పట్టణాన్ని, ప్రతి ప్రధాన పట్టణాన్ని పడగొడతారు. అలాగే మీరు ప్రతి మంచి చెట్టును నరికి ఊటలన్నిటిని పూడ్చి ప్రతి మంచి పొలాన్ని రాళ్లతో నింపి పాడుచేస్తారు” అని చెప్పాడు.
20 మరుసటి ఉదయం బలి అర్పించే సమయంలో, ఎదోము వైపు నుండి నీళ్లు వచ్చాయి. ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది.
21 రాజులు తమతో యుద్ధం చేయడానికి వచ్చారని మోయాబీయులు విని యువకులు మొదలుకొని వృద్ధుల వరకు ఆయుధాలు ధరించగలిగిన వారంతా సరిహద్దు దగ్గర గుమికూడారు. 22 ఉదయం వారు లేచినప్పుడు సూర్యకిరణాలు నీళ్ల మీద పడగా, మోయాబీయులకు తమ ఎదురుగా ఉన్న నీళ్లు రక్తంలా ఎర్రగా కనబడ్డాయి. 23 వారు, “అది రక్తం! రాజులు ఒకడితో ఒకడు యుద్ధం చేసుకుని ఒకనినొకడు చంపుకొని ఉంటారు. ఇప్పుడు మోయాబు వారలారా! రండి దోపుడుసొమ్ము పట్టుకుందాం” అని చెప్పుకున్నారు.
24 మోయాబీయులు ఇశ్రాయేలు శిబిరం చేరినప్పుడు, ఇశ్రాయేలీయులు లేచి వారితో పోరాడగా వారు నిలబడలేక పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోయాబును ఆక్రమించుకుని మోయాబీయులను హతం చేశారు. 25 వారి పట్టణాలు పడగొట్టారు, ప్రతి మంచి పొలాన్ని రాళ్లతో నింపివేయడానికి ప్రతి మనిషి ఒక రాయిని వేశాడు. వారు ఊటలన్నిటిని మూసి, ప్రతి మంచి చెట్టును నరికివేశారు. కీర్ హరెశెతు పట్టణాన్ని మాత్రం దాని ప్రాకారంతో ఉండనిచ్చారు. కాని వడిసెలతో ఉన్నవారు దానిని కూడా చుట్టుముట్టి దాడి చేశారు.
26 మోయాబు రాజు యుద్ధం తన చేజారిపోతుందని గ్రహించి, ఖడ్గం దూసే ఏడు వందల మందిని వెంటబెట్టుకొని ఎదోము రాజు దగ్గరకు చేధించుకొని వెళ్లాలని చూశాడు కాని అది సాధ్యం కాలేదు. 27 అప్పుడు అతడు తన తర్వాత రాజు కావలసిన తన పెద్ద కుమారుని తీసుకెళ్లి పట్టణ ప్రాకారం మీద బలిగా అర్పించాడు. ఇశ్రాయేలువారి మీద తీవ్రమైన కోపం కలిగింది‡లేదా యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకున్నది; వారు అతన్ని విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.