4
విధవరాలి నూనె పాత్ర 
  1 ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.   
 2 ఎలీషా, “నేను నీకెలా సహాయం చేయాలి? నీ ఇంట్లో ఏముందో చెప్పు” అన్నాడు.  
“నీ సేవకురాలి దగ్గర ఒక చిన్న పాత్రలో కొంచెం ఒలీవనూనె తప్ప ఇంకేమి లేదు” అని ఆమె చెప్పింది.   
 3 అప్పుడు ఎలీషా, “నీవు వెళ్లి, నీ పొరుగు వారందరి దగ్గర ఖాళీ పాత్రలను అడుగు. ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకో.   4 అప్పుడు నీవు, నీ కుమారులు ఇంట్లోకి వెళ్లి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవాటిని ప్రక్కన పెట్టండి” అని చెప్పాడు.   
 5 ఆమె అతని దగ్గర నుండి వెళ్లి, తన కుమారులతో లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. వారు ఆమె దగ్గరకు తెచ్చిన పాత్రలన్నిట్లో ఆమె నూనె పోస్తూ ఉంది.   6 పాత్రలన్నీ నిండినప్పుడు ఆమె తన కుమారునితో, “ఇంకొకటి తీసుకురా” అన్నది.  
అతడు, “ఇంకొక పాత్ర లేదు” అని జవాబిచ్చాడు. అప్పుడు నూనె ప్రవాహం ఆగిపోయింది.   
 7 ఆమె వెళ్లి దైవజనునికి చెప్పగా అతడు, “వెళ్లు, ఆ నూనె అమ్మి, నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో నీవు, నీ కుమారులు జీవనం కొనసాగించండి” అన్నాడు.   
షూనేమీయురాలి కుమారుని బ్రతికించుట 
  8 ఒక రోజు ఎలీషా షూనేముకు వెళ్లాడు. అక్కడ ఒక ధనికురాలు ఉండేది, ఆమె భోజనానికి రావాలని అతన్ని ప్రాధేయపడింది. కాబట్టి అతడు ఆ దారిన వెళ్లేటప్పుడు అక్కడ భోజనం చేయడానికి ఆగేవాడు.   9 ఆమె తన భర్తతో, “మన దారిలో వస్తూ వెళ్తూ ఉండే ఈ మనిషి పరిశుద్ధుడైన దైవజనుడని నాకు తెలుసు.   10 మనం పైకప్పు మీద చిన్న గది కట్టి అందులో పడక, బల్ల, కుర్చీ, దీపం ఉంచుదాము. మన దగ్గరకు అతడు వచ్చినప్పుడెల్లా, అతడు ఆ గదిలో ఉండవచ్చు” అని చెప్పింది.   
 11 ఒక రోజు ఎలీషా అక్కడికి వచ్చి ఆ మేడ గదిలో పడుకున్నాడు.   12 తర్వాత అతడు తన సేవకుడైన గేహజీతో, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగానే ఆమె వచ్చి అతని ముందు నిలబడింది.   13 ఎలీషా అతనితో, “ఆమెతో చెప్పు, ‘మాకోసం ఈ శ్రమంతా తీసుకున్నారు, ఇప్పుడు మీ కోసం ఏం చెయ్యాలో చెప్పండి. మేము మీ తరపున రాజుతో గాని సైన్యాధిపతితో గాని మాట్లాడాలా?’ ” అని అన్నాడు.  
అందుకామె, “నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను*స్వజనుల మధ్య నివసిస్తున్నాను లేదా నాకు అవసరమైనదంతా నా దగ్గర ఉంది” అన్నది.   
 14 ఎలీషా, “మరి ఆమె కోసం ఏం చేస్తే బాగుంటుంది?” అని అడిగాడు.  
గేహజీ, “ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త వృద్ధుడు” అని జవాబిచ్చాడు.   
 15 అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగా ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.   16 అప్పుడు ఎలీషా, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు” అని చెప్పాడు.  
అందుకామె, “వద్దు, నా ప్రభువా! దయచేసి, దైవజనుడా, మీ సేవకురాలితో అబద్ధం చెప్పకండి!” అని అన్నది.   
 17 తర్వాత ఆమె గర్భవతియై మరుసటి సంవత్సరం ఎలీషా చెప్పినట్లే కుమారుని కన్నది.   
 18 ఆ బాలుడు పెరిగిన తర్వాత ఒక రోజు కోత కోసేవారి దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు.   19 అకస్మాత్తుగా అతడు తన తండ్రితో, “నా తల! నా తల!” అన్నాడు.  
అతని తండ్రి తన సేవకులలో ఒకనితో, “బాలున్ని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లు” అని చెప్పాడు.   20 సేవకుడు బాలున్ని ఎత్తుకుని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లాడు, బాలుడు ఆమె ఒడిలో మధ్యాహ్నం వరకు కూర్చుని ఆ తర్వాత చనిపోయాడు.   21 ఆమె బాలున్ని తీసుకెళ్లి దైవజనుడైన ఎలీషా మంచం మీద పడుకోబెట్టి తలుపు మూసి బయటకు వెళ్లింది.   
 22 ఆమె తన భర్తను పిలిచి, “దయచేసి నా కోసం ఒక పనివాన్ని ఒక గాడిదను పంపించండి, నేను తొందరగా దైవజనుని దగ్గరకు వెళ్లి రావాలి” అని అన్నది.   
 23 అందుకతడు, “అతని దగ్గరకు ఈ రోజు ఎందుకు వెళ్తావు? ఇది అమావాస్య కాదు సబ్బాతు దినం కాదు కదా” అన్నాడు.  
అందుకామె, “అంతా సమాధానంగానే ఉంటుంది” అన్నది.   
 24 ఆమె గాడిద మీద జీను వేసుకుని పనివానితో, “త్వరగా నడిపించు; నేను చెప్పే వరకు నెమ్మదిగా వెళ్లకు” అని చెప్పింది.   25 కాబట్టి ఆమె బయలుదేరి కర్మెలు పర్వతం మీద ఉన్న దైవజనుని దగ్గరకు వచ్చింది.  
ఆమెను దూరం నుండి చూసి, ఆ దైవజనుడు తన సేవకుడైన గేహజీతో, “చూడు! అదిగో షూనేమీయురాలు!   26 ఆమెను కలుసుకోడానికి పరిగెత్తి వెళ్లి, ‘మీరు క్షేమమా? మీ భర్త క్షేమమా! మీ బాలుడు క్షేమమా?’ అని అడుగు” అన్నాడు.  
ఆమె, “అంతా క్షేమమే” అన్నది.   
 27 ఆమె పర్వతం మీద ఉన్న దైవజనుని చేరుకొని, అతని పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరకు వచ్చాడు, కాని దైవజనుడు, “ఆమెను వదిలేయి! ఆమె వేదనతో ఉన్నది కాని యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశారు” అని అన్నాడు.   
 28 ఆమె, “నా ప్రభువా, మిమ్మల్ని కుమారుడు కావాలని అడిగానా? నాతో అబద్ధం చెప్పకండి అని నేను అనలేదా?” అని అన్నది.   
 29 ఎలీషా గేహజీతో, “నీ నడికట్టు బిగించుకుని, నా దండం చేతపట్టుకుని పరుగెత్తు. నీకు ఎవరైనా ఎదురైతే పలకరించవద్దు, ఎవరైనా పలకరిస్తే, జవాబివ్వకు. నా దండం బాలుని ముఖం మీద పెట్టు” అని చెప్పాడు.   
 30 అయితే ఆ బాలుని తల్లి, “సజీవుడైన యెహోవా మీద, మీమీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని విడిచిపెట్టను” అన్నది. కాబట్టి అతడు లేచి ఆమె వెంట వెళ్లాడు.   
 31 గేహజీ వారికంటే ముందే వెళ్లి బాలుని ముఖం మీద ఆ దండం ఉంచాడు, అయితే ఏ శబ్దం కాని స్పందన కాని లేదు. కాబట్టి గేహజీ ఎలీషాను కలుసుకోడానికి వెళ్లి అతనితో, “బాలుడు మేలుకోలేదు” అని చెప్పాడు.   
 32 ఎలీషా ఇంటికి వెళ్లి తన మంచం మీద చనిపోయి ఉన్న బాలుని చూశాడు.   33 అతడు గదిలోకి వెళ్లి వారిద్దరే లోపల ఉండగా తలుపు మూసి యెహోవాకు ప్రార్థన చేశాడు.   34 తర్వాత మంచం ఎక్కి, బాలుని నోటి మీద తన నోరు, కళ్ల మీద తన కళ్లు, చేతుల మీద చేతులు ఉంచి బాలుని మీద పడుకున్నాడు. అతడు వాడి మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుని శరీరంలో వేడి పుట్టింది.   35 ఎలీషా మంచం దిగి గదిలో ఒకసారి అటూ ఇటూ నడిచి మరలా మంచం ఎక్కి బాలుని మీద బోర్లా పడుకున్నప్పుడు బాలుడు ఏడుసార్లు తుమ్మి కళ్లు తెరిచాడు.   
 36 ఎలీషా గేహజీని పిలిపించి, “షూనేమీయురాలిని పిలువు” అన్నాడు, అతడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చినప్పుడు అతడు, “నీ కుమారుని తీసుకో” అన్నాడు.   37 ఆమె లోపలికి వచ్చి, అతని కాళ్ల దగ్గర పడి నమస్కరించింది. తర్వాత ఆమె తన కుమారుని తీసుకుని బయటకు వెళ్లింది.   
కుండలో మరణం 
  38 తర్వాత ఎలీషా గిల్గాలుకు తిరిగి వెళ్లాడు, అప్పుడు ఆ ప్రాంతంలో కరువు ఉంది. ప్రవక్తల బృందం ఎలీషాను కలుస్తున్నప్పుడు, అతడు తన సేవకునితో, “పెద్దకుండ పొయ్యిమీద పెట్టి ఈ ప్రవక్తలకు వంటకం చేయి” అన్నాడు.   
 39 వారిలో ఒకడు కూర ఆకుల కోసం పొలాలకు వెళ్లాడు, వెర్రి ద్రాక్ష అతనికి దొరికింది, దాని తీగెలు కోసి అతడు తన వస్త్రం నిండ నింపుకున్నాడు. అవి విషపూరితమైనవని అతనికి తెలియక వాటిని తరిగి కూర కుండలో వేశాడు.   40 ఆ కూరను తినడానికి అక్కడ వారికి వడ్డించారు. వారు దానిని రుచి చూసి, “దైవజనుడా! కుండలో విషం ఉంది!” అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.   
 41 ఎలీషా, “పిండి కొంచెం తీసుకురండి” అన్నాడు. అతడు పిండిని కుండలో వేసి, “ప్రజలు తినడానికి దానిని వారికి వడ్డించండి” అన్నాడు. అప్పుడు కుండలో హానికరమైనదేది లేదు.   
వందమందిని పోషించుట 
  42 ఒక రోజు ఓ వ్యక్తి బయల్-షాలిషా నుండి దైవజనుని దగ్గరకు వస్తూ, ఒక సంచిలో తన ప్రథమ పంటలో యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలు, క్రొత్త ధాన్యం కంకులు కొన్ని తెచ్చాడు. అయితే ఎలీషా, “ప్రజలకు తినడానికి ఇవ్వు” అని చెప్పాడు.   
 43 అయితే అతని సేవకుడు, “దీన్ని వందమందికి ఎలా పెట్టగలను?” అని అడిగాడు.  
అందుకు ఎలీషా, “ ‘వారు తినగా ఇంకా మిగలుతుంది’ అని యెహోవా చెప్పారు కాబట్టి నీవైతే వారికి వడ్డించు” అని అన్నాడు.   44 అప్పుడు అతడు వారికి వడ్డించాడు, యెహోవా చెప్పిన మాట ప్రకారం అందరు తినగా కొంత మిగిలింది.