24
నిబంధనను స్థిరపరచుట 
  1 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బైమంది యెహోవా దగ్గరకు ఎక్కి వచ్చి దూరం నుండి ఆరాధించాలి.   2 అయితే మోషే ఒక్కడే యెహోవాను సమీపించాలి; ఇతరులు దగ్గరగా రాకూడదు. ప్రజలు అతనితో పైకి ఎక్కి రాకూడదు.”   
 3 మోషే వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని, చట్టాలను ప్రజలకు చెప్పినప్పుడు వారందరు ఏకకంఠంతో, “యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని మేము చేస్తాం” అన్నారు.   4 అప్పుడు మోషే యెహోవా చెప్పిన వాటన్నిటిని వ్రాశాడు.  
మరుసటిరోజు ఉదయానే లేచి పర్వతం క్రింద ఒక బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలను బట్టి పన్నెండు స్తంభాలను నిలబెట్టాడు.   5 అతడు ఇశ్రాయేలీయులలో యువకులను పంపగా వారు దహనబలులు అర్పించి, యెహోవాకు సమాధానబలులుగా ఎద్దులను వధించారు.   6 మోషే వాటి రక్తంలో సగం తీసుకుని గిన్నెల్లో పోసి మిగతా సగం బలిపీఠం మీద చల్లాడు.   7 తర్వాత అతడు ఒడంబడిక గ్రంథాన్ని తీసుకుని ప్రజలకు చదివి వినిపించాడు. అప్పుడు వారు, “యెహోవా ఆజ్ఞాపించినవన్నీ మేము చేస్తాము; వాటికి లోబడి ఉంటాం” అని చెప్పారు.   
 8 అప్పుడు మోషే రక్తాన్ని తీసుకుని ప్రజలపై చిలకరించి, “ఈ మాటలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే” అన్నాడు.   
 9 అప్పుడు మోషే అహరోను, నాదాబు అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బైమంది పైకి ఎక్కి వెళ్లి,   10 ఇశ్రాయేలీయుల దేవుని చూశారు. ఆయన పాదాల క్రింద నిగనిగలాడే నీలమణులతో తయారుచేసిన దారివంటిది ఉంది; అది ఆకాశమంత నిర్మలంగా ఉంది.   11 ఇశ్రాయేలీయుల ఈ నాయకులపై దేవుడు చేయి ఎత్తలేదు; వారు దేవున్ని చూశారు, వారు తిని త్రాగారు.   
 12 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు పర్వతం ఎక్కి, నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఉండు, నీవు వారికి బోధించడానికి నేను రాతిపలకలపై నియమాలను ఆజ్ఞలను వ్రాసి ఇస్తాను” అని చెప్పారు.   
 13 మోషే తన సహాయకుడైన యెహోషువతో కలిసి లేచి, మోషే దేవుని పర్వతం పైకి ఎక్కి వెళ్లాడు.   14 అతడు పెద్దలతో, “మేము మీ దగ్గరకు తిరిగి వచ్చేవరకు మీరు ఇక్కడే ఉండండి. అహరోను హూరులు మీతో ఉన్నారు; ఎవరికైనా సమస్య ఉంటే వారి దగ్గరకు వెళ్లండి” అని చెప్పాడు.   
 15 మోషే దేవుని పర్వతం పైకి ఎక్కి వెళ్లినప్పుడు మేఘం దానిని కమ్ముకుంది.   16 దేవుని మహిమ సీనాయి పర్వతంమీద నిలిచింది. ఆరు రోజులు మేఘం దానిని కమ్ముకుని ఉంది. ఏడవ రోజు యెహోవా ఆ మేఘంలోనుండి మోషేను పిలిచారు.   17 ఇశ్రాయేలీయులకు యెహోవా మహిమ ఆ పర్వతం మీద దహించే అగ్నిలా కనిపించింది.   18 మోషే పర్వతం పైకి ఎక్కి వెళ్లి ఆ మేఘంలోకి ప్రవేశించాడు. అతడు ఆ పర్వతం మీద నలభై పగళ్లు నలభై రాత్రులు ఉన్నాడు.