25
సమావేశ గుడారం కోసం అర్పణలు
1 యెహోవా మోషేతో ఇలా చెప్పారు, 2 “నాకు ఒక అర్పణ తీసుకురావాలి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతిఒక్కరి నుండి నీవు నా కోసం కానుక తీసుకోవాలి.
3 “నీవు వారి దగ్గర నుండి తీసుకోవలసిన కానుకలు ఇవే:
“బంగారం, వెండి, ఇత్తడి;
4 నీలం ఊదా ఎరుపు రంగుల నూలు, సన్నని నారబట్ట;
మేక వెంట్రుకలు;
5 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాలు, మన్నికైన తోలు*బహుశ పాలిచ్చే పెద్ద నీటి జంతువుల తోళ్ళు;
తుమ్మకర్ర;
6 దీపాలకు ఒలీవనూనె;
అభిషేక తైలానికి, సువాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు;
7 ఏఫోదు మీద, రొమ్ము పతకం మీద పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు.
8 “నేను వారి మధ్య నివసించేలా వారు నా కోసం పరిశుద్ధాలయాన్ని నిర్మించాలి. 9 ఈ సమావేశ గుడారాన్ని, దాని అన్ని అలంకరణలను నేను మీకు చూపించే నమూనా వలె చేయండి.
నిబంధన మందసము
10 “వారు తుమ్మకర్రతో మందసం తయారుచేయాలి. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి.†అంటే, పొడవు 101 సెం.మీ వెడల్పు. ఎత్తు 68 సెం.మీ. 17 వచనంలో కూడ 11 లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును తయారుచేయాలి. 12 నాలుగు బంగారు ఉంగరాలు పోతపోయించి ఒకవైపు రెండు మరోవైపు రెండు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి. 13 తర్వాత తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి. 14 మందసాన్ని మోయడానికి ఆ మోతకర్రలను మందసానికి ఇరుప్రక్కల ఉన్న ఉంగరాల్లో దూర్చాలి. 15 ఈ మందసపు ఉంగరాల్లో మోతకర్రలు అలాగే ఉండాలి; వాటిని తీసివేయకూడదు. 16 అప్పుడు నేను మీకు ఇచ్చే ఒడంబడిక పలకలను మందసంలో ఉంచండి.
17 “స్వచ్ఛమైన బంగారంతో ప్రాయశ్చిత్త మూతను తయారుచేయాలి; దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి. 18 తర్వాత సాగగొట్టిన బంగారంతో మూత చివర్లలో రెండు కెరూబులను‡కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు తయారుచేయాలి. 19 ఒక చివర ఒక కెరూబును మరోచివర రెండవ కెరూబును చేయాలి; మూత మీద దాని రెండు చివర్లలో కెరూబులతో పాటు దానంతటిని ఒకే ముక్కలా చేయాలి. 20 ఆ కెరూబులు తమ రెక్కలను పైకి చాపి వాటితో ప్రాయశ్చిత్త మూతను కప్పుతూ ఉండాలి. కెరూబుల ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండి ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూతను చూస్తున్నట్లుగా ఉండాలి. 21 ప్రాయశ్చిత్త మూతను పైకెత్తి మందసం మీద ఉంచి మందసంలో నేను మీకిచ్చే ఒడంబడిక పలకలను పెట్టాలి. 22 అక్కడ, నిబంధన మందసం పైన ఉన్న ఆ ప్రాయశ్చిత్త మూత మీదుగా రెండు కెరూబుల మధ్యలో నుండి, నేను నిన్ను కలుసుకొని ఇశ్రాయేలీయుల కోసం నా ఆజ్ఞలన్నిటిని నీకు ఇస్తాను.
సన్నిధి రొట్టెల కోసం బల్ల
23 “తుమ్మకర్రతో ఒక బల్లను చేయాలి. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండాలి.§అంటే, పొడవు సుమారు 90 సెం.మీ. వెడల్పు 45 సెం.మీ. ఎత్తు 68 సెం.మీ. 24 దాన్ని స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును చేయించారు. 25 అలాగే దాని చుట్టూ బెత్తెడు*అంటే, సుమారు 7.5 సెం.మీ. వెడల్పున చట్రం కూడా చేసి దానిపై బంగారంతో పోతపోయాలి. 26 ఆ బల్లకు నాలుగు ఉంగరాలు చేసి వాటిని నాలుగు కాళ్లు ఉన్న నాలుగు మూలల్లో తగిలించాలి. 27 బల్ల మోయడానికి ఉపయోగించే మోతకర్రలు ఉంచే ఉంగరాలు చట్రానికి దగ్గరగా పెట్టబడాలి. 28 తుమ్మకర్రతో మోతకర్రలు చేసి, వాటికి బంగారు పోతపోసి వాటితో ఆ బల్లను మోయాలి. 29 దాని పళ్లెములు పాత్రలు, పానార్పణలు పోయడానికి ఉపయోగించే బానలు గిన్నెలను స్వచ్ఛమైన బంగారంతో తయారుచేయాలి. 30 అన్ని వేళలా నా ఎదుట సన్నిధి రొట్టెలను ఈ బల్లమీద ఉంచాలి.
దీపస్తంభము
31 “స్వచ్ఛమైన బంగారంతో దీపస్తంభం చేయాలి. దాని అడుగు పీఠాన్ని నడిమి భాగాన్ని సుత్తెతో సాగగొట్టాలి, దాని కలశాలు దాని మొగ్గలు దాని పువ్వులు తయారుచేసి వాటితో ఒకే ఖండంలా చేయాలి. 32 దీపస్తంభానికి రెండు వైపుల నుండి ఆరు కొమ్మలు; ఒక ప్రక్క మూడు మరొక ప్రక్క మూడు కొమ్మలు విస్తరించి ఉండాలి. 33 ఒక కొమ్మకు మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన మూడు కలశాలు, తర్వాతి కొమ్మకు కూడా అలాగే మూడు కలశాల చొప్పున దీపస్తంభం నుండి విస్తరించివున్న ఆరు కొమ్మలకు అదే విధంగా ఉండాలి. 34 దీపస్తంభం మీద మొగ్గలు పువ్వులు ఉన్న బాదం పువ్వును పోలిన నాలుగు కలశాలు ఉండాలి. 35 దీపస్తంభం నుండి విస్తరించి ఉన్న మొదటి జత కొమ్మల క్రింద మొదటి మొగ్గ, రెండవ జత కొమ్మల క్రింద రెండవ మొగ్గ, మూడవ జత కొమ్మల క్రింద మూడవ మొగ్గ చొప్పున ఆరు కొమ్మలకు అమర్చాలి. 36 సాగగొట్టబడిన స్వచ్ఛమైన బంగారంతో మొగ్గలు కొమ్మలు దీపస్తంభంతో ఒకే ఖండంగా చేయాలి.
37 “తర్వాత దాని ఏడు దీపాలు తయారుచేసి దాని ఎదుట భాగం ప్రకాశించేలా వాటిని వెలిగించాలి. 38 దాని వత్తులు కత్తిరించే కత్తెరలు, పళ్ళాలను స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. 39 దీపస్తంభాన్ని దాని ఉపకరణాలను తయారుచేయడానికి ఒక తలాంతు†అంటే, సుమారు 34 కి. గ్రా. లు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాలి. 40 పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే నీవు వాటిని చేసేలా చూడాలి.
*25:5 బహుశ పాలిచ్చే పెద్ద నీటి జంతువుల తోళ్ళు
†25:10 అంటే, పొడవు 101 సెం.మీ వెడల్పు. ఎత్తు 68 సెం.మీ. 17 వచనంలో కూడ
‡25:18 కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు
§25:23 అంటే, పొడవు సుమారు 90 సెం.మీ. వెడల్పు 45 సెం.మీ. ఎత్తు 68 సెం.మీ.
*25:25 అంటే, సుమారు 7.5 సెం.మీ.
†25:39 అంటే, సుమారు 34 కి. గ్రా. లు