26
సమావేశ గుడారం
1 “పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేయాలి. వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి, వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లాలి. 2 తెరలన్నీ ఇరవై ఎనిమిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగి ఒకే కొలతతో ఉండాలి.*అంటే, 13 మీటర్ల పొడవు 1.8 మీటర్ల వెడల్పు 3 అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేయాలి; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేయాలి. 4 ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేయాలి. 5 ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేయాలి. 6 తర్వాత యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.
7 “సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేయాలి. 8 పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉండాలి.†అంటే, 13.5 మీటర్ల పొడవు 1.8 మీటర్ల వెడల్పు 9 అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలపాలి. ఆరవ తెరను గుడారం ముందు భాగంలో మడతపెట్టాలి. 10 మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేయాలి. 11 యాభై ఇత్తడి గుండీలు తయారుచేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి. 12 గుడారపు తెరల అధనపు పొడవు విషయానికొస్తే, మిగిలిన సగం తెర సమావేశ గుడారం వెనుక భాగం దగ్గర క్రిందకు వ్రేలాడి ఉండాలి. 13 గుడారపు తెరలు ఒక ప్రక్క ఒక మూర మరో ప్రక్క ఒక మూర పొడవు ఉండి, మిగిలిన భాగం సమావేశ గుడారాన్ని కప్పి ఉంచేలా దాని ప్రక్కల మీద వ్రేలాడదీయాలి. 14 గుడారం కోసం ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో పైకప్పును, దానిపైన మన్నికైన తోళ్లతో‡బహుశ పాలిచ్చే పెద్ద నీటి జంతువుల తోళ్ళు 25:5 కూడా చూడండి పైకప్పు తయారుచేయాలి.
15 “సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేయాలి. 16 ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉండాలి.§అంటే, 4.5 మీటర్ల పొడవు, 68 సెం.మీ. వెడల్పు 17 రెండు కొయ్యమేకులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చాలి. సమావేశ గుడారపు చట్రాలన్నిటిని ఈ విధంగా తయారుచేయాలి. 18 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు ఇరవై చట్రాలు తయారుచేయాలి. 19 ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేయాలి. 20 మరోవైపుకు, అంటే సమావేశ గుడారానికి ఉత్తర వైపుకు, ప్రతి చట్రం క్రింద రెండు చొప్పున, ఇరవై చట్రాలు తయారుచేయాలి. 21 నలభై వెండి దిమ్మలు తయారుచేయాలి. 22 పడమర వైపు అంటే సమావేశ గుడారం యొక్క వెనుక వైపు ఆరు చట్రాలు తయారుచేయాలి, 23 మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయాలి. 24 ఈ రెండు మూలల వద్ద అవి క్రింది నుండి పై వరకు రెండింతలు ఉండి ఒకే ఉంగరంలోకి అమర్చబడాలి; రెండూ ఒకేలా ఉండాలి. 25 అక్కడ ఎనిమిది చట్రాలు, ప్రతి చట్రం క్రింద రెండేసి చొప్పున పదహారు వెండి దిమ్మలు ఉంటాయి.
26 “అలాగే తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేయాలి: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు, 27 రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేయాలి. 28 మధ్య అడ్డకర్ర, చట్రాల మధ్యలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు విస్తరించాలి. 29 ఆ చట్రాలను బంగారంతో పొదిగించి, అడ్డకర్రలు ఉంచడానికి బంగారు ఉంగరాలు చేయాలి. అలాగే అడ్డకర్రలను కూడా బంగారంతో పొదిగించాలి.
30 “కొండమీద నీకు చూపించిన నమూనా ప్రకారమే సమావేశ గుడారాన్ని నిలబెట్టాలి.
31 “నీలం ఊదా ఎరుపు రంగుల్లో పేనిన సన్నని నారతో ఒక తెరను చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించాలి. 32 తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాలు చేసి బంగారంతో పొదిగించి నాలుగు వెండి దిమ్మలపై నిలబెట్టిన నాలుగు స్తంభాలకు బంగారు కొక్కేలతో దానిని వ్రేలాడదీయాలి. 33 ఆ తెరను కొలుకుల క్రింద తగిలించి నిబంధన మందసాన్ని ఆ తెర వెనుక ఉంచాలి. ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. 34 అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి. 35 తెర బయట సమావేశ గుడారానికి ఉత్తరం వైపు బల్ల ఉంచి దానికి ఎదురుగా దక్షిణం వైపు దీపస్తంభాన్ని ఉంచాలి.
36 “గుడారపు ప్రవేశ ద్వారానికి నీలం, ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పనితో ఒక తెర తయారుచేయాలి. 37 ఈ తెర కోసం తుమ్మ చెక్కతో అయిదు స్తంభాలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి, అలాగే బంగారు కొక్కేలు చేయాలి. తర్వాత వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు చేయాలి.