28
యాజక వస్త్రాలు
1 “నాకు యాజకులుగా సేవ చేయడానికి నీ సోదరుడైన అహరోనును అతని కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను ఇశ్రాయేలీయులలో నుండి నీ దగ్గరకు రమ్మని పిలిపించు. 2 నీ సోదరుడైన అహరోనుకు గౌరవం, ఘనత కలిగేలా అతని కోసం పవిత్ర వస్త్రాలను కుట్టాలి. 3 అహరోను నాకు యాజకునిగా సేవ చేయడానికి, అతడు ప్రతిష్ఠించబడాలి కాబట్టి అతనికి వస్త్రాలను తయారుచేయమని అలాంటి వాటి విషయాల్లో నేను జ్ఞానాన్ని ఇచ్చిన నైపుణ్యంగల పనివారందరికి చెప్పు. 4 వారు తయారుచేయవలసిన వస్త్రాలు ఇవే: రొమ్ము పతకం, ఏఫోదు, నిలువుటంగీ, అల్లిన చొక్కా, తలపాగా, నడికట్టు. నాకు యాజకులుగా సేవ చేయడానికి నీ సోదరుడైన అహరోనుకు అతని కుమారులకు ఈ పవిత్ర వస్త్రాలను తయారుచేయాలి. 5 వారికి బంగారంతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారబట్టను ఉపయోగించమని చెప్పండి.
ఏఫోదు
6 “బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో ఏఫోదును తయారుచేయాలి. 7 అది కదలకుండా ఉండేలా దాని రెండు భుజాల ముక్కలు రెండు మూలల్లో కూర్చబడాలి. 8 నైపుణ్యంగా అల్లబడిన దాని నడికట్టు ఏఫోదుతో ఒకే ముక్కగా బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో చేయబడినదై ఉండాలి.
9-10 “రెండు లేతపచ్చ రాళ్లు తీసుకుని వాటిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లు, వారు పుట్టిన క్రమం ప్రకారం ఒక రాయి మీద ఆరు పేర్లు మరొకదాని మీద మిగిలిన ఆరు పేర్లు చెక్కాలి. 11 ముత్యాలు చెక్కేవారు ముద్రను చెక్కినట్లు ఆ రెండు లేతపచ్చ రాళ్లమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కాలి. తర్వాత ఆ రాళ్లను బంగారు జరీ చట్రంలోకి ఎక్కించాలి. 12 తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించాలి. యెహోవా ఎదుట జ్ఞాపకంగా అహరోను తన భుజాలమీద ఆ పేర్లను మోయాలి. 13 బంగారు జవలను తయారుచేయాలి 14 స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా రెండు అల్లిన గొలుసులు చేసి, ఆ గొలుసులను జవలకు తగిలించాలి.
రొమ్ము పతకం
15 “నిర్ణయాలు తీసుకోవటానికి హస్త నైపుణ్యంతో కూడిన రొమ్ము పతకం చేయాలి. ఏఫోదును చేసినట్లు దీనిని బంగారం నీలం ఊదా ఎరుపురంగు నూలు పేనిన సన్నని నారతో తయారుచేయాలి. 16 అది చతురస్రంగా జానెడు*జానెడు సుమారు 23 సెం.మీ పొడవు జానెడు వెడల్పుతో రెండుగా మడత పెట్టబడి ఉండాలి. 17 దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదగాలి. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం; 18 రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, సూర్యకాంతం; 19 మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం; 20 నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి ఉండాలి. వాటిని బంగారు చట్రంలో అమర్చాలి. 21 ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉండాలి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడి ఉండాలి.
22 “రొమ్ము పతకానికి స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా అల్లికపనితో గొలుసులు చేయాలి. 23 రెండు బంగారు ఉంగరాలను చేసి వాటిని రొమ్ము పతకానికి రెండు చివర్లకు తగిలించాలి. 24 రొమ్ము పతకం చివరిలో ఉన్న ఉంగరాలకు రెండు బంగారు గొలుసులు బిగించి, 25 గొలుసుల యొక్క ఇతర చివరలను రెండు జవలకు, ముందు భాగంలో ఉన్న ఏఫోదు యొక్క భుజాలకు జోడించాలి. 26 రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి, వాటిని ఏఫోదు ముందు భాగంలో రొమ్ము పతకానికి లోపలి అంచున ఉన్న రెండు చివర్లకు జోడించాలి. 27 మరో రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి వాటిని ఏఫోదు నడికట్టుకు కొంచెం పైన దాని అతుకు దగ్గరగా ఏఫోదు ముందు భాగంలో రెండు భుజభాగాలకు క్రింది వైపున జోడించాలి. 28 అప్పుడు రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టాలి.
29 “అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్లినప్పుడు అతడు తన హృదయం మీద న్యాయవిధాన పతకంలోని ఇశ్రాయేలు కుమారుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిలో జ్ఞాపకంగా మోయాలి. 30 రొమ్ము పతకంలో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. అప్పుడు అహరోను యెహోవా సన్నిధికి వెళ్లినప్పుడు అవి అతని రొమ్ము మీద ఉంటాయి. అహరోను యెహోవా సన్నిధిలో తన హృదయం మీద ఇశ్రాయేలీయుల న్యాయవిధానాలను నిత్యం మోస్తాడు.
ఇతర యాజక వస్త్రాలు
31 “ఏఫోదు నిలువుటంగీని పూర్తిగా నీలి బట్టతో తయారుచేయాలి. 32 దాని మధ్యలో తల దూర్చడానికి రంధ్రం ఉండాలి. అది చిరిగిపోకుండా మెడపట్టీలా†హెబ్రీ భాషలో ఈ పదానికి ఖచ్చితమైన అర్థం తెలియదు దాని అంచుల చుట్టూ అల్లికపని చేయాలి. 33 ఆ వస్త్రం అంచు చుట్టూ నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో దానిమ్మపండ్లు తయారుచేసి, వాటి మధ్య బంగారంతో తయారుచేసిన గంటలను తగిలించాలి. 34 బంగారు గంటలు దానిమ్మపండ్లు ఒకదాని ప్రక్కన ఒకటిగా వస్త్రం అంచు చుట్టూ ఉండాలి. 35 అహరోను సేవ చేస్తున్నప్పుడు అతడు దీనిని ఖచ్చితంగా ధరించాలి. అతడు యెహోవా సన్నిధికి పరిశుద్ధాలయంలోకి వెళ్లినప్పుడు బయటకు వచ్చినప్పుడు అతడు చనిపోలేదు అని గ్రహించేలా ఆ గంటల శబ్దం తెలియజేస్తుంది.
36 “స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటం తయారుచేసి దాని మీద ముద్రలా ఈ మాటలు చెక్కాలి:
పరిశుద్ధత యెహోవాకే.
37 దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టాలి. అది తలపాగా ముందు భాగంలో ఉండాలి. 38 అది అహరోను నుదిటిపై ఉంటుంది, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించే పవిత్ర బహుమతులలో, ఆ బహుమతులు ఏవైనా సరే, వాటిలో ఉన్న అపరాధాన్ని అతడు భరిస్తాడు, అది అహరోను నుదుటిపై నిరంతరం ఉంటుంది, తద్వారా వారు యెహోవాకు అంగీకారంగా ఉంటారు.
39 “సన్నని నారబట్టతో చొక్కా నేయాలి. సన్నని నారబట్టతో తలపాగా తయారుచేయాలి. బుటా పనిగా నడికట్టు చేయాలి. 40 అహరోను కుమారులకు గౌరవం ఘనతా కలిగేలా చొక్కా నడికట్టు టోపీలను తయారుచేయాలి. 41 నీవు నీ సోదరుడైన అహరోనుకు అతని కుమారులకు ఈ వస్త్రాలను తొడిగించిన తర్వాత వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి. వారు నాకు యాజకులుగా సేవ చేయడానికి వారిని పవిత్రపరచాలి.
42 “వారి నగ్నత్వాన్ని కప్పుకోడానికి నడుము నుండి తొడల వరకు నారతో లోదుస్తులు తయారుచేయాలి. 43 అహరోను అతని కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా లేదా పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి ఎప్పుడు బలిపీఠాన్ని సమీపించినా వారు దోషశిక్షను భరించి చావకూడదంటే వారు ఖచ్చితంగా ఆ దుస్తులు ధరించాలి.
“ఇది అహరోనుకు అతని కుమారులకు ఇవ్వబడిన నిత్య కట్టుబాటుగా ఉంటుంది.