29
యాజకులను ప్రతిష్ఠించడం 
  1 “వారు నాకు యాజకులుగా సేవ చేసేలా వారిని ప్రతిష్ఠించడానికి నీవు చేయవలసినది ఏంటంటే, ఏ లోపం లేని ఒక కోడెను రెండు పొట్టేళ్లను తీసుకోవాలి.   2 మెత్తని గోధుమపిండితో పులియని గుండ్రని రొట్టెలు, నూనెతో కలిపిన పులియని పిండితో మందమైన రొట్టెలు, నూనె పూసిన పులియని రొట్టెలు చేయాలి.   3 వాటిని గంపలో పెట్టి ఆ కోడెను రెండు పొట్టేళ్లతో పాటు సమర్పించాలి.   4 తర్వాత అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి నీటితో వారిని కడగాలి.   5 ఆ వస్త్రాలను తీసుకుని అహరోను మీద పైవస్త్రం వేసి, ఏఫోదు వస్త్రాన్ని, ఏఫోదును, రొమ్ము పతకాన్ని ధరింపచేయాలి. ఏఫోదును నైపుణ్యంగా అల్లబడిన నడికట్టుతో అతనికి కట్టాలి.   6 అతని తలమీద తలపాగాను పెట్టి పవిత్ర చిహ్నాన్ని తలపాగాకు తగిలించాలి.   7 అభిషేక తైలాన్ని తీసుకుని అతని తలపై పోసి అతన్ని అభిషేకించాలి.   8 అతని కుమారులను తీసుకువచ్చి చొక్కాలు తొడిగించి   9 వారిపై టోపీలు పెట్టాలి. తర్వాత అహరోనుకు, అతని కుమారులకు నడికట్టు కట్టాలి. నిత్య కట్టుబాటు ద్వారా యాజకత్వం వారిదవుతుంది.  
“ఈ విధంగా అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠించాలి.   
 10 “నీవు సమావేశ గుడారం ఎదుటకు ఎద్దును తీసుకురావాలి, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులుంచాలి.   11 సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవా సన్నిధిలో ఆ ఎద్దును వధించాలి.   12 ఆ ఎద్దు రక్తంలో కొంత తీసుకుని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి.   13 కోడె లోపలి అవయవాల మీద ఉన్న క్రొవ్వునంతటిని, కాలేయం మీది క్రొవ్వు, రెండు మూత్రపిండాలు వాటి క్రొవ్వును తీసుకుని బలిపీఠం మీద కాల్చాలి.   14 అయితే కోడెను, దాని చర్మాన్ని దాని మాంసాన్ని, దాని పేడను శిబిరం బయట కాల్చివేయాలి. అది పాపపరిహారబలి.*లేదా శుద్ధీకరణ అర్పణ; 36 వచనంలో కూడా   
 15 “నీవు పొట్టేళ్లలో ఒకదాని తీసుకురావాలి, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులుంచాలి.   16 నీవు పొట్టేలును వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి.   17 పొట్టేలును ముక్కలు చేసి, దాని లోపలి అవయవాలను కాళ్లను కడిగి, వాటిని తల ఇతర ముక్కలతో ఉంచి,   18 ఆ పొట్టేలంతటిని బలిపీఠం మీద కాల్చాలి. అది యెహోవాకు దహనబలి, యెహోవాకు సమర్పించబడిన ఇష్టమైన సువాసనగల హోమబలి.   
 19 “మరొక పొట్టేలును తీసుకురావాలి, దాని తలమీద అహరోను అతని కుమారులు వారి చేతులుంచాలి.   20 నీవు ఆ పొట్టేలును వధించి, దాని రక్తం కొంత తీసుకుని అహరోను అతని కుమారుల కుడిచెవి అంచుకు, వారి కుడిచేతి బొటన వ్రేలి మీద, కుడికాలు బొటన వ్రేలి మీద పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి.   21 బలిపీఠం మీద నుండి కొంచెం రక్తాన్ని కొంచెం అభిషేక తైలాన్ని తీసుకుని అహరోను మీద అతని వస్త్రాల మీద, అతని కుమారుల మీద వారి వస్త్రాల మీద చిలకరించాలి. అప్పుడు అతడు అతని కుమారులు వారి వస్త్రాలు కూడా పవిత్రం చేయబడతాయి.   
 22 “ఆ పొట్టేలు ప్రతిష్ఠితమైనది కాబట్టి దాని క్రొవ్వును క్రొవ్విన దాని తోకను, లోపలి అవయవాలను కాలేయాన్ని క్రొవ్వుతో ఉన్న రెండు మూత్రపిండాలను, కుడి తొడను తీసుకోవాలి.   23 యెహోవా ఎదుట ఉన్న పులియని రొట్టెల గంపలో నుండి ఒక గుండ్రని రొట్టెను, ఒలీవనూనె కలిపి చేసిన ఒక మందమైన రొట్టెను, పల్చని రొట్టెను తీసుకుని,   24 వాటిని అహరోను అతని కుమారుల చేతుల్లో ఉంచాలి. వారు యెహోవా ఎదుట వాటిని పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి.   25 తర్వాత నీవు వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని బలిపీఠం మీద దహనబలితో కలిపి యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమంగా దహించాలి, ఇది యెహోవాకు సమర్పించబడిన హోమబలి.   26 అహరోనును ప్రతిష్ఠించడానికి పొట్టేలు రొమ్ము తీసుకుని యెహోవా ఎదుట పైకెత్తి దానిని ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అది నీ వాటా అవుతుంది.   
 27 “అహరోనుకు అతని కుమారులకు చెందిన ప్రతిష్ఠార్పణకు చెందిన పొట్టేలులోని ఆ భాగాలను ప్రతిష్ఠించాలి: ఆడించిన రొమ్ము, సమర్పించబడిన తొడ.   28 ఇది ఇశ్రాయేలీయుల నుండి అహరోనుకు అతని కుమారులకు చెందవలసిన శాశ్వత వాటా. ఇది ఇశ్రాయేలీయులు అర్పించే సమాధానబలులలో నుండి వారు యెహోవాకు అర్పించే ప్రత్యేక కానుక.   
 29 “అహరోను పవిత్ర వస్త్రాలు అతని తర్వాత అతని కుమారులకు చెందుతాయి; వారు అభిషేకించబడడానికి, ప్రతిష్ఠించబడడానికి వాటిని ధరించాలి.   30 అతని తర్వాత యాజకుడయ్యే అతని కుమారుడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి సమావేశ గుడారంలోకి వెళ్లేటప్పుడు ఏడు రోజులు వాటిని ధరించాలి.   
 31 “ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పవిత్ర స్థలంలో దాని మాంసాన్ని వండాలి.   32 సమావేశ గుడారపు ద్వారం దగ్గర అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు మాంసాన్ని గంపలోని రొట్టెలతో తినాలి.   33 వారిని ప్రతిష్ఠించడానికి, పరిశుద్ధపరచడానికి ప్రాయశ్చిత్తంగా వేటిని అర్పించారో వాటిని వారు తినాలి. అవి పవిత్రమైనవి కాబట్టి వారు తప్ప ఇతరులెవరు వాటిని తినకూడదు.   34 ఒకవేళ ప్రతిష్ఠితమైన పొట్టేలు మాంసం గాని రొట్టెలు గాని ఉదయం వరకు మిగిలి ఉంటే వాటిని కాల్చివేయాలి. అవి పవిత్రమైనవి కాబట్టి వాటిని తినకూడదు.   
 35 “నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అహరోను అతని కుమారుల పట్ల జరిగించాలి; ఏడు రోజులు నీవు వారిని ప్రతిష్ఠించాలి.   36 ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రతిరోజు ఒక ఎద్దును పాపపరిహారబలిగా అర్పించాలి. బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం జరిగించి బలిపీఠాన్ని శుద్ధి చేయాలి, అలాగే దాన్ని ప్రతిష్ఠించడానికి అభిషేకం చేయాలి.   37 ఏడు రోజులు బలిపీఠం కోసం ప్రాయశ్చిత్తం చేసి దానిని ప్రతిష్ఠించండి. అప్పుడు బలిపీఠం అత్యంత పరిశుద్ధమవుతుంది; దానికి తగిలినవన్ని పరిశుద్ధమవుతాయి.   
 38 “నీవు క్రమం తప్పకుండా ప్రతిరోజు బలిపీఠం మీద ఏడాది గొర్రెపిల్లలు రెండు అర్పించాలి.   39 ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి.   40 దంచి తీసిన ఒక పావు హిన్†అంటే, సుమారు 1 లీటర్ ఒలీవనూనెతో కలిపిన ఒక ఓమెరు‡లేదా ఒక ఏఫాలో పదియవ వంతు అని ప్రస్తావించబడింది. అంటే సుమారు 1.6 కి. గ్రా. లు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ద్రాక్షారసాన్ని పానార్పణగా మొదటి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి.   41 సాయంకాలం మరొక గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణ, పానార్పణ అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.   
 42 “యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గర రాబోయే తరాలన్ని క్రమంగా నిత్యం ఈ దహనబలిని అర్పించాలి. అక్కడే నేను మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడతాను.   43 అక్కడే నేను ఇశ్రాయేలీయులను కలుసుకుంటాను; ఆ స్థలం నా మహిమచేత పవిత్రం చేయబడుతుంది.   
 44 “కాబట్టి నేను సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని ప్రతిష్ఠ చేస్తాను, నాకు యాజకులుగా సేవ చేసేందుకు అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠ చేస్తాను.   45 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవునిగా ఉంటాను.   46 నేను వారి మధ్య నివసించేలా, వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన వారి దేవుడనైన యెహోవాను నేనేనని వారు తెలుసుకుంటారు. నేను వారి దేవుడనైన యెహోవాను.