4
తిరిగి కట్టకూడదని వ్యతిరేకత 
  1 చెర నుండి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కడుతున్నారని యూదా, బెన్యామీనీయుల శత్రువులు విని,   2 జెరుబ్బాబెలు దగ్గరకు, కుటుంబ పెద్దల దగ్గరకు వచ్చి, “అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చినప్పటి నుండి మీలాగే మేము కూడా మీ దేవుని వెదకుతున్నాం, ఆయనకు బలులు అర్పిస్తూ ఉన్నాం కాబట్టి నిర్మాణంలో మేము మీకు సహాయం చేస్తాం” అన్నారు.   
 3 అయితే జెరుబ్బాబెలు, యెషూవ, మిగిలిన కుటుంబ పెద్దలు, “మా దేవుని ఆలయ నిర్మాణంలో మీకు పాలు లేదు. పర్షియా రాజైన కోరెషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరాన్ని మేమే కడతాం” అన్నారు.   
 4 అప్పుడు ఆ దేశ ప్రజలు యూదా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ కడుతున్నవారిని భయపెట్టారు.   5 పర్షియా రాజైన కోరెషు పరిపాలించిన కాలం నుండి పర్షియా రాజైన దర్యావేషు పరిపాలించిన కాలం వరకు యూదా వారి ప్రణాళికలను చెడగొట్టడానికి వారు అధికారులకు లంచాలు ఇచ్చారు.   
అహష్వేరోషు, అర్తహషస్తల పాలనలో వ్యతిరేకత 
  6 అహష్వేరోషు పరిపాలన ఆరంభంలో యూదా వారి మీద, యెరూషలేము వారిమీద ఫిర్యాదు చేస్తూ ఉత్తరం వ్రాసి పంపారు.   
 7 పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న సమయంలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు వారి సహచరులు అర్తహషస్తకు ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరం అరామిక్ లిపిలో, అరామిక్ భాషలో వ్రాయబడింది.*లేదా అరామిక్ లిపిలో వ్రాయబడి అరామిక్ భాషలో అనువదించబడింది†4:8–6:18 ఉన్న భాగం అరామిక్ భాషలో ఉంది   
 8 ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, యెరూషలేము వారి మీద ఫిర్యాదు చేస్తూ రాజైన అర్తహషస్తకు ఇలా ఉత్తరం వ్రాశారు:   
 9 ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, వారి తోటి ఉద్యోగులు అనగా పర్షియా, ఎరెకు, బబులోను, షూషనుకు చెందిన ఏలామీయుల న్యాయాధిపతులు, అధికారులు,   10 గొప్పవాడు గౌరవనీయుడైన ఆస్నప్పరు‡ఆషుర్బనిపలు ఆస్నప్పరు యొక్క మరొక రూపం విడుదల చేయగా, సమరయ పట్టణంలో యూఫ్రటీసు నదిని అవతల నివసించే ఇతర ప్రజలు వ్రాస్తున్న ఉత్తరము.   
 11 (ఇది వారు రాజుకు వ్రాసిన ఉత్తరానికి నకలు.)  
రాజైన అర్తహషస్తకు,  
యూఫ్రటీసు నది అవతల ఉంటున్న మీ సేవకులు వ్రాస్తున్న ఉత్తరము.   
 12 రాజైన మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీ దగ్గర నుండి మా దగ్గరకు వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు గోడలను మరలా కడుతూ పునాదులను మరమ్మత్తు చేస్తున్నారు.   
 13 అంతేకాక, మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, ఒకవేళ వీరే ఈ పట్టణాన్ని కట్టి దాని ప్రాకారాలు తిరిగి నిర్మిస్తే వారు పన్నులు గాని కప్పం గాని లేదా సుంకం గాని చెల్లించరు. తద్వారా రాజ్య ఆదాయానికి నష్టం కలుగుతుంది.   14 మేము రాజుకు కట్టుబడి ఉన్నాం కాబట్టి రాజుకు అవమానం జరిగితే చూడలేము. అందుకే రాజుకు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాము.   15 మీ పూర్వికులు వ్రాసిన చరిత్రను పరిశీలన చేయండి. వాటిలో ఈ పట్టణస్థులు తిరుగుబాటుదారులని, రాజులకు దేశాలకు హాని చేశారని, దేశద్రోహులని తెలుస్తుంది. ఆ కారణంగానే ఆ పట్టణం నాశనం అయ్యింది.   16 వీరు ఈ పట్టణాన్ని కట్టి దాని గోడలను మరలా కడితే, యూఫ్రటీసు నది అవతలి ప్రాంతంలో ఏది కూడా మీ ఆధీనంలో ఉండదని రాజుకు తెలియజేస్తున్నాము.   
 17 దానికి రాజు ఇచ్చిన సమాధానం ఇది:  
ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, సమరయలో యూఫ్రటీసు నది అవతలి ప్రాంతంలో నివసించేవారి సహోద్యోగులకు:  
శుభాలు.   
 18 మీరు మాకు పంపిన ఉత్తరాన్ని నా ఎదుట చదివి అనువదించారు.   19 నా ఆజ్ఞ ప్రకారం పరిశోధించగా ఈ పట్టణానికి రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సుదీర్ఘ చరిత్ర ఉందని, అది తిరుగుబాటుకు దేశద్రోహానికి స్థానమని తెలిసింది.   20 గతంలో యెరూషలేమును పరిపాలించిన బలమైన రాజుల ఆధీనంలోనే యూఫ్రటీసు నది అవతలి ప్రాంతమంతా ఉండేది. వారికి పన్నులు, కప్పం, సుంకం చెల్లించేవారు.   21 ఇప్పుడు అక్కడ ఉన్నవారు తమ పనిని వెంటనే ఆపి మరలా నేను ఆజ్ఞ ఇచ్చేవరకు ఆ పట్టణాన్ని తిరిగి కట్టకూడదని ఆదేశం జారీ చేయండి.   22 ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రాజ్య ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం జరగడానికి ఎందుకు అనుమతించాలి?   
 23 రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరం నకలు రెహూము, షింషయి వారి తోటి ఉద్యోగులకు చదివి వినిపించిన వెంటనే వారు యెరూషలేములోని యూదుల దగ్గరకు వెళ్లి పని చేయడం ఆపమని బలవంతం చేశారు.   
 24 కాబట్టి యెరూషలేములో జరుగుతున్న దేవుని మందిరం పని ఆగిపోయింది. పర్షియా రాజైన దర్యావేషు హయాములో రెండవ సంవత్సరం వరకు పని ఆగిపోయింది.