5
దర్యావేషుకు ఉత్తరం వ్రాసిన తత్తెనై
1 ప్రవక్తయైన హగ్గయి ఇద్దోకు వారసుడు, ప్రవక్తయైన జెకర్యా యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రవచించారు. 2 అప్పుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ, యెరూషలేములో దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టించడం మొదలుపెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి మద్ధతు ఇచ్చారు.
3 ఆ సమయంలో యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు వారి దగ్గరకు వెళ్లి, “ఈ మందిరాన్ని మరలా కట్టి దానిని పూర్తి చేయడానికి మీకు ఎవరు అనుమతిచ్చారు?” అని వారిని ప్రశ్నించారు. 4 అంతే కాకుండా, “ఈ భవనాన్ని కడుతున్న వారి పేర్లు ఏమిటి?” అని కూడా అడిగారు. 5 అయితే వారి దేవుని దృష్టి యూదుల పెద్దలను కాపాడుతూ ఉంది కాబట్టి ఈ సమాచారం దర్యావేషుకు చేరి అతని దగ్గర నుండి వ్రాతపూర్వక జవాబు వచ్చేవరకు వారు పని చేయడం ఆపలేదు.
6 యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు రాజైన దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ఇది. 7 వారు పంపిన సమాచారం ఇలా ఉంది:
రాజైన దర్యావేషుకు:
హృదయపూర్వక శుభాలు.
8 రాజు తెలుసుకోవలసింది ఏంటంటే, మేము యూదా జిల్లాకు అక్కడ ఉన్న గొప్ప దేవుని ఆలయానికి వెళ్లాము. ప్రజలు దానిని పెద్ద రాళ్లతో కడుతున్నారు, గోడలకు దూలాలు అమరుస్తున్నారు. వారి ఆధ్వర్యంలో పనులు శ్రద్ధతో, శరవేగంగా జరుగుతున్నాయి.
9 మేము అక్కడి పెద్దలను, “ఈ మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానిని పూర్తి చేయడానికి మీకు అనుమతి ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించాము. 10 అంతే కాకుండా వారి నాయకుల పేర్లు వివరాలు మీకు అందించడానికి వారి పేర్లను కూడా అడిగి తెలుసుకున్నాము.
11 వారు మాకిచ్చిన జవాబు ఇది:
“మేము భూమ్యాకాశాల దేవుని సేవకులము. చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాము. 12 మా పూర్వికులు పరలోక దేవునికి కోపం తెప్పించారు కాబట్టి ఆయన వారిని బబులోను రాజు, కల్దీయుడైన నెబుకద్నెజరు చేతికి అప్పగించారు, అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బందీలుగా బబులోను తీసుకెళ్లాడు.
13 “అయినా, బబులోను రాజైన కోరెషు హయాములో మొదటి సంవత్సరంలో రాజైన కోరెషు ఈ దేవుని మందిరాన్ని మరలా కట్టడానికి శాసనం జారీ చేశాడు. 14 అంతేకాదు గతంలో నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోను క్షేత్రానికి*లేదా రాజభవనం తీసుకెళ్లిన దేవుని మందిరపు వెండి బంగారు వస్తువులను రాజైన కోరెషు బబులోను క్షేత్రంలో నుండి తెప్పించి, తాను అధిపతిగా నియమించిన షేష్బజ్జరుకు వాటిని ఇచ్చి, 15 అతనితో అన్నాడు, ‘నీవు ఈ వస్తువులను తీసుకెళ్లి యెరూషలేములోని మందిరంలో ఉంచాలి. ఆ స్థలంలో దేవుని మందిరాన్ని తిరిగి కట్టించాలి.’
16 “కాబట్టి ఈ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో దేవుని ఆలయానికి పునాది వేశాడు. అప్పటినుండి నేటివరకు దాన్ని కడుతున్నాము కాని అది ఇంకా పూర్తి కాలేదు.”
17 ఇది రాజుకు ఇష్టమైతే, యెరూషలేములో దేవుని మందిరాన్ని నిర్మించడానికి రాజైన కోరెషు ఆదేశం ఇచ్చాడో లేదో తెలుసుకోవడానికి బబులోను రాజ్య దస్తావేజులను పరిశోధించండి. అప్పుడు ఈ విషయంలో రాజు నిర్ణయాన్ని మాకు తెలియచేయాలని కోరుతున్నాము.