8
ఇశ్రాయేలు సుడిగాలిని కోస్తారు 
  1 “బూర నీ పెదవులపై పెట్టుకో!  
ఒక గ్రద్ద యెహోవా ఇంటి మీద వ్రాలింది.  
ఎందుకంటే ప్రజలు నా నిబంధనను మీరి,  
నా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు.   
 2 ఇశ్రాయేలు, ‘మా దేవా!  
మిమ్మల్ని మేము తెలుసుకున్నాం’ అని మొరపెడుతుంది.   
 3 కాని ఇశ్రాయేలు మంచి దానిని విసర్జించారు;  
కాబట్టి శత్రువులు వారిని తరుముతారు.   
 4 వారు నా సమ్మతి లేకుండా రాజులను నియమించుకున్నారు,  
వారు నా ఆమోదం లేకుండా అధిపతులను ఎన్నుకున్నారు.  
వారి వెండి బంగారాలతో  
తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు.  
అవి వారి సొంత నాశనానికే.   
 5 సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి!  
నా కోపం వాటి మీద రగులుకుంది  
ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు?   
 6 ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి!  
ఈ దూడను కంసాలి తయారుచేశాడు.  
అది దేవుడు కాదు,  
ఆ సమరయ దూడ  
ముక్కలుగా విరగ్గొట్టబడుతుంది.   
 7 “వారు గాలిని విత్తుతారు,  
సుడిగాలిని కోస్తారు.  
పైరుకు కంకులు లేవు,  
దాని నుండి పిండి రాదు.  
అది ఒకవేళ పంటకు వస్తే,  
విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు.   
 8 ఇశ్రాయేలు మ్రింగివేయబడింది;  
ఇప్పుడు అది ఎవరికీ ఇష్టం లేనిదానిగా,  
ఇతర దేశాల మధ్య ఉంది.   
 9 వారు ఒంటరిగా తిరిగే అడవి గాడిదలా,  
అష్షూరుకు వెళ్లారు,  
ఎఫ్రాయిం తనను తాను విటులకు అమ్ముకుంది.   
 10 వారు తమను ఇతర దేశాల్లో అమ్ముకున్నప్పటికీ,  
నేను వారిని ఇప్పుడు సమకూరుస్తాను.  
బలవంతుడైన రాజు పెట్టే భారం క్రింద,  
వారు నీరసించిపోతారు.   
 11 “పాపపరిహార బలులు అర్పించడానికి ఎఫ్రాయిం అనేక బలిపీఠాలు నిర్మించింది,  
కాని అవే పాపం చేయడానికి కారణమయ్యాయి.   
 12 నేను వారి కోసం నా ధర్మశాస్త్ర విషయాలు ఎన్నో వ్రాశాను,  
కాని అవి తమకు సంబంధించినవి కావన్నట్లు పరిగణించారు.   
 13 వారు తమ బలులు నాకు బహుమానంగా ఇచ్చినా,  
వాటి మాంసం తిన్నా సరే,  
యెహోవా వారిని బట్టి సంతోషించడం లేదు.  
ఇప్పుడు ఆయన వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని,  
వారి పాపాలను శిక్షిస్తారు:  
వారు ఈజిప్టుకు తిరిగి వెళ్తారు.   
 14 ఇశ్రాయేలు తమ సృష్టికర్తను మరచిపోయి  
రాజభవనాలను కట్టుకున్నారు;  
యూదావారు చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు.  
అయితే నేను వారి పట్టణాల మీద అగ్ని కురిపిస్తాను,  
అది వాటి కోటలను దహించి వేస్తుంది.”