9
ఇశ్రాయేలుకు శిక్ష 
  1 ఇశ్రాయేలూ, ఆనందించకు;  
ఇతర దేశాల్లా ఉత్సాహపడకు.  
నీవు నీ దేవుని పట్ల నమ్మకంగా లేవు;  
ధాన్యం దుల్లగొట్టే నీ నూర్పిడి కళ్ళాలన్నిటిలో  
నీవు వేశ్యల జీతాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డావు.   
 2 నూర్పిడి కళ్ళాలు, ద్రాక్ష గానుక తొట్లు ప్రజలను పోషించవు,  
క్రొత్త ద్రాక్షరసం వారికి మిగలదు.   
 3 వారు యెహోవా దేశంలో నిలిచి ఉండరు,  
ఎఫ్రాయిం ఈజిప్టుకు తిరిగి వెళ్తుంది,  
అష్షూరులో అపవిత్ర ఆహారాన్ని తింటుంది.   
 4 వారు యెహోవాకు ద్రాక్షరస పానార్పణలు అర్పించరు,  
వారి బలులు ఆయనను సంతోషపరచవు.  
అట్టి బలులు ఏడ్చేవారి రొట్టెలా ఉంటాయి.  
వాటిని తినేవారందరు అపవిత్రులవుతారు.  
ఈ ఆహారం వారికే సరిపడుతుంది;  
అది యెహోవా మందిరంలోకి రాదు.   
 5 మీ నియమించబడిన పండుగల దినాన,  
యెహోవా విందు దినాల్లో మీరేం చేస్తారు?   
 6 వారు నాశనాన్ని తప్పించుకున్నా సరే,  
ఈజిప్టువారిని సమకూరుస్తుంది,  
మెంఫిసు వారిని పాతిపెడుతుంది.  
వారికి ప్రియమైన వెండి వస్తువులను దురదగొండ్లు ఆక్రమిస్తాయి,  
వారి గుడారాలు ముళ్ళతో నిండుతాయి.   
 7 శిక్షా దినాలు వస్తున్నాయి,  
వెల చెల్లించే దినాలు సమీపంగా ఉన్నాయి.  
ఇశ్రాయేలు దీనిని తెలుసుకోవాలి.  
ఎందుకంటే మీ అపరాధాలు అనేకం,  
మీరు చూపిన శత్రుత్వం తీవ్రమైంది కాబట్టి  
ప్రవక్త మూర్ఖునిగా,  
ప్రభావం గల వ్యక్తి పిచ్చివానిగా పరిగణించబడుతున్నారు.   
 8 నా దేవునితో పాటు ఉండే ప్రవక్త  
ఎఫ్రాయిం ప్రజలకు కావలివాడు,  
అయినప్పటికీ అతని త్రోవలన్నిట్లో ఉచ్చులు పొంచి ఉన్నాయి.  
తన దేవుని ఆలయంలో కూడా శత్రువులు ఉన్నారు.   
 9 గిబియా రోజుల్లో ఉన్నట్లు,  
వారు అవినీతిలో లోతుగా మునిగిపోయారు.  
దేవుడు వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని,  
వారి పాపాల కోసం వారిని శిక్షిస్తారు.   
 10 “నాకు ఇశ్రాయేలు దొరికినప్పుడు,  
ఎడారిలో ద్రాక్షపండ్లు చూసినట్లు అనిపించింది;  
నేను మీ పూర్వికులను చూసినప్పుడు,  
అంజూర చెట్టు మీద తొలి పండ్లను చూసినట్లు అనిపించింది.  
అయితే వారు బయల్-పెయోరు వచ్చినప్పుడు,  
వారు ఆ సిగ్గుమాలిన విగ్రహానికి తమను తాము ప్రతిష్ఠించుకొన్నారు,  
తాము ఇష్టపడింది ఎంత నీచమో, వారు అంత నీచులయ్యారు.   
 11 ఎఫ్రాయిం యొక్క ఘనత పక్షిలా ఎగిరిపోతుంది,  
పుట్టుక, గర్భధారణ, పిల్లలను కనడం వారిలో ఉండవు.   
 12 వారు పిల్లలను పెంచినా సరే,  
నేను వారికి మనుష్యులందరిని దూరం చేస్తాను.  
నేను వారిని విడిచిపెట్టినప్పుడు,  
వారికి శ్రమ!   
 13 నేను ఎఫ్రాయిమును,  
అందమైన స్థలంలో నాటబడిన తూరులా చూశాను.  
కాని ఎఫ్రాయిం తన పిల్లలను,  
వధించే వాని దగ్గరకు తెస్తుంది.”   
 14 యెహోవా, వారికి ఇవ్వండి,  
వారికి మీరేమి ఇస్తారు,  
జన్మనివ్వలేని గర్భాలను,  
ఎండిపోయిన రొమ్ములను వారికి ఇవ్వండి.   
 15 “గిల్గాలులో వారి చెడుతనం అంతటిని బట్టి,  
అక్కడ వారిని ద్వేషిస్తున్నాను.  
వారు పాప క్రియలనుబట్టి,  
నేను వారిని నా మందిరంలో నుండి వెళ్లగొడతాను.  
నేను ఇక ఎన్నడూ వారిని ప్రేమించను;  
వారి నాయకులంతా తిరుగుబాటుదారులు.   
 16 ఎఫ్రాయిమువారు మొత్తబడ్డారు,  
వారి వేరు ఎండిపోయింది,  
వారు ఇక ఫలించరు.  
ఒకవేళ వారు పిల్లలు కన్నా,  
వారి ప్రియమైన సంతతిని నేను నాశనం చేస్తాను.”   
 17 వారు నా దేవునికి లోబడలేదు కాబట్టి,  
ఆయన వారిని తిరస్కరించారు;  
వారు ఇతర దేశాల్లో తిరుగుతూ ఉంటారు.