15
మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం 
  1 మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం:  
ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం  
పాడై నశిస్తుంది!  
ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం  
పాడై నశిస్తుంది!   
 2 దీబోను ఏడ్వడానికి గుడికి  
తన క్షేత్రాలకు వెళ్తుంది;  
నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది.  
ప్రతి తల క్షౌరం చేయబడింది  
ప్రతివాని గడ్డం గొరిగించబడింది.   
 3 వారు తమ సంతవీధులలో గోనెపట్ట కట్టుకుంటారు;  
తమ మేడల మీద, బహిరంగ స్థలాల్లో  
వారందరు రోదిస్తారు,  
ఏడుస్తూ కన్నీరు కారుస్తారు.   
 4 హెష్బోను ఎల్యాలెహు మొరపెడుతున్నారు,  
యాహాజు వరకు వారి స్వరం వినబడుతుంది.  
కాబట్టి మోయాబీయుల వీరులు మొరపెడతారు,  
వారి హృదయాలు క్రుంగిపోతాయి.   
 5 మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది;  
వారిలో పారిపోయినవారు సోయరు వరకు,  
ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు.  
వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు  
ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు;  
హొరొనయీము వెళ్లే దారిలో  
తమ నాశనం గురించి విలపిస్తారు.   
 6 నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి  
గడ్డి ఎండిపోయింది;  
వృక్ష సంపద ఉండదు  
పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.   
 7 కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తిని  
నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు.   
 8 వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి;  
వారి రోదన ఎగ్లయీము వరకు  
వారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది.   
 9 దీమోను నీళ్లు రక్తంతో నిండిపోయాయి  
కాని నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పిస్తాను.  
మోయాబు నుండి తప్పించుకున్నవారి మీదికి  
ఆ దేశంలో మిగిలిన వారి మీదికి సింహాన్ని రప్పిస్తాను.