16
 1 ఎడారి వైపు ఉన్న సెల నుండి  
దేశాన్ని పాలించేవానికి  
కప్పంగా గొర్రెపిల్లలను  
సీయోను కుమార్తె పర్వతానికి పంపండి.   
 2 గూటినుండి చెదరగొట్టబడి  
ఇటు అటు ఎగిరే పక్షుల్లా  
అర్నోను రేవుల దగ్గర  
మోయాబు స్త్రీలు ఉంటారు.   
 3 మోయాబు అంటుంది, “మనస్సు సిద్ధం చేసుకో,  
నిర్ణయం తీసుకో.  
చీకటి కమ్మినట్టుగా మిట్టమధ్యాహ్నం  
నీ నీడ మామీద ఉండనివ్వు.  
పారిపోయినవారిని దాచి పెట్టు,  
శరణార్థులకు ద్రోహం చేయకు.   
 4 పారిపోయిన మోయాబీయులను నీతో ఉండనివ్వు;  
నాశనం చేసేవాని నుండి కాపాడే ఆశ్రయంగా ఉండు.”  
హాని చేసేవారు అంతం అవుతారు,  
విధ్వంసం ఆగిపోతుంది;  
అణచివేసేవారు భూమి మీద లేకుండా మాయమవుతారు.   
 5 మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది;  
దావీదు కుటుంబం నుండి  
సత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చుని  
న్యాయంగా తీర్పు తీర్చుతూ  
నీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు.   
 6 మోయాబు గర్వం గురించి మేము విన్నాము  
దాని అహంకారం చాలా ఎక్కువ  
దాని ప్రగల్భాలు, గర్వం, దౌర్జన్యం గురించి విన్నాం;  
అయితే దాని ప్రగల్భాలు వట్టివే.   
 7 కాబట్టి మోయాబీయులు రోదిస్తారు,  
వారందరూ కలిసి మోయాబు గురించి ఏడుస్తారు.  
కీర్ హరెశెతుకు ఎండు ద్రాక్షపండ్ల  
విలపించి దుఃఖిస్తారు.   
 8 హెష్బోను పొలాలు,  
షిబ్మా ద్రాక్షతీగెలు కూడా వాడిపోయాయి.  
యాజెరు వరకు వ్యాపించిన  
అరణ్యం వరకు ప్రాకిన  
శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను  
దేశాల పాలకులు త్రొక్కివేశారు.  
వాటి తీగెలు విశాలంగా వ్యాపించి  
సముద్రాన్ని*బహుశ మృత సముద్రం దాటాయి.   
 9 అందువల్ల యాజెరు ఏడ్చినట్లు  
నేను షిబ్మా ద్రాక్షతీగెల కోసం ఏడుస్తాను.  
హెష్బోనూ ఎల్యాలెహు,  
నా కన్నీటి చేత మిమ్మల్ని తడుపుతాను.  
నీ పండిన ఫలాల కోసం  
నీ పంటల కోసం వేసే సంతోషపు కేకలు ఆగిపోయాయి.   
 10 ఫలభరితమైన పొలాల నుండి ఆనంద సంతోషాలు తీసివేయబడతాయి;  
ద్రాక్షతోటలో ఎవరూ పాడరు, కేకలు వేయరు;  
గానుగులలో ద్రాక్షగెలలను ఎవరూ త్రొక్కరు.  
ఎందుకంటే, నేను వారి సంతోషపు అరుపులు ఆపివేశాను.   
 11 నా హృదయం వీణలా మోయాబు గురించి,  
నా అంతరంగం కీర్ హరెశెతు గురించి విలపిస్తుంది.   
 12 మోయాబు తన క్షేత్రాల దగ్గరకు వెళ్లినప్పుడు  
అది కేవలం ఆయాసపడుతుంది;  
ప్రార్ధన చేయడానికి తన క్షేత్రానికి వెళ్లినప్పుడు  
దానికి ఏమి దొరకదు.   
 13 యెహోవా మోయాబు గురించి ముందే పలికిన వాక్కు ఇది.   14 అయితే యెహోవా ఇప్పుడు ఇలా చెప్తున్నారు: “మూడు సంవత్సరాల్లో, కూలివాని లెక్క ప్రకారం ఖచ్చితంగా మోయాబు ఘనతతో పాటు దానిలోని అనేకమంది తృణీకరించబడతారు; దానిలో మిగిలినవారు అతితక్కువగా, బలహీనంగా ఉంటారు.”