17
దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం 
  1 దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం:  
“చూడండి, దమస్కు ఒక పట్టణంగా ఇక ఉండదు,  
కాని అది శిథిలాల కుప్పగా మారుతుంది.   
 2 అరోయేరు పట్టణాలు నిర్జనమవుతాయి  
అవి గొర్రెల మందలకు వదిలేయబడతాయి,  
ఎవరి భయం లేకుండా అవి అక్కడ పడుకుంటాయి.   
 3 ఎఫ్రాయిములో నుండి కోటగల పట్టణం మాయమవుతుంది,  
దమస్కు రాజ్యాధికారాన్ని కోల్పోతుంది;  
ఇశ్రాయేలీయుల ప్రభావానికి జరిగినట్లు  
అరాములో మిగిలినవారికి జరుగుతుంది”  
అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.   
 4 “ఆ రోజున యాకోబు ప్రభావం తగ్గిపోతుంది;  
అతని శరీరం యొక్క క్రొవ్వు తరిగిపోతుంది.   
 5 అది కోత కోసేవారు ధాన్యం కోసినప్పుడు  
వారి చేతుల్లో వెన్నులు కోసినట్లుగా ఉంటుంది.  
రెఫాయీము లోయలో  
ఒకడు పరిగె ఏరుకున్నట్లుగా ఉంటుంది.   
 6 అయినా ఒలీవచెట్టు కొమ్మలు దులపగా  
పై కొమ్మ చివర రెండు మూడు పండ్లు మిగిలినట్లు,  
ఫలించు చెట్టు కొమ్మల్లో మూడు, నాలుగు పండ్లు మిగిలినట్లు,  
కొంత పరిగె మిగిలి ఉంటుంది” అని  
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు.   
 7 ఆ రోజున మనుష్యులు తమ సృష్టికర్త వైపు చూస్తారు  
వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు తమ దృష్టిని మరల్చుకుంటారు.   
 8 వారు తమ చేతుల పనియైన  
బలిపీఠాల వైపు చూడరు,  
తమ చేతివ్రేళ్లు చేసిన అషేరా స్తంభాలను  
ధూపవేదికలను పట్టించుకోరు.   
 9 ఆ రోజున ఇశ్రాయేలీయుల కారణంగా వారు విడిచిపెట్టిన బలమైన నిర్మానుష్యంగా పట్టణాలు పొదలు తుప్పలు పెరిగే స్థలాల్లా ఉంటాయి. అవి పాడైపోతాయి.   
 10 నీ రక్షకుడైన దేవుని నీవు మరచిపోయావు;  
నీ బలానికి ఆధారమైన బండను గుర్తు చేసుకోలేదు.  
కాబట్టి నీవు అందమైన తోటలు పెంచినా  
వాటిలో విదేశీ ద్రాక్షతీగెలు నాటినా,   
 11 నీవు వాటిని నాటిన రోజున అవి పెరిగేలా నీవు చేసినా,  
ఉదయాన నీవు వేసిన విత్తనాలు పూలు పూచేలా నీవు చేసినా,  
రోగం, తీరని దుఃఖం కలిగే రోజున  
పంట ఏమి లేనట్లుగా ఉంటుంది.   
 12 ఘోషిస్తున్న అనేక దేశాలకు శ్రమ  
వారు హోరెత్తిన సముద్రంలా ఘోషిస్తున్నారు!  
గర్జిస్తున్న ప్రజలకు శ్రమ  
వారు గొప్ప నీటి ప్రవాహాల్లా గర్జిస్తున్నారు!   
 13 ఉప్పొంగుతున్న నీటిలా ప్రజలు గర్జించినా  
ఆయన వారిని బెదిరించగా, వారు దూరంగా పారిపోతారు.  
కొండల మీది పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు,  
సుడిగాలికి గిరగిరా తిరుగుతూ ఎగిరిపోయే పిచ్చిమొక్కలా తరమబడతారు.   
 14 సాయంకాలంలో ఆకస్మిక భయం!  
ఉదయం కాక ముందే వారు కనుమరుగవుతారు!  
మమ్మల్ని దోచుకునేవారి భాగం ఇదే,  
మా సొమ్ము దొంగతనం చేసేవారికి దొరికేది ఇదే.