3
కనానులో యుద్ధాలను అనుభవించని ఆ ఇశ్రాయేలీయులందరిని పరీక్షించడానికి యెహోవా విడిచిపెట్టిన దేశాలు ఇవి ఆయన యుద్ధం చేసే పూర్వ అనుభవంలేని ఇశ్రాయేలీయుల సంతానానికి యుద్ధం నేర్పించడానికి మాత్రమే ఇలా చేశారు: ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్-హెర్మోను నుండి లెబో హమాతు వరకు ఉన్న లెబానోను పర్వతాల్లో ఉండే హివ్వీయులు. యెహోవా మోషే ద్వారా వారి పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలు వారు అనుసరిస్తారో లేదో చూడడానికి ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి వారు అక్కడ ఉంచబడ్డారు.
కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయుల మధ్యలో నివసించారు. వారు వారి కుమార్తెలను పెళ్ళి కోసం తీసుకుని తమ కుమార్తెలను వారి కుమారులకు ఇచ్చారు, వారి దేవుళ్ళను సేవించారు.
ఒత్నీయేలు
ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడు కార్యాలు చేశారు; తమ దేవుడైన యెహోవాను మరచి బయలు అషేరా ప్రతిమలను సేవించారు. యెహోవా కోపం ఇశ్రాయేలుపై మీద రగులుకున్నందుకు ఆయన వారిని అరాము నహరయీము*అంటే, వాయువ్య మెసొపొటేమియా రాజైన కూషన్-రిషాతాయిముకు వారిని అమ్మేశారు, అతనికి వారు ఎనిమిది సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన వారి కోసం రక్షకునిగా కాలేబు తమ్ముడైన కెనజు కుమారుడైన ఒత్నీయేలును నియమించారు, అతడు వారిని రక్షించాడు. 10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందుకు అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ యుద్ధానికి వెళ్లాడు. యెహోవా ఒత్నీయేలు చేతికి అరాము రాజైన కూషన్-రిషాతాయిమును అప్పగించారు, అతడు అతన్ని ఓడించాడు. 11 కాబట్టి కెనజు కుమారుడైన ఒత్నీయేలు చనిపోయే వరకు నలభై సంవత్సరాలు దేశం సమాధానంతో ఉంది.
ఏహూదు
12 ఇశ్రాయేలీయులు మరలా యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, వారు చెడు కార్యాలు చేసినందుకు యెహోవా మోయాబు రాజైన ఎగ్లోనుకు ఇశ్రాయేలుపై బలం ఇచ్చారు. 13 అతడు అమ్మోనీయులను అమాలేకీయులను పోగుచేసుకుని ఇశ్రాయేలీయులను ఓడించి ఖర్జూర చెట్ల పట్టణాన్నిఅంటే యెరికో స్వాధీనపరచుకున్నాడు. 14 ఇశ్రాయేలీయులు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజైన ఎగ్లోనుకు దాసులుగా ఉన్నారు.
15 మరలా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు, ఆయన బెన్యామీనీయుడైన గెరా కుమారుడు, ఎడమ చేతివాటం గలవాడైన ఏహూదును రక్షకునిగా వారి కోసం నియమించారు. అతన్ని ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు పన్నుచక్రవర్తికి తన క్రింద పని చేసే రాజు చెల్లించే వార్షిక పన్ను చెల్లించడానికి పంపారు. 16 ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల ఖడ్గాన్ని చేసికొని దానిని కుడి తొడకు కట్టుకుని తన బట్టలు క్రింద కప్పుకున్నాడు. 17 అతడు ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు చెల్లించాడు; ఎగ్లోను చాలా లావుపాటి మనిషి. 18 ఏహూదు కప్పము చెల్లించిన తర్వాత దానిని మోసిన మనుష్యులను పంపించేశాడు. 19 గిల్గాలు దగ్గరున్న రాతి ప్రతిమల దగ్గరకు వచ్చిన తర్వాత అతడు తిరిగి ఎగ్లోను దగ్గరకు వెళ్లి, “రాజా, మీకు ఒక రహస్య సందేశం చెప్పాలి” అని అన్నాడు.
రాజు తన సేవకులతో, “మమ్మల్ని విడిచి వెళ్లండి!” అని చెప్పాడు, వారందరు వెళ్లిపోయారు.
20 అతడు తన రాజభవనంలో§హెబ్రీ భాషలో ఈ పదానికి ఖచ్చితమైన అర్థం తెలియదు; 24 వచనంలో కూడా ఉంది మేడ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు ఏహూదు అతన్ని సమీపించి, “నా దగ్గర దేవుని నుండి మీకొక సందేశం ఉంది” అని అన్నాడు. రాజు తన సింహాసనం మీద నుండి లేస్తున్నప్పుడు, 21 ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ ఖడ్గాన్ని తీసి రాజు పొట్టలో పొడిచాడు. 22 ఖడ్గం పిడి కూడ పొట్టలోనికి వెళ్లింది. ఏహూదు ఖడ్గాన్ని బయటకు లాగలేదు, ఖడ్గం పైనుండి క్రొవ్వు చుట్టుకుంది. 23 అప్పుడు ఏహూదు వాకిలి వైపు వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపులు వేసి వాటికి తాళం వేశాడు.
24 అతడు వెళ్లిన తర్వాత సేవకులు వచ్చి మేడగది తలుపులకు తాళం వేసి ఉందని చూశారు. వారు, “చల్లని గదిలో మూత్ర విసర్జనకు వెళ్లాడేమో” అనుకున్నారు. 25 వారు విసుగు చెందేటంత వేచి చూశారు, కాని అతడు తలుపులు తెరవలేదు కాబట్టి వారు ఒక తాళపుచెవితో తాళం తీశారు. అక్కడ తమ ప్రభువు నేలపై పడి చనిపోయి ఉండడం చూశారు.
26 వారు వేచి ఉన్నప్పుడు ఏహూదు వెళ్లిపోయాడు. అతడు రాతి ప్రతిమలను దాటి శేయీరాకు పారిపోయాడు. 27 అక్కడికి చేరినప్పుడు, అతడు వచ్చి ఎఫ్రాయిం కొండ సీమలో బూరను ఊదాడు, అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో కొండల దిగువకు వెళ్లారు, అతడు వారి నాయకుడయ్యాడు.
28 “నన్ను వెంబడించండి, యెహోవా మీ శత్రువైన మోయాబును మీ చేతికి అప్పగించారు” అని అతడు ఆదేశించాడు. కాబట్టి వారతన్ని వెంబడించి, మోయాబు వైపు నడిపించే యొర్దాను రేవులను స్వాధీనపరచుకున్నారు; ఏ ఒక్కరినైన దాటి వెళ్లడానికి వారు అనుమతించలేదు. 29 ఆ సమయంలో వారు శూరులైన బలమైన పదివేలమంది మోయాబీయులను హతం చేశారు; ఏ ఒక్కరు తప్పించుకోలేదు. 30 ఆ రోజు మోయాబీయులను ఇశ్రాయేలీయులు పాలించారు, దేశము ఎనభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
షమ్గరు
31 ఏహూదు తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు వచ్చాడు, పశువులను తోలే ములుకోలుతో ఆరువందలమంది ఫిలిష్తీయులను హతం చేశాడు. అతడు కూడా ఇశ్రాయేలీయులను కాపాడాడు.

*3:8 అంటే, వాయువ్య మెసొపొటేమియా

3:13 అంటే యెరికో

3:15 చక్రవర్తికి తన క్రింద పని చేసే రాజు చెల్లించే వార్షిక పన్ను

§3:20 హెబ్రీ భాషలో ఈ పదానికి ఖచ్చితమైన అర్థం తెలియదు; 24 వచనంలో కూడా ఉంది