4
దెబోరా
1 ఏహూదు మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు. 2 కాబట్టి యెహోవా వారిని హాసోరులో పరిపాలించే కనాను రాజైన యాబీను చేతికి అప్పగించారు. అతని సేనాధిపతి హరోషెత్-హగ్గోయిములో నివసించిన సీసెరా. 3 అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి, అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించాడు, కాబట్టి వారు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నారు.
4 ఆ కాలంలో లప్పీదోతు భార్యయైన దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది. 5 ఆమె ఎఫ్రాయిం కొండ సీమలో రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా ఖర్జూర చెట్టు క్రింద తీర్పులు తీర్చడానికి కూర్చుండేది, ఇశ్రాయేలీయులు వారి వివాదాలు పరిష్కరించుకోడానికి ఆమె దగ్గరకు వచ్చేవారు. 6 ఆమె నఫ్తాలిలోని కెదెషు నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిపించి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నారు: ‘నీవు వెళ్లి నఫ్తాలి జెబూలూను గోత్రాల నుండి పదివేలమంది మనుష్యులను తాబోరు పర్వతం దగ్గరకు పిలిపించు. 7 యాబీను సేనాధిపతియైన సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నడిపించి నీ చేతికి అతన్ని అప్పగిస్తాను.’ ”
8 బారాకు ఆమెతో, “నీవు నాతో వస్తే నేను వెళ్తాను నీవు రాకపోతే వెళ్లను” అన్నాడు.
9 అప్పుడు దెబోరా, “నీతో నేను తప్పకుండా వస్తాను, అయితే నీ ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగిస్తారు” అని చెప్పి ఆమె బారాకుతో కలిసి కెదెషుకు వెళ్లింది. 10 బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది పురుషులు అతనితో వెళ్లారు. దెబోరా కూడా అతనితో వెళ్లింది.
11 కెనీయుడైన హెబెరు మోషే మామయైన*లేదా మోషే భార్య యొక్క సోదరుడు హోబాబు సంతతివారైన వారైన కెనీయులను విడిచిపెట్టి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములోని మస్తకిచెట్టు దగ్గర తన గుడారం వేసుకున్నాడు.
12 అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు పర్వతం మీదికి వెళ్లాడని సీసెరాకు చెప్పినప్పుడు, 13 సీసెరా హరోషెత్-హగ్గోయిము నుండి కీషోను వాగువరకు తన సైన్యమంతటిని, తన తొమ్మిది వందల ఇనుప రథాలను పిలిపించుకున్నాడు.
14 అప్పుడు దెబోరా బారాకుతో, “వెళ్లు! ఈ రోజు యెహోవా నీ చేతికి సీసెరాను అప్పగించారు. యెహోవా నీకు ముందుగా వెళ్లలేదా?” అని అడిగినప్పుడు బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం నుండి దిగి వెళ్లాడు. 15 బారాకు దాడి చేసినప్పుడు యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటిని, అతని సైన్యాన్ని ఖడ్గంతో హతం చేయగా సీసెరా తన రథాన్ని దిగి కాలినడకన పారిపోయాడు.
16 బారాకు ఆ రథాలను, సైన్యాన్ని హరోషెత్-హగ్గోయిము వరకు వెంటాడగా సీసెరా సైన్యమంతా ఖడ్గంతో చంపబడ్డారు; ఏ ఒక్కరు మిగల్లేదు. 17 హాసోరు రాజైన యాబీనుకు, కెనీయుడైన హెబెరు కుటుంబానికి మధ్య స్నేహబంధం ఉండేది కాబట్టి సీసెరా కాలినడకన కెనీయుడైన హెబెరు భార్యయైన యాయేలు గుడారానికి పారిపోయాడు.
18 యాయేలు సీసెరాను కలుసుకోడానికి బయటకు వెళ్లి, “నా ప్రభువా, లోనికి రండి. భయపడకండి” అని అన్నది. కాబట్టి అతడు గుడారంలోకి వెళ్లగా ఆమె దుప్పటితో అతన్ని కప్పింది.
19 “నాకు దాహంగా ఉంది, దయచేసి కొంచెం నీళ్లు ఇవ్వు” అని అతడు అన్నాడు. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతడు త్రాగడానికి ఇచ్చి అతన్ని తిరిగి కప్పింది.
20 అతడు ఆమెతో, “గుడార ద్వారం దగ్గర నిలబడు, ఎవరైనా వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.
21 అయితే హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు సుత్తిని తీసుకుని, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని దగ్గరకు నెమ్మదిగా వెళ్లింది. ఆమె ఆ మేకును అతని కణతలలో నుండి నేలలోకి దిగగొట్టగా అతడు చనిపోయాడు.
22 అప్పుడు బారాకు సీసెరాను తరుముతూ వెళ్తునప్పుడు యాయేలు అతన్ని ఎదుర్కొని, “రండి, మీరు వెదుకుతున్న మనిషిని నేను చూపిస్తాను” అని అన్నది. అతడు ఆమెతో లోనికి వచ్చినప్పుడు, అక్కడ సీసెరా కణతలలో మేకుతో చచ్చి పడి ఉన్నాడు.
23 ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును ఓడించారు. 24 ఇశ్రాయేలీయులు కనాను రాజైన యాబీనును సంపూర్ణంగా నాశనం చేసే వరకు వారి హస్తం అంతకంతకు కఠినం అయ్యింది.