5
దెబోరా గీతం 
  1 ఆ రోజు దెబోరా, అబీనోయము కుమారుడైన బారాకు ఈ పాట పాడారు:   
 2 ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు,  
ప్రజలు స్వచ్ఛందంగా అర్పించుకున్నప్పుడు,  
యెహోవాను స్తుతించండి!   
 3 రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి!  
నేను యెహోవాకు కీర్తన పాడతాను, నేను పాడతాను;  
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తనలో స్తుతిస్తాను.   
 4 యెహోవా, మీరు శేయీరు నుండి బయలుదేరినప్పుడు,  
మీరు ఎదోము ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు,  
భూమి కంపించింది, ఆకాశం కుమ్మరించింది,  
మేఘాలు నీళ్లు కుమ్మరించాయి.   
 5 అద్వితీయుడైన యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి,  
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుట సీనాయి కంపించింది.   
 6 అనాతు కుమారుడైన షమ్గరు రోజుల్లో,  
యాయేలు రోజుల్లో రాజమార్గాలు నిర్జనమయ్యాయి;  
ప్రయాణికులు ప్రక్క త్రోవల్లో నడిచారు.   
 7 ఇశ్రాయేలులో ఉన్న గ్రామస్థులు పోరాడలేరు;  
దెబోరా అనే నేను లేచేవరకు,  
ఇశ్రాయేలులో తల్లిగా నేను లేచేవరకు వారు వెనకడుగు వేశారు.   
 8 ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంచుకున్నారు,  
యుద్ధం పట్టణ ద్వారాల దగ్గరకు వచ్చింది,  
కాని నలభై వేలమంది ఇశ్రాయేలీయులలో  
ఒక డాలు గాని ఈటె గాని కనిపించలేదు.   
 9 నా హృదయం ఇశ్రాయేలు నాయకులతో,  
యుద్ధానికి స్వచ్ఛందంగా వచ్చిన వారితో ఉన్నది.  
యెహోవాను స్తుతించండి!   
 10 తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారలారా,  
తివాచీల మీద కూర్చునే వారలారా,  
త్రోవలో నడిచే వారలారా,  
ఇది గమనించండి!   11 పశువులు నీళ్లు త్రాగే చోట గాయకులు చేసే స్వరాన్ని వినండి.  
వారు యెహోవా నీతిక్రియల గురించి,  
ఇశ్రాయేలులో ఆయన యొక్క గ్రామస్థుల జయాల గురించి చెప్తున్నారు.  
“అప్పుడు యెహోవా ప్రజలు  
పట్టణ ద్వారాల దగ్గరకు వెళ్లారు.   
 12 ‘మేలుకో, మేలుకో, దెబోరా!  
మేలుకో, మేలుకో, కీర్తన పాడు!  
బారాకూ లే!  
అబీనోయము కుమారుడా, చెరపట్టిన వారిని చెరపట్టు.’   
 13 “ప్రాణాలతో మిగిలిన అధిపతులు వచ్చారు;  
శూరులకు వ్యతిరేకంగా యెహోవా ప్రజలు నా దగ్గరకు వచ్చారు.   
 14 కొందరు అమాలేకులో స్థిరపడినవారు ఎఫ్రాయిం నుండి వచ్చారు;  
నీ వెంట వచ్చిన వారిలో బెన్యామీను వారు ఉన్నారు.  
మాకీరు నుండి అధిపతులు వచ్చారు,  
జెబూలూను నుండి అధికారుల దండం మోసేవారు వచ్చారు.   
 15 ఇశ్శాఖారు అధిపతులు దెబోరాతో ఉన్నారు;  
ఇశ్శాఖారు మనుష్యులు బారాకుతో ఉన్నారు,  
అతని ఆదేశాన్ని బట్టి లోయలోనికి పంపబడ్డారు.  
రూబేను ప్రాంతాల్లో  
తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.   
 16 గొర్రెల మందల కోసం వేసే ఈలలు వినడానికి  
నీవెందుకు గొర్రెల దొడ్ల*లేదా చలిమంటలు లేదా జీను సంచులు మధ్య ఉన్నావు?  
రూబేను ప్రాంతాల్లో  
తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.   
 17 గిలాదువారు యొర్దాను అవతల నివసించారు.  
దానీయులు ఓడల దగ్గర ఎందుకు తిరుగుతున్నారు?  
ఆషేరీయులు సముద్రతీరాన  
తమ ఓడరేవుల్లో ఉన్నారు.   
 18 జెబూలూను ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టుకున్నారు;  
యుద్ధభూమిలో నఫ్తాలి ప్రజలు కూడా అలాగే చేశారు.   
 19 “రాజులు వచ్చారు, పోరాడారు,  
కనాను రాజులు పోరాడారు.  
మెగిద్దో జలాల దగ్గర ఉన్న తానాకులో  
వారు వెండిని దోచుకోలేదు.   
 20 నక్షత్రాలు ఆకాశం నుండి పోరాడాయి,  
తమ ఆకాశమార్గాల్లో నుండి సీసెరాతో విరుద్ధంగా పోరాడాయి.   
 21 కీషోను వాగు, పురాతన వాగు,  
కీషోను వాగు వారిని తుడిచి వేసింది.  
నా ప్రాణమా, బలం తెచ్చుకుని సాగిపో!   
 22 గుర్రాల డెక్కల శబ్దాలు దద్దరిల్లాయి,  
బలమైన గుర్రాలు వేగంగా దూసుకెళ్లాయి.   
 23 యెహోవా దూత, ‘మేరోసును శపించండి,  
దాని ప్రజలను తీవ్రంగా శపించండి.  
ఎందుకంటే యెహోవాకు సహాయంగా వారు రాలేదు,  
శక్తిగల శూరులకు విరుద్ధంగా యెహోవాకు సహాయంగా వారు రాలేదు’ అన్నారు.   
 24 “కెనీయుడైన హెబెరు భార్య యాయేలు,  
స్త్రీలలో ఎక్కువ దీవించబడుతుంది,  
గుడారాల్లో నివసించే స్త్రీలందరిలో ఎక్కువ దీవించబడుతుంది.   
 25 అతడు నీళ్లు అడిగాడు, ఆమె పాలు ఇచ్చింది;  
అధిపతుల పాత్రతో ఆమె అతనికి వెన్న తెచ్చి ఇచ్చింది.   
 26 ఆమె తన చేతితో గుడారపు మేకు కోసం చేయి చాచింది,  
పనివాని సుత్తి కోసం ఆమె కుడిచేయి చాచింది.  
ఆమె సీసెరాను కొట్టింది, ఆమె అతని తల చితక్కొట్టింది.  
ఆమె అతని తలను బద్దలు చేసింది.   
 27 ఆమె కాళ్ల దగ్గర అతడు కూలిపోయాడు,  
అతడు పడిపోయాడు; జీవం లేనట్లుగా పడి ఉన్నాడు,  
ఆమె కాళ్ల దగ్గర అతడు కూలిపోయాడు, అతడు పడిపోయాడు;  
అతడు కూలిపోయిన చోటులో పడి చనిపోయాడు.   
 28 “సీసెరా తల్లి కిటికీలో నుండి చూస్తూ ఉంది;  
అల్లిక కిటికీలో నుండి చూస్తూ ఏడుస్తుంది,  
‘అతని రథం తిరిగి రావడానికి ఎందుకు ఇంత సమయం పడుతోంది?  
అతని రథాల చప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది?’   
 29 ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన స్త్రీలు ఆమెకు జవాబిచ్చారు;  
నిజానికి, ఆమె తనకు తాను చెప్పుకుంటూనే ఉంటుంది.   
 30 ‘దోపుడుసొమ్ము వారికి దొరకలేదా, వారు పంచుకోలేదా:  
ప్రతి మనిషికి ఒకరు, లేదా ఇద్దరు స్త్రీలను తీసుకుంటారు,  
సీసెరాకు దోపుడు సొమ్ముగా రంగువేసిన వస్త్రాలు,  
కుట్టుపని చేసిన రంగుల వస్త్రాలు,  
వారి మెడలకు తగిన రెండు వైపులా రంగులు అద్దిన కుట్టుపని చేసిన వస్త్రాలు  
ఇదంతా దోపుడు సొమ్ముగా తీసుకోలేదా?’   
 31 “యెహోవా, మీ శత్రువులందరూ అలాగే నశించాలి!  
అయితే మిమ్మల్ని ప్రేమించే వారందరు  
తన బలంతో ఉదయించే సూర్యునిలా ఉండాలి.”  
తర్వాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.