21
యాజకులకు నియమాలు
1 యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు యాజకులతో అనగా అహరోను కుమారులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘యాజకుడు తన ప్రజల్లో ఎవరు చనిపోయినా వారిని తాకి తనను తాను అపవిత్రపరచుకోకూడదు. 2 తన రక్తసంబంధులైన తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సోదరుడు, 3 తన ఇంట్లో ఉంటున్న పెళ్ళికాని కన్య అయిన సోదరి చనిపోతే వారిని తాకి తన తాను అపవిత్రం చేసుకోవచ్చు. 4 యాజకుడు తన భార్య తరుపు బంధువుల కోసం తనను అపవిత్రపరచుకుని అప్రతిష్ఠపాలు కాకూడదు.
5 “ ‘యాజకులు తమ తల గుండు చేసుకోకూడదు, గడ్డం అంచులు కత్తిరించవద్దు; శరీరాన్ని గాయపరచవద్దు. 6 వారు తమ దేవునికి పరిశుద్ధులై ఉండాలి. వారు తమ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. వారు దేవుని ఆహారమైన హోమబలులను యెహోవాకు సమర్పిస్తారు కాబట్టి వారు పరిశుద్ధులై ఉండాలి.
7 “ ‘వారు వేశ్యను గాని చెడిపోయిన దాన్ని గాని పెళ్ళి చేసుకోవద్దు. భర్త విడాకులు ఇచ్చిన స్త్రీని పెళ్ళి చేసుకోవద్దు, ఎందుకంటే యాజకులు తమ దేవునికి పవిత్రులు. 8 మీ దేవునికి ఆహారం వారే అర్పిస్తారు కాబట్టి వారు పరిశుద్ధులు అని మీరు పరిగణించాలి. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసే నేను పరిశుద్ధుడైన యెహోవాను కాబట్టి వారిని పరిశుద్ధులుగా భావించాలి.
9 “ ‘యాజకుని కుమార్తె వేశ్యగా మారడం వల్ల తాను అపవిత్రమై తన తండ్రికి అపకీర్తి తెచ్చింది; కాబట్టి ఆమెను అగ్నితో కాల్చివేయాలి.
10 “ ‘ప్రధాన యాజకునిగా ఉండడానికి తన సహోదరులలో ఎవరి తలపై అభిషేకతైలం పోయబడి, యాజక వస్త్రాలను ధరించడానికి ఎవరు నియమించబడ్డారో వారు తన జుట్టును విరబోసుకోవద్దు,*లేదా తల మీది నుండి ముసుగు తీసివేయవద్దు బట్టలు చింపుకోకూడదు. 11 అతడు శవాల దగ్గరకి వెళ్లకూడదు. అతడు తన తండ్రి శవం వలన గాని తల్లి శవం వలన గాని తనను తాను అపవిత్రంగా చేసుకోకూడదు. 12 అతడు తన దేవుని అభిషేక తైలంతో ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి అతడు తన దేవుని పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టకూడదు, దానిని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను.
13 “ ‘అతడు కన్యను పెళ్ళి చేసుకోవాలి. 14 విధవరాలిని గాని, భర్త విడిచిపెట్టిన దాన్ని గాని, వేశ్యను గాని పెళ్ళి చేసుకోకూడదు, తన సొంత ప్రజల్లో నుండి కన్యను అతడు పెళ్ళి చేసుకోవాలి, 15 అతడు తన ప్రజల్లో తన సంతానాన్ని అపవిత్రం చేయకూడదు. అతన్ని పరిశుద్ధపరచే యెహోవాను నేను.’ ”
16 యెహోవా మోషేతో ఇలా అన్నారు, 17 “నీవు అహరోనుతో చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో లోపం ఉన్నవారెవరైనా తన దేవుని ఆహారాన్ని అర్పించడానికి దగ్గరకు రాకూడదు. 18 లోపం ఉన్నవారు అనగా గ్రుడ్డివారు గాని కుంటివారు గాని వికృతంగా ఉన్నవారు గాని లేదా అంగవైకల్యం గలవారు గాని; 19 కాలు లేక చేయి విరిగినవారు గాని 20 గూనివారు గాని మరుగుజ్జులు గాని కంటి లోపం ఉన్నవారు గాని గజ్జి ఉన్నవారు గాని చీము కారుతున్న పుండ్లతో ఉన్నవారు గాని వరిబీజములు పాడైనవారు గాని సమీపంగా రాకూడదు. 21 యాజకుడైన అహరోను వారసులలో లోపం ఉన్న ఏ ఒక్కరు యెహోవాకు హోమబలులు అర్పించడానికి దగ్గరకు రాకూడదు. అతనికి లోపం ఉంది; అతడు తన దేవుని ఆహారాన్ని అర్పించడానికి దగ్గరకు రాకూడదు. 22 అతడు తన దేవునికి అర్పించే అతి పవిత్రమైన ఆహారాన్ని గాని పవిత్రమైన ఆహారాన్ని తినవచ్చు; 23 అయినాసరే అతనికున్న లోపం కారణంగా అతడు తెర దగ్గరకు వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు వెళ్లకూడదు, నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేయకూడదు. వారిని పరిశుద్ధులుగా చేసే యెహోవాను నేనే.’ ”
24 మోషే అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయులందరికి ఈ విషయాలు చెప్పాడు.