22
1 యెహోవా మోషేతో అన్నారు, 2 “ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే పవిత్రమైన అర్పణలను గౌరవించుమని అహరోనుతో అతని కుమారులతో చెప్పు, తద్వార వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయకుండ ఉంటారు. నేను యెహోవాను.
3 “వారితో ఇలా చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో ఎవరైనా ఆచారరీత్య అపవిత్రులై ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్ర అర్పణల దగ్గరకు వస్తే, వారు నా సన్నిధిలో నుండి తొలగించబడాలి. నేను యెహోవాను.
4 “ ‘అహరోను సంతతిలో ఎవరికైనా కుష్ఠువ్యాధి గాని, స్రావ రోగం గాని ఉంటే వారు పవిత్రమయ్యేవరకు పవిత్ర పదార్థాలను తినకూడదు. వారు శవాన్ని గాని అపవిత్రమైన దేనినైనా గాని తాకినా లేదా వీర్యం విసర్జనతో ఉన్న ఎవరినైన తాకినా, వారు అపవిత్రం అవుతారు, 5 అపవిత్రమైన ప్రాకే పురుగును తాకినా, లేదా ఆచారరీత్య అపవిత్రంగా ఉన్న మనుష్యుని తాకినవారు అపవిత్రం అవుతారు. 6 అలాంటి వాటిలో దేనినైన తాకితే, వారు సాయంత్రం వరకు అపవిత్రంగానే ఉంటారు. వారు నీటితో స్నానం చేసే వరకు పవిత్రమైన అర్పణల నుండి దేన్ని తినకూడదు. 7 సూర్యుడు అస్తమించినప్పుడు వారు పవిత్రం అవుతారు, తర్వాత వారు పవిత్ర అర్పణలు తినవచ్చు, ఎందుకంటే అది వారి ఆహారము. 8 వారు చచ్చినదానిని గాని అడవి జంతువులు చీల్చిన దానిని గాని తిని అపవిత్రం కాకూడదు. నేను యెహోవాను.
9 “ ‘యాజకులు నాకు పరిచర్య చేసినప్పుడు వారికి ఇవ్వబడిన ఆదేశాలను ఉల్లంఘించి దానిని అపవిత్రపరిస్తే దాని పాపదోషం తమ మీదకు చావు తెచ్చుకుంటే దానికి వారే బాధ్యులు. వారిని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.
10 “ ‘పరిశుద్ధ అర్పణను యాజక కుటుంబ సభ్యులు తప్ప బయటి వారెవరూ అంటే యాజకుని అతిథి గాని అతని ఇంట్లో జీతగాడు గాని తినకూడదు. 11 అయితే ఒకవేళ యాజకుడు డబ్బుతో బానిసను కొనుగోలు చేస్తే, లేదా బానిసలు అతని కుటుంబంలో జన్మించి ఉంటే, వారు అతని ఆహారాన్ని తినవచ్చు. 12 ఒక యాజకుని కుమార్తె యాజకుని కాకుండ వేరేవాన్ని పెళ్ళి చేసుకుంటే, ఆమె పవిత్రమైన దానాలు దేన్ని తినకూడదు. 13 ఒక యాజకుని కుమార్తె విధవరాలు అయితే లేదా విడాకులు తీసుకుంటే, ఇంకా పిల్లలు లేకుండా ఆమె యవ్వనురాలై తన తండ్రి ఇంట్లో నివసించడానికి తిరిగి వస్తే, ఆమె తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు గాని ఏ అనధికార వ్యక్తి దానిని తినకూడదు.
14 “ ‘ఎవరైనా పొరపాటున పరిశుద్ధ ఆహారం తింటే దానికి వెలకట్టి దాని వెలలో అయిదవ వంతు కలిపి యాజకునికి ఇవ్వాలి. 15 యాజకులు ఇశ్రాయేలీయులు యెహోవాకు సమర్పించే పవిత్రమైన అర్పణలను యాజకులు అపవిత్రం చేయకూడదు. 16 వారి మీదికి అపరాధపరిహార రుసుము చెల్లించుకునేలా చేయకూడదు. వారిని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.’ ”
అంగీకరించబడని బలులు
17 యెహోవా మోషేతో ఇలా అన్నారు, 18 “అహరోనుతో అతని కుమారులతో, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీలో ఇశ్రాయేలీయుడైనా, ఇశ్రాయేలులో నివసించే పరదేశియైనా యెహోవాకు దహనబలిగా మ్రొక్కుబడిని గాని స్వేచ్ఛార్పణ గాని అర్పిస్తే, 19 ఆ అర్పణ అంగీకరించబడేలా పశువుల మందలో నుండి గాని గొర్రె మేకల మందలో నుండి గాని లోపం లేని మగదాన్ని అర్పించాలి. 20 లోపం ఉన్నదానిని తీసుకురాకండి ఎందుకంటే అది మీ పక్షాన అంగీకరించబడదు. 21 ప్రత్యేక మ్రొక్కుబడి లేదా స్వేచ్ఛార్పణ కోసం ఎవరైనా పశువుల మందలో నుండి గాని లేదా గొర్రెల మందలో నుండి గాని యెహోవాకు సమాధానబలి తెస్తే, అది అంగీకరించబడేలా ఏ లోపం లేనిదై ఉండాలి. 22 యెహోవాకు గ్రుడ్డి దానిని గాని, గాయపడిన దానిని గాని లేదా అంగవైకల్యం ఉన్నదానిని గాని, చీముపట్టిన పుండ్లతో ఉన్నదానిని గాని అర్పించకూడదు. యెహోవాకు హోమబలిగా వీటిలో దేన్ని బలిపీఠం మీద ఉంచవద్దు. 23 అయితే మీరు ఒక అంగవైకల్యంతో ఉన్న ఎద్దును గాని లేదా గొర్రెలను గాని స్వేచ్ఛార్పణగా సమర్పించవచ్చు, కాని ఒక మ్రొక్కుబడి చెల్లించడానికైతే ఇది అంగీకరించబడదు. 24 వృషణాలు నలిపివేయబడిన, గాయపడిన, చీల్చివేయబడిన లేదా కత్తిరించబడిన జంతువును మీరు యెహోవాకు అర్పించకూడదు. మీరు మీ స్వదేశంలో ఇలా చేయకూడదు. 25 మీరు అలాంటి జంతువులను విదేశీయుని చేతిలో నుండి స్వీకరించి, వాటిని మీ దేవునికి ఆహారంగా అర్పించకూడదు. అవి అంగవైకల్యం, లోపాలు కలిగి ఉన్నాయి కాబట్టి మీ పక్షాన అవి అంగీకరించబడవు.’ ”
26 యెహోవా మోషేతో ఇలా అన్నారు, 27 “ఒక దూడ గాని గొర్రెపిల్ల గాని లేదా మేకపిల్ల పుట్టినప్పుడు, అది ఏడు రోజులు తన తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు నుండి, అది యెహోవాకు సమర్పించబడిన హోమబలిగా అంగీకరించబడుతుంది. 28 ఒకే రోజు ఒక ఆవు లేదా గొర్రెలను, వాటి పిల్లలను మీరు వధించవద్దు.
29 “మీరు యెహోవాకు కృతజ్ఞతార్పణ అర్పించినప్పుడు, అది మీ పక్షంగా అంగీకరించబడే విధంగా అర్పించాలి. 30 అదే రోజు తప్పక దానిని తినాలి; ఉదయం వరకు ఏదీ మిగుల్చవద్దు. నేను యెహోవాను.
31 “నా ఆజ్ఞలు పాటించి వాటిని అనుసరించాలి. నేను యెహోవాను. 32 నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయవద్దు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల ద్వార పరిశుద్ధునిగా గుర్తించబడాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచిన యెహోవాను, 33 మీకు దేవునిగా ఉండడానికి నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన వాడను. నేను యెహోవాను.”