7
ఇశ్రాయేలు దుస్థితి 
  1 ఏంటి నా దుస్థితి!  
నా పరిస్థితి వేసవికాలపు పండ్లు ఏరుకునే వానిలా  
ద్రాక్షతోట పరిగె సేకరించేవానిలా ఉంది;  
తినడానికి ద్రాక్షపండ్ల గెల లేదు,  
నేను ఆశించే క్రొత్త అంజూరపు పండ్లు లేవు.   
 2 నమ్మకమైనవారు దేశంలో లేకుండా పోయారు;  
యథార్థవంతుడు ఒక్కడూ లేడు.  
అందరు రక్తం చిందించడానికి పొంచి ఉన్నారు;  
వారు ఒకరిని ఒకరు వలలతో వేటాడతారు.   
 3 వారి రెండు చేతులు కీడు చేస్తాయి;  
పాలకులు బహుమతులు కోరతారు,  
న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకుంటారు,  
గొప్పవారు తమ కోరికను తెలియజేస్తారు.  
వారంతా కలిసి కుట్ర చేస్తారు.   
 4 వారిలో మంచి వారు ముళ్ళపొద వంటివారు,  
వారిలో అత్యంత యథార్థవంతులు ముండ్లకంచె కంటే ఘోరము.  
దేవుడు మిమ్మల్ని దర్శించే రోజు,  
మీ కాపరులు*ఇది ప్రవక్తలను సూచిస్తుంది హెచ్చరించే రోజు వచ్చింది.  
ఇప్పుడే మీరు కలవరపడే సమయము.   
 5 పొరుగువారిని నమ్మకండి;  
స్నేహితుని మీద నమ్మకం పెట్టుకోకండి.  
మీ కౌగిటిలో ఉండే స్త్రీ దగ్గర కూడా  
మీ పెదవుల నుండి వచ్చే మాటలను కాచుకోండి.   
 6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేస్తాడు,  
తల్లి మీదికి కుమార్తె,  
అత్త మీదికి తన కోడలు తిరగబడతారు,  
సొంత ఇంటివారే వారికి శత్రువులవుతారు.   
 7 నేనైతే యెహోవా వైపు నిరీక్షణతో చూస్తాను,  
నా రక్షకుడైన దేవుని కోసం వేచి ఉంటాను;  
నా దేవుడు నా ప్రార్ధన వింటారు.   
ఇశ్రాయేలు తిరిగి లేస్తుంది 
  8 నా విరోధీ, నా మీద అతిశయించకు,  
నేను పడిపోయినా తిరిగి లేస్తాను.  
నేను చీకటిలో కూర్చున్నా,  
యెహోవా నాకు వెలుగై ఉంటారు.   
 9 నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను కాబట్టి,  
ఆయన నాకు న్యాయం తీర్చేవరకు  
ఆయన నా పక్షాన ఉండే వరకు  
నేను ఆయన కోపాగ్నిని భరిస్తాను.  
ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తారు,  
నేను ఆయన నీతిని చూస్తాను.   
 10 అప్పుడు నా శత్రువు దాన్ని చూసి,  
ఇలా జరగడం చూసి సిగ్గుపడుతుంది.  
“నీ దేవుడైన యెహోవా ఎక్కడ?”  
అని నాతో అన్న ఆమె  
నా కళ్లు ఆమె పతనం చూస్తాయి;  
ఇప్పుడు కూడా ఆమె వీధిలోని బురదలా  
కాళ్లక్రింద త్రొక్కబడుతుంది.   
 11 మీ గోడలు కట్టే రోజు వస్తుంది  
మీ సరిహద్దులు విశాలపరిచే రోజు వస్తుంది.   
 12 ఆ రోజు ప్రజలు అష్షూరు నుండి  
ఈజిప్టు పట్టణాల నుండి మీ దగ్గరకు వస్తారు,  
ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీసు వరకు,  
సముద్రం నుండి సముద్రం వరకు  
పర్వతం నుండి పర్వతం వరకు ఉన్న ప్రజలు వస్తారు.   
 13 భూనివాసులు చేసిన క్రియలకు ఫలితంగా  
దేశం పాడవుతుంది.   
ప్రార్ధన స్తుతి 
  14 మీ చేతికర్రతో మీ ప్రజలను కాయండి,  
వారు మీ వారసత్వపు మంద,  
వారు అడవిలో ఒంటరిగా,  
సారవంతమైన పచ్చికబయళ్లలో†లేదా కర్మెలు మధ్య ప్రాంతం నివసిస్తున్నారు.  
పూర్వకాలంలో మేసినట్లు  
వారిని బాషాను, గిలాదులో మేస్తారు.   
 15 “మీరు ఈజిప్టు నుండి వచ్చిన రోజుల్లో చేసినట్లు,  
నేను నా అద్భుతాలు వారికి చూపిస్తాను.”   
 16 దేశాల ప్రజలు అది చూసి  
తమ శక్తి కోల్పోయి సిగ్గుపడతారు.  
వారు తమ చేతులతో నోరు మూసుకుంటారు,  
వారి చెవులకు చెవుడు వస్తుంది.   
 17 పాములా, నేల మీద ప్రాకే పురుగులా,  
వారు ధూళిని నాకుతారు.  
వారు తమ గుహల్లో నుండి వణకుతూ బయటకు వస్తారు;  
వారు భయంతో మన దేవుడైన యెహోవా వైపు తిరుగుతారు,  
నిన్ను బట్టి భయపడతారు.   
 18 మీలాంటి దేవుడెవరు?  
మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి  
పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు,  
మీరు నిత్యం కోపంతో ఉండరు  
కాని దయ చూపడంలో ఆనందిస్తారు.   
 19 మీరు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తారు;  
మీరు మా పాపాలను అణగద్రొక్కుతారు,  
మా అతిక్రమాలన్నిటిని సముద్రంలో లోతుల్లో పడవేస్తారు.   
 20 మీరు పూర్వకాలంలో మా పూర్వికులకు  
ప్రమాణం చేసిన విధంగా  
యాకోబు పట్ల నమ్మకత్వాన్ని,  
అబ్రాహాము పట్ల మారని ప్రేమ చూపుతారు.