నహూము
ప్రవచనం
1
నీనెవెను గురించిన ప్రవచనం; ఎల్కోషీయుడైన నహూముకు ఇవ్వబడిన దర్శనాన్ని వివరించే గ్రంథమిది.
 
నీనెవెకు వ్యతిరేకంగా యెహోవా కోపం
యెహోవా రోషం గలవారు ప్రతీకారం తీర్చుకునే దేవుడు;
యెహోవా పగ తీర్చుకునేవారు ఉగ్రత గలవారు.
యెహోవా తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు,
తన శత్రువులపై తన ఉగ్రతను వెళ్లగ్రక్కుతారు.
యెహోవా త్వరగా కోప్పడరు, ఆయన గొప్ప శక్తిగలవారు;
యెహోవా దోషులను శిక్షించకుండ విడిచిపెట్టరు.
ఆయన మార్గం సుడిగాలిలోనూ తుఫానులోనూ ఉంది,
మేఘాలు ఆయన పాద ధూళి.
ఆయన సముద్రాన్ని గద్దించి దానిని ఆరిపోయేలా చేస్తారు;
నదులన్నిటినీ ఆయన ఎండిపోయేలా చేస్తారు.
బాషాను కర్మెలు ఎండిపోతాయి,
లెబానోను పువ్వులు వాడిపోతాయి.
ఆయన ముందు పర్వతాలు కంపిస్తాయి,
కొండలు కరిగిపోతాయి.
ఆయన సన్నిధిలో భూమి వణుకుతుంది,
లోకం, దానిలో నివసించే వారందరూ వణుకుతారు.
ఆయన ఆగ్రహాన్ని ఎవరు తట్టుకోగలరు?
ఆయన కోపాగ్నిని ఎవరు సహించగలరు?
ఆయన ఉగ్రత అగ్నిలా బయటకు కుమ్మరించబడింది;
ఆయన ముందు బండలు బద్దలయ్యాయి.
 
యెహోవా మంచివారు,
ఆపద సమయాల్లో ఆశ్రయం ఇస్తారు.
ఆయన మీద నమ్మకముంచే వారిపట్ల ఆయన శ్రద్ధ చూపుతారు.
అయితే పొంగిపొరలే వరదతో
నీనెవెను అంతం చేస్తారు;
ఆయన తన శత్రువులను చీకటిలోకి తరుముతారు.
 
వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పన్నాగం పన్నినా,
ఆపద రెండవసారి రాకుండ,
ఆయన దానిని అంతం చేస్తారు.
10 వారు ముళ్ళపొదల్లో చిక్కుకొని
తమ ద్రాక్షరసంతో మత్తులై
ఎండిన చెత్తలా కాలిపోతారు.
11 నీనెవే, నీ నుండి
యెహోవాకు వ్యతిరేకంగా చెడు పన్నాగాలు పన్నేవాడు,
దుష్ట ప్రణాళికలు వేసే ఒకడు వచ్చాడు.
12 యెహోవా ఇలా చెప్తున్నారు:
“వారికి ఎంతోమంది మిత్రులు ఉన్నప్పటికీ,
వారు నాశనమై గతించిపోతారు.
యూదా, నేను నిన్ను బాధించాను,
ఇక నేను నిన్ను బాధించను.
13 నీ మెడ మీద ఉన్న వారి కాడిని నేను విరగ్గొట్టి,
నీ సంకెళ్ళను తెంపివేస్తాను.”
 
14 నీనెవే, నీ గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు:
“నీ పేరు పెట్టుకునే సంతతివారు ఎవరూ ఉండరు.
నీ దేవతల గుడిలో ఉన్న
ప్రతిమలను, విగ్రహాలను నాశనం చేస్తాను.
నీవు నీచుడవు,
కాబట్టి, నీ సమాధిని సిద్ధం చేస్తాను.”
 
15 చూడు, అక్కడ పర్వతాలమీద,
సువార్తను ప్రకటించేవారి పాదాలు,
వారు సమాధానాన్ని ప్రకటించేవారు!
యూదా, నీ పండుగలు జరుపుకో,
నీ మ్రొక్కుబడులను నెరవేర్చుకో.
ఇకపై దుష్టులు నీపై దండెత్తరు;
వారు పూర్తిగా నాశనం చేయబడతారు.