32
యొర్దానుకు తూర్పున ఉన్న గోత్రాలు
1 చాలా ఎక్కువ పశువుల మందలు కలిగిన రూబేనీయులు, గాదీయులు తమ పశువులకు యాజెరు, గిలాదు ప్రాంతాలు తగిన స్థలాలని చూశారు. 2 కాబట్టి వారు మోషే, యాజకుడైన ఎలియాజరు, సమాజ నాయకుల దగ్గరకు వచ్చి, 3 “అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఎల్యాలెహు, షెబాము, నెబో, బెయోను ప్రాంతాలు, 4 ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన స్థలం పశువులకు తగిన స్థలాలు, మీ సేవకులమైన మాకు పశువులు ఉన్నాయి. 5 మీరు మా పట్ల దయ చూపిస్తే ఈ స్థలం మీ సేవకులమైన మాకు స్వాస్థ్యంగా ఇవ్వండి. మమ్మల్ని యొర్దాను అవతలికి దాటించకండి” అని అన్నారు.
6 మోషే రూబేనీయులతో, గాదీయులతో, “మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ తోటి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగాడు. 7 “యెహోవా ఇచ్చిన దేశానికి ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను ఎందుకు నిరాశపరుస్తారు? 8 మీ తండ్రులను కాదేషు బర్నియాకు స్థలాన్ని చూసి రమ్మని పంపితే వారు ఇలాగే చేశారు. 9 వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి తిరిగివచ్చి, యెహోవా వారికిచ్చిన వాగ్దాన భూమికి ప్రవేశించకుండా ఇశ్రాయేలీయులను నిరాశ పరిచారు. 10 ఆ రోజు యెహోవా కోపం వారిపై రగులుకొని, ఆయన ఇలా ప్రమాణం చేశారు: 11 ‘వారు హృదయమంతటితో నన్ను వెంబడించలేదు కాబట్టి, ఈజిప్టు నుండి వచ్చిన వారిలో ఇరవై సంవత్సరాలు ఆ పైబడి వయస్సు ఉన్నవారు ఎవ్వరూ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఈ దేశాన్ని చూడరు. 12 కెనిజ్జీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ మాత్రమే వెళ్తారు, ఎందుకంటే వీరు యెహోవాను హృదయమంతటితో వెంబడించారు.’ 13 యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకుంది. ఆయన వారు అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరిగేలా చేశారు, ఆయన దృష్టి నుండి చెడు చేసిన వారందరు చనిపోయే వరకు అలా చేశారు.
14 “ఇక్కడ మీరు, పాపుల సంతానం, మీ తండ్రుల స్థానంలో నిలబడి, యెహోవాకు ఇశ్రాయేలుపై మరింత కోపం తెప్పిస్తున్నారు. 15 మీరు ఆయనను వెంబడించకుండా తప్పుకుంటే, ఆయన మరలా ప్రజలందరినీ అరణ్యంలో వదిలేస్తారు వారి నాశనానికి మీరే కారణం అవుతారు.”
16 వారు అతని దగ్గరకు వచ్చి, “మేము ఇక్కడ మందలకు కావలసిన దొడ్లు మా స్త్రీలు, పిల్లలకు పట్టణాలు కట్టుకుంటాము. 17 కానీ మేము యుద్ధానికి మమ్మల్ని మేము సిద్ధంగా ఉంచుకుని ఇశ్రాయేలీయులకు ముందుగా వెళ్తూ వారు వారి స్థలాలకు చేరేవరకు ఉంటాము. ఆ సమయంలో మా స్త్రీలు, పిల్లలు కోటగోడలు గల పట్టణాల్లో ఉంటూ, ప్రాంత నివాసులకు కాపుదలగా ఉంటారు. 18 ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు తమ వారసత్వం స్వాధీనం చేసుకునేవరకు మా గృహాలకు వెళ్లము. 19 యొర్దానుకు అవతల వారసత్వం పొందుకోము ఎందుకంటే మా వారసత్వం యొర్దాను తూర్పు ప్రదేశంలో ఉంది.”
20 అప్పుడు మోషే వారితో, “మీరు ఇలా చేస్తే అంటే మీరు యుద్ధం కోసం యెహోవా ఎదుట సిద్ధంగా ఉంటే, 21 ఆయుధాలు ధరించిన మీరందరూ యొర్దాను దాటి యెహోవా తన శత్రువులను తన ఎదుట నుండి తరిమికొట్టే వరకు యొర్దానును దాటితే, 22 దేశం యెహోవా ఎదుట వశపరచబడినప్పుడు, మీరు తిరిగివచ్చి యెహోవాకు, ఇశ్రాయేలుకు మీ బాధ్యత నుండి విముక్తి పొందవచ్చు. ఈ దేశం యెహోవా ఎదుట మీకు స్వాస్థ్యంగా ఉంటుంది.
23 “కానీ మీరు ఇలా చేయకపోతే, యెహోవాకు విరోధంగా పాపం చేసినవారవుతారు; మీ పాపం మిమ్మల్ని వెంటాడుతుందని ఖచ్చితంగా నమ్మవచ్చు. 24 ఇప్పుడు మీ స్త్రీల కోసం, పిల్లల కోసం పట్టణాలు, మీ మందల దొడ్లు నిర్మించుకోండి, కానీ మీరు చెప్పినదంతా చేయండి.”
25 గాదీయులు, రూబేనీయులు మోషేతో ఇలా అన్నారు, “మీ సేవకులైన మేము మా ప్రభువా ఆజ్ఞాపించినట్లే చేస్తాము. 26 మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, పశువులు ఇక్కడే గిలాదు పట్టణాల్లో ఉంటారు. 27 అయితే, యుద్ధానికి సిద్ధపడిన మీ సేవకుల మందరం మా ప్రభువా చెప్పినట్లు, యెహోవా ఎదుట యుద్ధానికి యొర్దానును దాటుతాము.”
28 అప్పుడు మోషే వారి గురించి యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలీయుల గోత్రాల కుటుంబ పెద్దలకు ఆదేశించాడు. 29 మోషే వారితో అన్నాడు, “గాదీయులు, రూబేనీయులు, వీరిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు యెహోవా ఎదుట మీతో యొర్దానును దాటుతారు, అప్పుడు ఆ స్థలాన్ని జయించినప్పుడు, మీరు గిలాదు భూమిని వారికి స్వాస్థ్యంగా ఇవ్వాలి. 30 కానీ వారు ఒకవేళ ఆయుధాలు ధరించి మీతో దాటకపోతే, వారు కనానులో మీ దగ్గర తమ స్వాస్థ్యాన్ని అంగీకరించాలి.”
31 గాదీయులు, రూబేనీయులు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా చెప్పినది మీ సేవకులమైన మేము చేస్తాము. 32 ఆయుధాలు ధరించి యెహోవా ఎదుట కనాను లోనికి వెళ్తాము, కానీ మేము వారసత్వంగా సంపాదించుకునే స్వాస్థ్యం యొర్దానుకు ఇటువైపు ఉంటుంది.”
33 అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రానికి అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని దాని పట్టణాలు, వాటి సరిహద్దులతో సహా ఆ స్థలాన్నంతటిని ఇచ్చాడు.
34 గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, 35 అత్రోత్-షోఫాను, యాజెరు, యొగ్బెహ, 36 బేత్-నిమ్రా, బేత్-హారాను, అనే పట్టణాలను కోటగోడలతో నిర్మించారు, మందలకు దొడ్లు కూడా కట్టుకున్నారు. 37 రూబేనీయులు నిర్మించిన పట్టణాలు హెష్బోను, ఎల్యాలెహు, కిర్యతాయిము, 38 అలాగే నెబో, బయల్-మెయోను (ఈ పేర్లు మార్చబడ్డాయి) షిబ్మా అనే పట్టణాలను నిర్మించుకున్నారు. వారు తిరిగి కట్టుకున్న పట్టణాలకు వారు పేర్లు పెట్టుకున్నారు.
39 మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులు గిలాదుకు వెళ్లి, దాన్ని జయించి, అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు. 40 కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు. 41 మనష్షే వంశస్థుడైన యాయీరు వారి స్థావరాలను స్వాధీనం చేసుకుని వాటికి హవ్వోత్ యాయీరు*లేదా యాయీరు స్థావరాలు అని పేరు పెట్టాడు. 42 నోబహు అనేవాడు వెళ్లి కెనాతు దాని స్థావరాలను జయించి ఆ ప్రాంతానికి నోబహు అని తన పేరు పెట్టుకున్నాడు.