33
ఇశ్రాయేలు ప్రయాణ దశలు 
  1 ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల నాయకత్వంలో సేనలుగా ఏర్పడి ఈజిప్టు నుండి బయలుదేరి చేసిన ప్రయాణాలు.   2 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారి ప్రయాణాల దశలను నమోదు చేశాడు. ఇవి వారి ప్రయాణాల దశలు:   
 3-4 ఇశ్రాయేలీయులు మొదటి నెల పదిహేనవ రోజు అంటే పస్కా తర్వాత రోజున, రామెసేసు నుండి ప్రయాణమయ్యారు. యెహోవా హతం చేసిన తమ జ్యేష్ఠులందరిని ఈజిప్టువారు సమాధి చేస్తూ ఉన్నప్పుడు, వారు చూస్తూ ఉండగా జయోత్సాహంతో బయలుదేరారు; ఎందుకంటే యెహోవా వారి దేవుళ్ళ మీద తీర్పు తీర్చారు.   
 5 ఇశ్రాయేలీయులు రామెసేసును వదిలి సుక్కోతు దగ్గర దిగారు.   
 6 వారు సుక్కోతును నుండి బయలుదేరి ఎడారి అంచున ఉన్న ఏతాముకు వచ్చారు.   
 7 వారు ఏతాము నుండి వెనుకకు తిరిగి బయల్-సెఫోను ఎదురుగా పీ హహీరోతు వైపుకు వెళ్లి మిగ్దోలు ఎదుట దిగారు.   
 8 పీ హహీరోతు నుండి బయలుదేరి సముద్రం గుండా దాటుతూ ఎడారిలోకి చేరారు, వారు మూడు రోజులు ఏతాము ఎడారిలో ప్రయాణం చేసి మారాలో దిగారు.   
 9 మారా నుండి బయలుదేరి ఎలీముకు వెళ్లారు, ఎలీములో పన్నెండు నీటి ఊటలు, డెబ్బయి ఈతచెట్లు ఉన్నాయి, వారక్కడ ఉన్నారు.   
 10 ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు.   
 11 ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారికి వచ్చారు.   
 12 సీను ఎడారి నుండి బయలుదేరి దోపకాకు వచ్చారు.   
 13 దోపకా నుండి బయలుదేరి ఆలూషుకు వచ్చారు.   
 14 ఆలూషు నుండి బయలుదేరి రెఫీదీముకు వచ్చారు. అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు.   
 15 రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చారు.   
 16 సీనాయి ఎడారి నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.   
 17 కిబ్రోతు హత్తావా నుండి బయలుదేరి హజేరోతుకు వచ్చారు.   
 18 హజేరోతు నుండి బయలుదేరి రిత్మాకు వచ్చారు.   
 19 రిత్మా నుండి బయలుదేరి రిమ్మోను పెరెజుకు వచ్చారు.   
 20 రిమ్మోను పెరెజు నుండి బయలుదేరి లిబ్నాకు వచ్చారు.   
 21 లిబ్నా నుండి బయలుదేరి రీసాకు వచ్చారు.   
 22 రీసా నుండి బయలుదేరి కేహేలాతాకు వచ్చారు.   
 23 కేహేలాతా నుండి బయలుదేరి షాపెరు పర్వతముకు వచ్చారు.   
 24 షాపెరు పర్వతము నుండి బయలుదేరి హరాదాకు వచ్చారు.   
 25 హరాదా నుండి బయలుదేరి మకెలోతుకు వచ్చారు.   
 26 మకెలోతు నుండి బయలుదేరి తాహతుకు వచ్చారు.   
 27 తాహతు నుండి బయలుదేరి తారహుకు వచ్చారు.   
 28 తారహు నుండి బయలుదేరి మిత్కాకు వచ్చారు.   
 29 మిత్కా నుండి బయలుదేరి హష్మోనాకు వచ్చారు.   
 30 హష్మోనా నుండి బయలుదేరి మొసేరోతుకు వచ్చారు.   
 31 మొసేరోతు నుండి బయలుదేరి బెనె యహకానుకు వచ్చారు.   
 32 బెనె యహకాను నుండి బయలుదేరి హోర్-హగ్గిద్గాదుకు వచ్చారు.   
 33 హోర్-హగ్గిద్గాదు నుండి బయలుదేరి యొత్బాతాకు వచ్చారు.   
 34 యొత్బాతా నుండి బయలుదేరి ఎబ్రోనాకు వచ్చారు.   
 35 ఎబ్రోనా నుండి బయలుదేరి ఎసోన్-గెబెరుకు వచ్చారు.   
 36 ఎసోన్-గెబెరు నుండి బయలుదేరి సీను ఎడారిలో ఉన్న కాదేషుకు వచ్చారు.   
 37 కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు.   38 యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడైన అహరోను హోరు పర్వతం మీద చనిపోయాడు, ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన నలభైయవ సంవత్సరం, అయిదవ నెల, మొదటి రోజున అతడు చనిపోయాడు.   39 హోరు పర్వతం మీద అహరోను చనిపోయినప్పుడు అతని వయస్సు నూట యిరవై మూడు సంవత్సరాలు.   
 40 కనాను దక్షిణ దిక్కున కనానీయుడైన అరాదు పట్టణ రాజు ఇశ్రాయేలీయులు వస్తున్నారని విన్నాడు.   
 41 వారు హోరు పర్వతం నుండి బయలుదేరి సల్మానాకు వచ్చారు.   
 42 సల్మానా నుండి బయలుదేరి పూనొనుకు వచ్చారు.   
 43 పూనొను నుండి బయలుదేరి ఓబోతుకు వచ్చారు.   
 44 ఓబోతు నుండి బయలుదేరి మోయాబు సరిహద్దులో ఉన్న ఈయ్యె-అబారీముకు వచ్చారు.   
 45 ఈయ్యె-అబారీము నుండి బయలుదేరి దీబోనుగాదుకు వచ్చారు.   
 46 దీబోనుగాదు నుండి బయలుదేరి అల్మోన్-దిబ్లాతయీముకు వచ్చారు.   
 47 అల్మోన్-దిబ్లాతయీము నుండి బయలుదేరి నెబో ఎదుట ఉన్న అబారీము పర్వతాల దగ్గర దిగారు.   
 48 అబారీము పర్వతాల నుండి బయలుదేరి యెరికోకు దగ్గర యొర్దాను అవతలి వైపున మోయాబు సమతల మైదానాల్లో దిగారు.   49 మోయాబు సమతల మైదానంలో బేత్-యెషిమోతు మొదలుకొని ఆబేల్-షిత్తీము వరకు యొర్దాను దగ్గర దిగారు.   
 50 యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు సమతల మైదానంలో యెహోవా మోషేతో ఇలా మాట్లాడారు,   51 “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు యొర్దాను దాటి కనానుకు వెళ్లినప్పుడు,   52 ఆ దేశవాసులందర్నీ తరిమేయాలి. వారి రాతి విగ్రహాలను, కోట విగ్రహాలను నాశనం చేయాలి వారి క్షేత్రాలను పడగొట్టాలి.   53 ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించండి ఎందుకంటే మీరు స్వాధీనపరచుకోడానికి ఆ దేశాన్ని మీకు ఇచ్చాను.   54 చీట్లు వేసి మీ వంశాల ప్రకారం ఆ దేశాన్ని పంచుకోండి. పెద్ద గోత్రాలకు ఎక్కువ వారసత్వం చిన్న గోత్రాలకు తక్కువ వారసత్వంగా పంచుకోండి. చీట్లలో ఏది వస్తే, అది వారికి చెందుతుంది. మీ పూర్వికుల గోత్రాల ప్రకారం దానిని పంచుకోండి.   
 55 “ ‘అయితే ఆ దేశవాసులను మీరు తరిమివేయకపోతే, అక్కడ ఉండడానికి అనుమతించిన వారు మీ కళ్లలో ముళ్ళుగా, మీ ప్రక్కలలో శూలాలుగా చేసినవారవుతారు. మీరు నివసించే భూమిలో వారు మిమ్మల్ని కష్ట పెడతారు.   56 అప్పుడు నేను వారికేమి చేయాలని అనుకున్నానో, అది మీకు చేస్తాను.’ ”