34
కానాను సరిహద్దులు
యెహోవా మోషేతో ఇలా చెప్పారు, “నీవు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తూ వారికి ఇలా చెప్పు: ‘మీరు కనానులో ప్రవేశించిన తర్వాత, మీకు వారసత్వంగా కేటాయించబడే భూములకు చెందిన సరిహద్దులు:
 
“ ‘మీ దక్షిణం వైపు ఎదోము సరిహద్దు ప్రక్కన సీను ఎడారిలో కొద్ది భాగం ఉంటుంది. మీ దక్షిణ సరిహద్దు మృత సముద్రం*అంటే ఉప్పు సముద్రం యొక్క దక్షిణ చివర తూర్పు దిక్కున ప్రారంభమై, దక్షిణం వైపు అక్రబ్బీం కనుమ నుండి తిరిగి సీను వరకు వ్యాపించి కాదేషు బర్నియాకు దక్షిణంగా ఉంటుంది. అక్కడినుండి హజర్ అద్దారుకు, అక్కడినుండి అజ్మోను వరకు, అజ్మోను నుండి తిరిగి ఈజిప్టు వాగు వైపు తిరిగి మధ్యధరా సముద్రం దగ్గర ముగుస్తుంది.
మీ పడమటి సరిహద్దు మధ్యధరా సముద్ర తీరము. ఇదే మీ పడమటి వైపు సరిహద్దుగా ఉంటుంది.
మీ ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం నుండి హోరు పర్వతం వరకు హోరు పర్వతం నుండి లెబో హమాతు వరకు అక్కడినుండి సరిహద్దు సెదాదు వరకు వెళ్తూ, అక్కడినుండి జిఫ్రోను వరకు కొనసాగుతూ హజర్-ఎనాను వరకు వ్యాపిస్తుంది. ఇది మీకు ఉత్తర సరిహద్దుగా ఉంటుంది.
10 మీ తూర్పు సరిహద్దు హజర్-ఎనాను నుండి షెఫాము వరకు ఉంటుంది. 11 సరిహద్దు షెఫాము నుండి ఆయినుకు తూర్పు వైపు రిబ్లా వరకు వెళ్లి కిన్నెరెతు సరస్సుఅంటే గలలీ సరస్సు తూర్పున ఉన్న వాలుల వెంట కొనసాగుతుంది. 12 తర్వాత ఆ సరిహద్దు యొర్దాను గుండా వెళ్తూ మృత సముద్రం వరకు వ్యాపిస్తుంది.
 
“ ‘ఇది మీ దేశం, దీనికి అన్ని వైపుల సరిహద్దులు ఉంటాయి.’ ”
 
13 మోషే ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు చీట్లు వేసి ఈ దేశాన్ని ఒక వారసత్వంగా కేటాయించాలి. తొమ్మిదిన్నర గోత్రాలకు ఇవ్వమని యెహోవా ఆదేశించారు, 14 ఎందుకంటే రూబేను గోత్రికులు, గాదు గోత్రికులు, మనష్షే అర్థగోత్రం, తమ తమ కుటుంబాలు వారసత్వం పొందారు. 15 ఈ రెండున్నర గోత్రాల వారు యెరికోకు తూర్పున యొర్దానుకు అవతలి వైపు, సూర్యోదయం వైపున ఉన్న భూభాగాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నారు.”
16 యెహోవా మోషేతో అన్నారు, 17 “మీకు భూమిని స్వాస్థ్యంగా కేటాయించే పురుషుల పేర్లు ఇవి: యాజకుడైన ఎలియాజరు నూను కుమారుడైన యెహోషువ. 18 భూకేటాయింపు కోసం సహాయపడడానికి ప్రతి గోత్రం నుండి ఒక నాయకున్ని నియమించు.
 
19 “వారి పేర్లు ఇవి:
 
“యూదా గోత్రం నుండి, యెఫున్నె కుమారుడైన కాలేబు;
20 షిమ్యోను గోత్రం నుండి అమీహూదు కుమారుడైన షెమూయేలు;
21 బెన్యామీను గోత్రం నుండి కిస్లోను కుమారుడైన ఎలీదాదు;
22 దాను గోత్రం నుండి యొగ్లీ కుమారుడైన బుక్కీ నాయకుడు;
23 యోసేపు కుమారుడైన మనష్షే గోత్రం నుండి ఏఫోదు కుమారుడైన హన్నీయేలు నాయకుడు;
24 ఎఫ్రాయిం గోత్రం నుండి షిఫ్తాను కుమారుడైన కెమూయేలు నాయకుడు;
25 జెబూలూను గోత్రం నుండి పర్నాకు కుమారుడైన ఎలీషాపాను నాయకుడు;
26 ఇశ్శాఖారు గోత్రం నుండి అజ్జాను కుమారుడైన పల్తీయేలు నాయకుడు;
27 ఆషేరు గోత్రం నుండి షెలోమి కుమారుడైన అహీహూదు నాయకుడు;
28 నఫ్తాలి గోత్రం నుండి అమీహూదు కుమారుడైన పెదహేలు నాయకుడు.”
 
29 కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారసత్వ భూమిని కేటాయించడానికి యెహోవా ఈ పురుషులను నియమించారు.

*34:3 అంటే ఉప్పు సముద్రం

34:11 అంటే గలలీ సరస్సు