సామెతల
గ్రంథం
ఉద్దేశ్యం అంశం
1
1 దావీదు కుమారుడును ఇశ్రాయేలీయులకు రాజునైన, సొలొమోను యొక్క సామెతలు:
2 జ్ఞానాన్ని ఉపదేశాన్ని పొందడం కోసం;
అంతరార్థంతో కూడిన పదాలను గ్రహించడం కోసం;
3 వివేకంతో కూడిన ప్రవర్తన కోసం,
సరియైనది, న్యాయమైనది చేయడానికి ఉపదేశం పొందడం కోసం;
4 సామాన్యులకు*సామాన్యులకు సామెతల గ్రంథంలో, హెబ్రీలో ఉపయోగించబడిన పదం నైతిక దిశ లేకుండా, చెడు వైపు మొగ్గు చూపే, తెలివితక్కువ వ్యక్తిని సూచిస్తుంది. బుద్ధి కలిగించడం కోసం,
యవ్వనస్థులకు తెలివి వివేకం కలిగించడం కోసం,
5 జ్ఞానులు ఈ సామెతలు వింటారు, మరింత తెలివైనవారవుతారు,
వివేకంగలవారు ఉపదేశం పొందుకుంటారు.
6 వారు సామెతలు, నీతికథలు,
జ్ఞానుల సూక్తులు, చిక్కుప్రశ్నలను గ్రహిస్తారు.
7 యెహోవాయందు భయం తెలివికి మూలం,
అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు.
ముందుమాట: జ్ఞానాన్ని హత్తుకోమని హెచ్చరికలు
పాపిష్ఠి మనుష్యుల ఆహ్వానానికి వ్యతిరేకంగా హెచ్చరిక
8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని విను
నీ తల్లి బోధను త్రోసివేయవద్దు.
9 అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా
నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి.
10 నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే,
నీవు వారికి లొంగిపోవద్దు.
11 ఒకవేళ వారు, “మాతో కూడా రా;
నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి దాగి ఉందాం;
హాని చేయని ప్రాణం మీద ఆకస్మిక దాడి చేద్దాం;
12 పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం,
సమాధిలోనికి దిగువారి వలె పూర్ణబలంతో ఉండగానే వారిని మ్రింగివేద్దాం;
13 అన్ని రకాల విలువైన వస్తువులు మనం తెచ్చి
మన ఇళ్ళను దోపుడు సొమ్ముతో నింపుకొందాం;
14 మాతో చీట్లు వేయండి;
మనం దొంగిలించిన దానిని మనమందరం పంచుకుందాము.”
15 నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి,
వారి దారుల్లో నీ పాదాలు పెట్టకు;
16 కీడు చేయడానికి వారి పాదాలు పరుగెత్తుతాయి,
మనుష్యులను చంపడానికి త్వరపడతారు.
17 రెక్కలు గల పక్షులు చూస్తుండగా
వల వేయడం నిష్ప్రయోజనం!
18 అయితే ఈ మనుష్యులు తమ నాశనానికే పొంచి ఉంటారు;
తమ ప్రాణాన్ని తామే తీసుకోవడానికి వారు దాక్కొని ఉంటారు!
19 అక్రమ సంపాదన వెంటపడే వారందరి దారులు అలాంటివే;
అది దానిని సొంతం చేసుకున్న వారి ప్రాణాలు తీస్తుంది.
జ్ఞానం యొక్క మందలింపు
20 జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తున్నది,
అది బహిరంగ స్థలాల్లో తన గొంతు గట్టిగా వినిపిస్తుంది;
21 అధిక రద్దీ ఉండే వీధి చివర్లలో అది కేక వేస్తుంది,
పట్టణ ద్వారాల దగ్గర ఆమె తన ప్రసంగం చేస్తుంది:
22 “బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు?
ఎగతాళి చేసేవారు ఎన్నాళ్ళు ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు?
బుద్ధిహీనులు ఎన్నాళ్ళు తెలివిని అసహ్యించుకుంటారు?
23 నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి!
అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను,
నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను.
24 కానీ నేను పిలిచినప్పుడు మీరు వినడానికి నిరాకరించినందున
నేను నా చేయి చాచినప్పుడు ఎవరూ పట్టించుకోనందున,
25 మీరు నా సలహాను లెక్కచేయనందున
నా గద్దింపును అంగీకరించనందున,
26 ఆపద మిమ్మల్ని తాకినప్పుడు నేను నవ్వుతాను;
విపత్తు మిమ్మల్ని అధిగమించినప్పుడు నేను ఎగతాళి చేస్తాను,
27 విపత్తు తుఫానులా మిమ్మల్ని అధిగమించినప్పుడు,
ఆపద మిమ్మల్ని తుఫానులా ముంచినప్పుడు,
మీకు బాధ ఇబ్బంది కలిగినప్పుడు నేను ఎగతాళి చేస్తాను.
28 “అప్పుడు వారు నాకు మొరపెడతారు కాని నేను జవాబు ఇవ్వను;
నా కోసం ఆతురతగా వెదకుతారు కాని నేను కనబడను,
29 వారు జ్ఞానాన్ని అసహ్యించుకున్నారు,
యెహోవాకు భయపడాలని వారు కోరలేదు కాబట్టి.
30 వారు నా సలహాను అంగీకరించలేదు
నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి,
31 వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు
వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.
32 మూర్ఖులు దారితప్పడం వల్ల నశిస్తారు,
బుద్ధిహీనుల నిర్లక్ష్యం వారిని నాశనం చేస్తుంది;
33 నా మాటలను వినేవారు క్షేమంగా నివసిస్తారు;
కీడు కలుగుతుందనే భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు.”
*1:4 సామాన్యులకు సామెతల గ్రంథంలో, హెబ్రీలో ఉపయోగించబడిన పదం నైతిక దిశ లేకుండా, చెడు వైపు మొగ్గు చూపే, తెలివితక్కువ వ్యక్తిని సూచిస్తుంది.