28
1 ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు,
కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు.
2 ఒక దేశం తిరుగుబాటు చేసినప్పుడు, దానికి చాలామంది పాలకులు ఉంటారు,
కానీ వివేచన జ్ఞానంగల మనుష్యులు క్రమాన్ని పాటిస్తారు.
3 పేదలను హింసించే ఒక పేదవాడు
పంటను తుడిచిపెట్టుకుపోయే వర్షం లాంటివాడు.
4 బోధనను విడిచిపెట్టిన వారు దుష్టులను పొగడుతారు,
కాని దానిని లక్ష్యపెట్టేవారు దుష్టులను వ్యతిరేకిస్తారు.
5 కీడుచేసేవారు సరియైనది గ్రహించరు,
కాని యెహోవాను ఆశ్రయించువారు దాన్ని పూర్తిగా గ్రహిస్తారు.
6 మూర్ఖమైన మార్గాలు అనుసరించే ధనికుని కంటే,
నిందారహితంగా నడుచుకొనే పేదవాడు మేలు.
7 వివేకవంతుడైన కుమారుడు బోధనకు శ్రద్ధ వహిస్తాడు,
కాని తిండిబోతు సహచరుడు తన తండ్రిని అవమానపరుస్తాడు.
8 పేదవాని నుండి వడ్డిచేత గాని లేదా లాభంచేత గాని ఆస్తి పెంచుకొనువాడు
పేదవారి పట్ల దయ చూపే మరొకరికి దాన్ని కూడ పెడుతున్నాడు.
9 ఒకవేళ ఎవరైనా నా బోధను పెడచెవిని పెడితే,
వారి ప్రార్థనలు కూడా అసహ్యకరమైనవి.
10 యథార్థమైన వారిని చెడు దారిలోకి నడిపించేవారు,
తమ ఉచ్చులో తామే పడతారు,
కాని నిందారహితులు మంచి వారసత్వాన్ని పొందుకుంటారు.
11 ధనవంతులు తమ కళ్లకు తామే జ్ఞానులు;
వివేకంగల పేదవారు వారు ఎంత మోసపూరితమైనవారో చూస్తారు.
12 నీతిమంతులు విజయం సాధించినప్పుడు, గొప్ప ఉల్లాసం ఉంటుంది;
కాని దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రజలు దాక్కుంటారు.
13 తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు,
కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.
14 దేవుని ఎదుట ఎప్పుడూ భయంతో వణికేవారు ధన్యులు,
కాని తమ హృదయాలను కఠినం చేసుకొనే వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారు.
15 నిస్సహాయ ప్రజలను పైన ఉన్న దుష్ట పాలకుడు
గర్జించే సింహం లేదా దాడి చేసే ఎలుగుబంటిలాంటి వాడు.
16 ఒక నిరంకుశ పాలకుడు బలాత్కారాన్ని అభ్యసిస్తాడు,
కాని చెడుతో సంపాదించిన లాభాన్ని ద్వేషించేవాడు సుదీర్ఘ పాలనను అనుభవిస్తాడు.
17 హత్యచేసిన అపరాధభావంతో బాధించబడే వారు
సమాధిలో ఆశ్రయం వెదకుతారు;
ఎవరు వారిని ఆపకూడదు.
18 ఎవరి నడక నిందారహితంగా ఉంటుందో వారు భద్రంగా ఉంచబడతారు,
కాని ఎవరి మార్గాలు మూర్ఖంగా ఉంటాయో వారు హఠాత్తుగా గొయ్యిలో పడిపోతారు.
19 తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది,
కానీ పగటి కలల వెంటపడేవారికి దరిద్రత నిండుతుంది.
20 నమ్మకమైన వ్యక్తి అధికంగా దీవించబడతాడు,
కాని ధనము సంపాదించాలని ఆరాటపడేవాడు శిక్ష పొందక మానడు.
21 పక్షపాతం చూపడం మంచిది కాదు
అయినా రొట్టె ముక్క కోసం మనుష్యులు తప్పు చేస్తారు.
22 పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు
అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు.
23 నాలుకతో పొగిడే వారికన్నా,
మనుష్యులను గద్దించేవారే చివరికి ఎక్కువ ఇష్టమవుతారు.
24 తన తల్లిదండ్రులను దోచుకొని
“ఇది ద్రోహం కాదు” అనేవాడు
నాశనం చేసేవానికి భాగస్వామి.
25 దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు,
కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు.
26 తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు,
కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు.
27 పేదవారికి ఇచ్చేవారికి ఏదీ కొదువ కాదు,
కాని వారి పట్ల కళ్లు మూసుకొనే వారికి అనేక శాపాలు కలుగుతాయి.
28 దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు;
కాని దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు వృద్ధిచెందుతారు.