29
 1 ఎన్నిమారులు గద్దించినను మాట విననివాడు  
తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు.   
 2 నీతిమంతులు వృద్ధి చెందినప్పుడు ప్రజలు సంతోషిస్తారు;  
దుష్టులు ఏలునపుడు, ప్రజలు మూల్గుతారు.   
 3 జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రికి ఆనందం కలిగిస్తాడు,  
కానీ వేశ్యల సహచరుడు తన సంపదను నాశనం చేస్తాడు.   
 4 న్యాయం ద్వారా ఒక రాజు దేశానికి స్థిరత్వాన్ని ఇస్తాడు,  
కాని లంచం కోసం అత్యాశపడేవారు దానిని కూల్చివేస్తారు.   
 5 పొరుగువారిని పొగడేవారు  
వారి పాదాలకు వలలు వేస్తున్నారు.   
 6 కీడుచేసేవారు తమ సొంత పాపం ద్వార చిక్కుకుంటారు,  
కాని నీతిమంతుడు ఆనందంతో కేకలు వేస్తాడు సంతోషంగా ఉంటాడు.   
 7 నీతిమంతులు పేదవారికి న్యాయం జరగాలని చూస్తారు,  
కాని దుష్టులకు అలాంటి ఆలోచించరు.   
 8 ఎగతాళి చేసేవారు పట్టణాన్ని తల్లడిల్లజేస్తారు,  
జ్ఞానులు కోపం చల్లార్చెదరు.   
 9 ఒకవేళ జ్ఞానియైన వ్యక్తి మూర్ఖునితో న్యాయస్థానానికి వెళ్తే,  
బుద్ధిహీనుడు కోపంతో ఎగతాళి చేస్తాడు, అప్పుడు అక్కడ వారికి సమాధానం ఉండదు.   
 10 రక్తపిపాసులు నిజాయితీ కల వ్యక్తిని ద్వేషిస్తారు  
యథార్థవంతులను చంపాలని చూస్తారు.   
 11 మూర్ఖులు వారి కోపాన్ని వెదజల్లుతారు,  
కాని జ్ఞానులు చివరికి ప్రశాంతత తెస్తారు.   
 12 ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే,  
తన అధికారులంతా దుష్టులవుతారు.   
 13 పేదవారు అణగారినవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు:  
వీరిద్దరి కళ్లకు చూపు ఇచ్చేవాడు యెహోవా.   
 14 ఏ రాజు పేదలకు సత్యంగా న్యాయం తీరుస్తాడో,  
ఆ రాజు సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది.   
 15 బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది,  
కానీ క్రమశిక్షణ చేయబడని పిల్లవాడు తన తల్లిని అగౌరపరుస్తాడు.   
 16 దుష్టులు వృద్ధిచెందునప్పుడు పాపం కూడా వృద్ధిచెందుతుంది,  
అయితే వారి పతనాన్ని నీతిమంతులు కళ్లారా చూస్తారు.   
 17 మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు;  
మీరు కోరుకునే ఆనందాన్ని వారు మీకు ఇస్తారు.   
 18 దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు;  
కాని జ్ఞానం యొక్క బోధ పట్ల శ్రద్ధ చూపేవాడు ధన్యుడు.   
 19 సేవకులు కేవలం మాటల ద్వారా సరిదిద్దబడరు;  
వారు గ్రహించినా సరే స్పందించరు.   
 20 త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా?  
వారికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ.   
 21 చిన్నప్పటి నుండి గారాబం పొందుకున్న దాసుడు  
పెంకితనం గలవానిగా అవుతాడు.   
 22 ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు  
మహా కోపిష్ఠియైన వ్యక్తి అనేక పాపాలు చేస్తాడు.   
 23 గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది,  
అయితే ఆత్మలో దీనుడైనవాడు గౌరవాన్ని పొందుతారు.   
 24 దొంగల సహచరుడు తనను తాను గాయపరచుకుంటాడు;  
మీరు నిజం చెప్పమని ప్రమాణం చేశారు, కాని మీరు సాక్ష్యం చెప్పే ధైర్యం లేదు.   
 25 మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది,  
కాని యెహోవాయందు నమ్మిక ఉంచేవారు క్షేమంగా ఉంటారు.   
 26 పాలకునితో ప్రేక్షకులు ఉండాలని చాలామంది కోరుకుంటారు,  
అయితే న్యాయం యెహోవా నుండి వస్తుంది.   
 27 నీతిమంతులు నిజాయితీ లేనివారిని అసహ్యించుకుంటారు;  
దుష్టులు యథార్థవంతులను అసహ్యించుకుంటారు.