అగూరు యొక్క సూక్తులు  
 30
 1 యాకె కుమారుడైన అగూరు సూక్తులు.  
ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట:  
“దేవా, నేను అలసిపోయాను,  
కాని నేను గెలుస్తాను.   
 2 నిజంగా నేను క్రూరమైనవాన్ని, మనుష్యుని కాదు;  
మనుష్యులకు ఉండే ఇంగిత జ్ఞానం నాకు లేదు.   
 3 నేను జ్ఞానాన్ని అభ్యాసం చేయలేదు,  
పరిశుద్ధుని గురించిన తెలివి నాకు లేదు.   
 4 ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు?  
తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు?  
బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు?  
భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు?  
ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి?  
ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి!   
 5 “దేవుని మాటలు పరీక్షించబడినవి;  
ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు.   
 6 ఆయన మాటలకు కలపవద్దు,  
ఆయన నిన్ను గద్దించి నిన్ను అబద్ధికుడవని నిరూపిస్తారు.   
 7 “యెహోవా, నేను మీ నుండి రెండింటిని అడిగాను;  
నేను చనిపోకముందు వాటిని నాకు ఇవ్వండి:   
 8 అసత్యాన్ని అబద్ధాలను నాకు దూరంగా ఉంచండి;  
దరిద్రతను గాని ధనాన్ని గాని నాకు ఇవ్వకండి,  
కాని నా వాటాను మాత్రం నాకు ఇవ్వండి.   
 9 ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి,  
‘యెహోవా ఎవరు?’ అని అంటానేమో  
పేదవాడినైతే దొంగతనం చేసి  
నా దేవుని నామానికి అవమానం తెస్తానేమో.   
 10 “పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు,  
వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు.   
 11 “తమ తండ్రిని శపించేవారు  
తమ తల్లిని దీవించని వారు ఉన్నారు;   
 12 తమ కళ్లకు తాము పవిత్రులై  
తమ మలినం కడుగబడని వారు ఉన్నారు;   
 13 అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు,  
వారి చూపులు అసహ్యం;   
 14 భూమి మీద ఉండకుండా వారు పేదవారిని మ్రింగుదురు  
మనుష్యుల్లో బీదలు లేకుండా నశింపజేయుదురు  
కత్తి వంటి పళ్ళును,  
కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు.   
 15 “జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు,  
వారు ‘ఇవ్వు, ఇవ్వు!’ అని అరుస్తారు.  
“తృప్తిలేనివి మూడు కలవు,  
‘చాలు!’ అననివి నాలుగు కలవు:   
 16 అవి ఏమనగా పాతాళం,  
పిల్లలు కనని గర్భం;  
నీరు చాలు అనని భూమి  
నీరు చాలు అనని అగ్ని.   
 17 “తండ్రిని ఎగతాళి చేసి  
తల్లి మాట వినని  
వాని కన్ను లోయకాకులు పీకుతాయి  
పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి.   
 18 “మూడు అద్భుతమైనవి కలవు,  
నాకు అర్థం కానివి నాలుగు కలవు:   
 19 అవేమనగా ఆకాశాన గ్రద్ద జాడ,  
బండ మీద పాము జాడ,  
అగాధ సముద్రంలో ఓడ నడుచు జాడ,  
పెండ్లికాని స్త్రీతో పురుషుని జాడ.   
 20 “వేశ్య యొక్క పనియు అట్టిదే;  
అది తిని నోరు తుడుచుకుని  
నేను ఏ చెడు చేయలేదు అని అంటుంది.   
 21 “భూమిని వణికించునవి మూడు కలవు,  
అవి భరించలేనివి నాలుగు కలవు.   
 22 అవి ఏమనగా రాజరికానికి వచ్చిన దాసుడు,  
తినడానికి పుష్కలంగా ఉన్న దైవభక్తి లేని మూర్ఖుడు,   
 23 పెళ్ళి చేసుకున్న ధిక్కార స్త్రీ,  
యజమానురాలి స్థానాన్ని తీసుకున్న చేసికొన్న దాసి.   
 24 “భూమి మీద చిన్నవి నాలుగు కలవు  
అయినా అవి మిక్కిలి తెలివిగలవి.   
 25 చీమలు బలంలేని ప్రాణులైనా,  
అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి.   
 26 చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా,  
అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి.   
 27 మిడతలకు రాజు లేడు,  
అయినా అవి బారులు తీరి సాగిపోతాయి.   
 28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు  
అయినా రాజుల ఇండ్లలో అది ఉంటుంది.   
 29 “డంబంగా నడిచేవి మూడు కలవు,  
బడాయిగా నడిచేవి నాలుగు కలవు:   
 30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది.   
 31 కోడిపుంజు,  
మేకపోతు  
తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు.   
 32 “నీవు బుద్ధిలేనివాడవై గర్వపడిన యెడల  
కీడు ఆలోచించిన యెడల  
నీ చేతితో నోరు మూసుకో.   
 33 పాలు తరచగా వెన్న వస్తుంది  
ముక్కు పిండగా రక్తం వస్తుంది  
కోపం రేపగా తగవు పుడుతుంది.”