కీర్తన 33
నీతిమంతులారా, యెహోవాకు ఆనందంతో పాడండి;
ఆయనను స్తుతించడం యథార్థవంతులకు తగినది.
సితారాతో యెహోవాను స్తుతించండి;
పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి.
ఆయనకు క్రొత్త పాట పాడండి;
నైపుణ్యతతో వాయించండి, ఆనందంతో కేకలు వేయండి.
 
యెహోవా వాక్కు న్యాయమైనది;
ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది.
యెహోవా నీతిన్యాయాలను ప్రేమిస్తారు;
భూమంతా ఆయన మారని ప్రేమతో నిండిపోయింది.
 
యెహోవా మాటతో ఆకాశాలు చేయబడ్డాయి,
ఆయన నోటి శ్వాసతో నక్షత్ర కూటమి కలిగింది.
ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూర్చుతారు;
అగాధాలను ఆయన గోదాములలో ఉంచుతారు.
భూమంతా యెహోవాకు భయపడును గాక;
లోక ప్రజలందరు ఆయనను గౌరవించుదురు గాక.
ఆయన మాట్లాడారు అది జరిగింది;
ఆయన ఆజ్ఞాపించారు అది దృఢంగా నిలబడింది.
 
10 యెహోవా దేశాల ప్రణాళికలను విఫలం చేస్తారు;
ప్రజల ఉద్దేశాలను ఆయన అడ్డుకుంటారు.
11 కానీ యెహోవా ప్రణాళికలు శాశ్వతంగా నిలుస్తాయి,
ఆయన హృదయ ఉద్దేశాలు అన్ని తరాల వరకు ఉంటాయి.
 
12 యెహోవాను దేవునిగా కలిగిన దేశం ధన్యమైనది.
తన వారసత్వంగా ఆయన తన కోసం ఎంచుకున్న ప్రజలు ధన్యులు.
13 ఆకాశం నుండి యెహోవా క్రిందకు చూస్తున్నారు
ఆయన మనుష్యులందరిని కనిపెడుతున్నారు.
14 ఆయన తన నివాసస్థలం నుండి
భూమిపై నివసించే వారందరినీ పరిశీలిస్తున్నారు.
15 అందరి హృదయాలను రూపించింది ఆయనే,
వారు చేసే ప్రతిదీ ఆయన గమనిస్తారు.
 
16 ఏ రాజు తన సైనిక బలంతో రక్షించబడడు;
ఏ యోధుడు తన గొప్ప శక్తితో తప్పించుకోడు.
17 విడుదల పొందడానికి గుర్రం ఉపయోగపడదు;
దానికి గొప్ప బలం ఉన్నా అది ఎవరిని రక్షించలేదు.
18 కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన,
తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి.
19 ఆయన మరణం నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తారు,
కరువు సమయంలో వారిని సజీవులుగా ఉంచుతారు.
 
20 మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం;
మనకు సహాయం మనకు డాలు ఆయనే.
21 మన హృదయాలు ఆయనలో ఆనందిస్తాయి,
ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధ నామాన్ని నమ్ముకున్నాము.
22 యెహోవా, మేము మా నిరీక్షణ మీలో ఉంచాం కాబట్టి,
యెహోవా, మీ మారని ప్రేమ మాతో ఉండును గాక.