కీర్తన 34
అబీమెలెకు ఎదుట వెర్రి వానిలా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు వ్రాసిన కీర్తన.
1 నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను;
ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది.
2 నేను యెహోవాలో అతిశయిస్తాను.
బాధించబడినవారు ఇది విని సంతోషించుదురు గాక!
3 నాతో కలిసి యెహోవాను మహిమపరచండి;
మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.
4 నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు;
నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.
5 ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది;
వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు.
6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు
కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు.
7 యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి,
వారిని విడిపిస్తాడు.
8 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి;
ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.
9 యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి,
ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు.
10 సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు,
కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.
11 నా పిల్లలారా, రండి, నా మాట వినండి;
నేను మీకు యెహోవా పట్ల భయాన్ని బోధిస్తాను.
12 మీలో ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో
ఎవరు ఎక్కువ మంచి రోజులను చూడాలనుకుంటారో
13 మీరు చెడు పలుకకుండ మీ నాలుకను,
అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి.
14 కీడు చేయడం మాని మేలు చేయాలి;
సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
15 యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి,
ఆయన చెవులు వారి మొరను వింటాయి;
16 అయితే కీడుచేసేవారి జ్ఞాపకాన్ని భూమి మీద లేకుండా చేయడానికి
యెహోవా ముఖం వారికి విరోధంగా ఉన్నది.
17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారు;
వారి ఇబ్బందులన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారు.
18 విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు.
ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు.
19 నీతిమంతులకు అనేక శ్రమలు కలుగవచ్చు,
కాని, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు.
20 వారి ఎముకలన్నిటిని ఆయన కాపాడతారు,
ఒక్క ఎముక కూడా విరగదు.
21 చెడుతనం దుష్టులను నాశనం చేస్తుంది;
నీతిమంతుల శత్రువులు శిక్షింపబడతారు.
22 యెహోవా తన సేవకులను విడిపిస్తారు;
ఆయనను ఆశ్రయించిన వారిలో ఎవరూ శిక్షింపబడరు.
*^ ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి