కీర్తన 76
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము.
1 యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు;
ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది.
2 షాలేములో ఆయన గుడారం ఉంది.
సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది.
3 అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు,
డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు.
సెలా
4 వేటకు ప్రసిద్ధి చెందిన పర్వతాల కంటే,
మీరు గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్నారు.
5 బలవంతులు దోపిడి చేయబడ్డారు,
వారు నిద్రపోయారు.
ఏ ఒక్క యోధుడు
మాకు వ్యతిరేకంగా చేయి ఎత్తలేడు.
6 యాకోబు దేవా! మీరు గద్దిస్తే
గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి.
7 మీ ఒక్కరికే భయపడాలి.
మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు?
8 పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు,
దేశం భయపడి మౌనం వహించింది.
9 ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి,
తీర్పు తీర్చడానికి మీరు లేచారు.
సెలా
10 మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది,
మీ ఉగ్రత నుండి తప్పించుకున్న వారిని మీరు ఆయుధంగా ధరించుకుంటారు.*లేదా మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్నవారు నియంత్రించబడతారు
11 దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి;
పొరుగు దేశాలన్నీ
భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక.
12 పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు;
భూరాజులు ఆయనను చూసి భయపడాలి.
*కీర్తన 76:10 లేదా మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్నవారు నియంత్రించబడతారు