కీర్తన 79
ఆసాపు కీర్తన. 
  1 ఓ దేవా, పరదేశులు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు;  
అవి మీ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేశారు,  
యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు.   
 2 వారు మీ సేవకుల కళేబరాలను  
ఆకాశపక్షులకు ఆహారంగా,  
మీ సొంత ప్రజల మాంసాన్ని అడవి మృగాలకు ఆహారంగా వదిలేశారు.   
 3 వారు యెరూషలేము చుట్టూ  
రక్తాన్ని నీటిలా పారబోశారు,  
చనిపోయినవారిని పాతిపెట్టడానికి ఎవరూ లేరు.   
 4 మా పొరుగువారికి మేము అసహ్యులం అయ్యాం,  
మా చుట్టుపక్కల వారు మమ్మల్ని వెక్కిరించి హేళన చేస్తున్నారు.   
 5 ఎంతకాలం, యెహోవా? మీరు ఎప్పటికీ కోప్పడతారా?  
ఎంతకాలం మీ రోషం అగ్నిలా మండుతుంది?   
 6 మిమ్మల్ని గుర్తించని దేశాల మీద,  
మీ పేరట మొరపెట్టని,  
రాజ్యాల మీద,  
మీ ఉగ్రతను కుమ్మరించండి.   
 7 వారు యాకోబును మ్రింగివేశారు  
అతని నివాసాన్ని నాశనం చేశారు.   
 8 గత తరాల పాపాలను మాకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోకండి;  
మీ కరుణను త్వరగా మాపై చూపండి,  
ఎందుకంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాము.   
 9 దేవా మా రక్షకా, మీ నామ మహిమార్థమై  
మాకు సాయం చేయండి;  
మీ నామాన్ని బట్టి  
మమ్మల్ని విడిపించి మా పాపాలను క్షమించండి.   
 10 “వారి దేవుడు ఎక్కడ?”  
అని ఇతర దేశాలు ఎందుకు అనాలి?  
మీ సేవకుల రక్తానికి మీరు ప్రతీకారం తీర్చుకుంటారని  
మా కళ్ళెదుట ఇతర దేశాల వారికి తెలియజేయండి.   
 11 ఖైదీల నిట్టూర్పులు మీ ఎదుటకు వచ్చును గాక;  
మీ బలమైన చేతితో మరణశిక్ష విధించబడిన వారిని కాపాడండి.   
 12 ప్రభువా, మా పొరుగువారు మీమీద చూపిన ధిక్కారణకు ప్రతిగా  
వారి ఒడిలోకి ఏడంతలు తిరిగి చెల్లించండి.   
 13 అప్పుడు మీ ప్రజలు, మీరు మేపే గొర్రెలమైన మేము,  
మిమ్మల్ని నిత్యం స్తుతిస్తాము;  
తరతరాలకు మీ కీర్తిని ప్రకటిస్తాం.