కీర్తన 82
ఆసాపు కీర్తన.
దేవుడు గొప్ప సభలో నిలబడి ఉన్నారు;
ఆయన దైవముల మధ్య తీర్పు ఇస్తారు:
 
“మీరు ఎంతకాలం అన్యాయాలను సమర్థిస్తారు
దుష్టులకు పక్షపాతం చూపిస్తారు?
సెలా
బలహీనులు, తండ్రిలేనివారి పక్షం వహించండి;
పేదలకు అణచివేయబడిన వారికి న్యాయం చేయండి.
బలహీనులను అవసరతలో ఉన్నవారిని కాపాడండి;
దుష్టుల చేతి నుండి వారిని విడిపించండి.
 
“వారికి ఏమి తెలియదు, వారు ఏమి గ్రహించరు.
వారు చీకటిలో తిరుగుతారు;
భూమి పునాదులు కదిలిపోయాయి.
 
“ ‘మీరు “దేవుళ్ళు”;
మీరంతా మహోన్నతుని కుమారులు.’
అయితే మీరు ఇతర మనుష్యుల్లా చస్తారు;
ఇతర పాలకుల్లా మీరు కూలిపోతారు, అని నేనన్నాను.”
 
ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి,
ఎందుకంటే అన్ని దేశాలు మీ వారసత్వంగా ఉన్నాయి.